త్యాగం.. సహనం.. దైవ చింతనకు ప్రతీక 'ఈద్‌ ఉల్‌ జుహా'

- September 11, 2016 , by Maagulf
త్యాగం.. సహనం.. దైవ చింతనకు ప్రతీక  'ఈద్‌ ఉల్‌ జుహా'

జీవితంలో ఎన్ని కష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా మనం విశ్వసించిన దేవుడినే నమ్మాలని, కష్టాల్లోను త్యాగం, సహనం, ఆరాధించే తత్వాన్ని విడనాడకూడదని బక్రీద్‌ పండుగ బోదిస్తుంది. 'ఈద్‌ ఉల్‌ జుహా' లేదా 'ఈద్‌ ఉల్‌ అజా' అని కూడా పిలిచే ఈ పండుగను  ముస్లీం సోదరులు మంగళవారం  జరుపుకోనున్నారు. ముస్లీంలు విశ్వసించే హిజ్రి క్యాలెండర్‌ ప్రకారం ఆఖరు మాసమైన ఈ పండుగ చరిత్రాత్మక కథనం నేటి ముస్లీంలకు ఎంతో స్పూర్తిని, త్యాగాన్ని బోధిస్తుంది.ముస్లీంల పవిత్ర గ్రంధం ఖురాన్‌ మత పెద్దల కథనం ప్రకారం ఈ పండుగ విశేషాలు ఇలా ఉన్నాయి... నిరంతరం దైవచింతన గల ఇబ్రహీం ప్రవక్తను 'అల్లా' చాలా రకాలుగా పరీక్షిస్తాడు. ఈ ప్రవక్తత తన 80ఏళ్ల వయస్సులో ఇస్మయిల్‌ జన్మిస్తాడు. వృద్ధాప్యంలో పుట్టిన శిశువును అల్లారుముద్దుగా పెంచుతుండగా ఓ రోజు ఇబ్రహీం ప్రవక్తకు నీకు అత్యంత ప్రీతివంతమైన వస్తువును నాకోసం కుర్బానీ (తెగించు) ఇవ్వమని అల్లా కలలో కోరుతాడు. తన వద్ద గల ఒంటెల మంద నుంచి ఇష్టమైన ఒంటెను కుర్బానీ ఇవ్వగా మరుసటి రోజు తిరిగి అదే కల వస్తుంది. రెండవ రోజు మరో ఒంటెను కుర్బానీ ఇవ్వగా తిరిగి అదే కల వస్తుంది. దాంతో తాను ఇచ్చిన కుర్బానీని అల్లా స్వీకరించలేదని తెలుసుకున్న ఆయన తనకు ప్రపంచంలో అత్యంత ప్రీతిపాత్రమైంది తన సంతానమేనని నిర్ధారించుకుంటారు. తన కుమారుడు ఇస్మాయిల్‌ను కుర్బానీ ఇవ్వడానికి అడవి (మీన మైదానం)కి తీసుకెళుతుంటారు. మార్గంలో మూడు వేరువేరు మానవ రూపాల్లో వచ్చిన సైతాన్‌ (పిశాచం) 'నీ తండ్రి నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళుతున్నాడంటూ' ఇస్మాయిల్‌కు చెబుతారు. తన తండ్రి మాటను తాను శిరసావహిస్తానని మధ్యలో మీరెవ్వరు రావద్దంటూ ఆ చిన్నారి రాళ్లతో ఆ పిశాచాలను తరిమేస్తాడు. (హజ్‌ యాత్రలో ఇప్పటికీ ఈ సందర్భానికి గుర్తు చేసుకొంటూ రాళ్లు రువ్వుతారు) ఆ తరువాత ఖుర్బానీ ఇవ్వడానికి కట్టెలు పేర్చి కత్తి సిద్ధం చేయగానే అల్లా ఇబ్రాహీం ప్రవక్త చర్యలకు సంతోషించి ఇస్మాయిల్‌ స్థానంలో  ముళ్లకంపలో చిక్కుకొన్న ఒక  గొర్రె పొట్టేలును వారికి కనబడేలా పంపిస్తారు. అ గొర్రెను ఖుర్బానీ ఇచ్చిన తరువాత ఇక నుంచి ప్రతి జుల్‌ హజ్జా నెలలో ఇలా చేయాలని అల్లా ఆదేశించారు. అప్పటి నుంచి ఈ పండుగ వాడుకలోకి వచ్చిందని మత పెద్దలు అంటారు.

