పవిత్ర రమదాన్ విశిష్టత

- July 05, 2016 , by Maagulf

ఏ మతానికి చెందిన పండుగైనా .. దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. నిజానికి మొత్తం మానవాళి హితాన్ని ఆకాంక్షించే సందర్భమే పండుగ. రమదాన్ ' సైతం ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఇస్లామీయ కేలండర్లో  9వ మాసం 'రమదాన్'. ఈ మాసంలోనే 'దివ్య ఖురాన్' అవిర్భవించింది. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రమదాన్ మాసం'. ఈ పావన సమయంలో భక్తితో ఉపవాసం చేసిన వారి అన్ని తప్పులూ మన్నించబడతాయనీ, వీరంతా  'రయ్యాన్' అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గ ప్రవేశం చేస్తారనీ పవిత్ర ఖురాన్ చెబుతోంది. 
ఉపవాస విధి..
ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . దీనిని  పార్సీలో ' రోజా ' అనీ, అరబ్బీ భాషలో సౌమ్ అంటారు. ఈ మాసమంతా  తెల్లవారుజామున భోజనం(సహర్)  చేసి, రోజంతా ఉపవాసం ఉండి, సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భోజనం (ఇఫ్తార్ ) చేస్తారు. ఉపవాసదీక్ష చేసేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటూ, శారీరక, మానసిక వాంఛలకు దూరంగా, నిగ్రహంతో వుంటూ ఆసాంతం దైవచింతనతో గడుపుతూ వుంటారు. వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడిన ఉపవాస దీక్ష విషయంలో వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారికి మినహాయింపు ఉంది.
 ఉపవాసమంటే  కేవలం ఆహార పానీయాలను మానివేయడం మాత్రమే కాదు.  దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడిపట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందింపజేయడమే.  ఉపవాస దీక్ష మూలంగా  అల్లాహ్ పట్ల విశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది. పరలోక భీతి, సహనం పెంపొందుట, దుర్వ్యసనాల నుంచి విముక్తి , దీనులపై జాలి  కలుగుట, మనుషులంతా ఒక్కటనే భావన పెంపొందుట, ఆహారం పట్ల వ్యామోహం తగ్గుట , తద్వారా జీర్ణశక్తి మెరుగుపడుట వంటి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
జకాత్ (దానం)
రమదాన్ నెలలో ఉపవాసానికి ఎంత ప్రాధాన్యం ఉందో దానానికీ అంటే విలువ ఉంది. సంపన్నులు,  సంపాదనాపరులంతా ఈ మాసంలో  జకాత్ ' అచరించాలని దివ్య ఖురాన్ బోధిస్తోంది. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం(2.5%) చొప్పున ధన, వస్తు రూపంలో నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా సంతోషంగా పండుగ జరుపుకొనేలా చూడటమే ' జకాత్ ప్రధాన ఉద్దేశ్యం. జకాత్' తో పాటు ' ఫిత్రా' దానానికి రమదాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత వుంది. తిండి, బట్టకు నోచుకోని అభాగ్యులకు  50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ , దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెడతారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా ..  కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేస్తారు. ఉపవాస సమయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, పలికిన  అసత్యాలు, అనవసరపు మాటల వల్ల కలిగే పాపాన్ని ఈ ఫిత్రా దానం పటాపంచలు చేస్తుందని దివ్య ఖురాన్ చెబుతోంది.   
జీవితాన్ని పావనం చేసే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఆకాంక్షిస్తూ  దైవం సమస్త జనులకూ శుభాలను సమృద్ధిగా ప్రసాదించాలని మనసారా కోరుకుందాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com