ఇబ్రహీంకు ఎన్నో పరీక్షలు...
ఇస్లాం మతానికి అత్యంత కీలకమైన ఇబ్రహీం ప్రవక్త అల్లా నుంచి ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. ఆయన పాదముద్రలు ముస్లీంలకు అత్యంత పవిత్రమైన ప్రార్థనా మందిరం (కాబా)లో నేటికి ఉన్నాయి. అల్లా ఆదేశానుసారం తన భార్య హాజెరా వృద్ధాప్యంలో జన్మించిన ఇస్మాయిల్‌ ఇరువురిని అడవిలో వదిలేసి వస్తారు. అడవిలో మూడు రోజుల అనంతరం పసిబాలుడు ఇస్మాయిల్‌కు బాగా దప్పికై ఏడుస్తుంటే నీళ్లకోసం ఆయన తల్లి సఫా, మర్వా అనే రెండు పర్వతాల మధ్య పరుగులు తీస్తుంది. అయినా నీళ్లు లభించకపోగా దప్పికతో విలవిల్లాడిన ఇస్మాయిల్‌ కాళ్లు నేలకేసి రాకితే అక్కడి నుంచి నీళ్లు విరజిమ్ముతాయి. ఈ నీళ్ల ప్రవాహం వేగంగా ఉండడంతో 'అల్లా' జమ్‌జమ్‌ (మెల్లమెల్లగా) అని ఆదేశిస్తే ఆ ప్రవాహం తగ్గుతుంది. నేటికి ఆ నీళ్లు అక్కడ వస్తుండగా హజ్‌కు వెళ్లిన ప్రతివారు వీటినే వాడుతారు. ఆ తల్లి హాజెరా మాదిరిగానే హజ్‌ యాత్రికులు ఇప్పటికీ సఫా, మర్వా పర్వతాల మధ్య పరుగులు తీస్తారు.
ఖుర్బానీ ఎవరివ్వాలి...?
ఎవరి వద్ద అయితే 7.5తులాల బంగారం లేదా 52.5 తులాల వెండి లేదా దానికి సరిపడ్డ డబ్బులు (బ్యాంకులో అయినా) ఉన్నాయంటే అతను ఖుర్బానీ తప్పక ఇవ్వాల్సిందే. ఆ డబ్బులు లేదా సొమ్ము బక్రీద్‌ పండుగ నమాజుకు ఓ క్షణం ముందు వచ్చినా ఆ వ్యక్తి ఖుర్బానీ ఇవ్వడానికి అర్హుడవుతాడు. యజమాని పేరుతో పాటు ఆయన కింద ఆధారపడ్డ (భార్య) పేరున ఖుర్బానీ ఇవ్వాల్సి ఉంటుంది. అల్లా కరుణ వల్ల లభించిన ఆస్తులు, మానప్రాణాలను ఆయన ఆదేశిస్తే ఎలాంటి సంకోచం లేకుండా ఆ క్షణమే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని గుర్తు చేయడానికేనని ఖుర్బానీ ఇస్తారని ముస్లీంలు విశ్వసిస్తారు.
ఖుర్బానీ ఏం చేస్తారు...?
ఖుర్బానీ ఇచ్చిన మాంసాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. అందులో ఒక భాగం ఇంటికి, రెండోభాగం బంధువులకు, మూడోది సమాజానికి  పంచిపెడతారు. ఇక చర్మం అమ్మగా వచ్చిన డబ్బులను పేదవాళ్లకు లేదా అరబ్బీ మదర్సాలకు దానం చేస్తారు. సమీప బంధువుల్లో పేదవాళ్లు ఉంటే ఈ డబ్బులపై వారికి తొలి అధికారం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com