పంచదార చిలక

- October 21, 2016 , by Maagulf


రోజు లాగే ముగ్గురు స్నేహితులం రాము,తిరుపతి,నేను సాయంత్రం మేము నివసించే గదికి దగ్గరలో ఉన్న పార్క్ లో కూర్చున్నాము.  
"ఏంటలా అలా ఘాడంగా ఆలోచిస్తున్నావు ఉదయ్
నిన్నేగా నీ ఉగాది కవితకు,
'మాగల్ఫ్' వెబ్ పత్రికలో "ప్రథమ బహుమతి" మరియు "వంగూరి ఫౌండేషన్" వారిచే ఉత్తమ కవితా పురష్కారం వచ్చాయిగా,
నిజానికి ఇది చాలా ఆనందించాల్సిన సమయం కదా?"
అన్నాడు నన్ను ఉద్దేశించి,తను కఫిటేరియ నుండి పట్టుకొచ్చిన 'టీ' నా చేతికి అందిస్తూ రాము. 
మా ముగ్గురి గురించి కొంచెం క్లుప్తంగా చెప్పాలంటే, వేరు వేరు తెలుగు జిల్లాల నుండి ఉద్యోగ నిమిత్తం 'దుబాయి' వచ్చి వేరు వేరు కంపనీ ఆఫీసులలో  జాబులు  చేస్తూ ఒకే గదిలో షేరింగ్ పద్దతిలో నివాసం ఉంటున్న బాచిలర్స్ మేము.   
గడచిన రోజంతా ఆఫీసులో పని భారము మరియు ఇల్లు కుటుంబం జ్ఞ్యాపకాలు ఇవన్ని మరచి పోవడానికి సాయంత్రాలు ఇలా తేనీరు సేవిస్తూ మాటామంతి జరుపుతాము.  
అంతలోనే "అదిగో నిజమే మళ్లీ ఏదో ఆలోచిస్తున్నావు ఏదైనా ఉంటే మాకు చెప్పరాదు ! చాలా సీక్రెట్ అయితే మాకు చెప్పకూడనిది అయితే చెప్పొద్దులే" అన్నాడు కాస్త బాధ పడ్డట్టు మొహం పెడుతూ తిరుపతి. 
"అయ్యో అదేం లేదు,ఎక్కడెక్కడనుండో వచ్చి ఇక్కడ ఒకే గదిలో ఎన్నో ఏళ్లుగా, కలిసే ఉంటున్నామే మనం.
అసలు మన మధ్య ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు దాపరికాలు ఎందుకుంటాయి చెబుతాను"
అన్నాను మెల్లిగా టీ సిప్ చేస్తూ నేను.  
నా కవితలు ఈ మధ్య పత్రికల్లో,  సోషల్ మీడియాలో రావడం అందరి ప్రశంసలు అందుకోవడం మీకు తెలుసు మరియు ఉగాది అవార్డ్ వచ్చినప్పుడు నాకు కూడా చాలా సంతోషం వేసింది.
కానీ ఈ గొప్ప తనానికి కారణం,మీకు ఇన్ని రోజులు చెప్పని విషయం ఒకటుంది' అన్నాను.  
నేను మీకన్నా పదేళ్ళు ముందు వచ్చాను కదా దుబాయి?. 
అప్పుడు చిన్న చిన్న కవితలు వ్రాసి .. టపాలో' ఇండియాలోని  వారపత్రికలకు పంపించే వాన్ని. 
అప్పుడు ఒకసారి, నా మొదటి కవిత ఓ వారపత్రికలో అచ్చు అయిన సమయంలో నాకు ఇదే గల్ఫ్ దేశాలాలో ఒక దేశం నుండి ఒక కలం స్నేహితురాలు తన ఉత్తరాలతో ఇంకా వ్రాయండి మీ భావాలు బాగుంటాయి అని నన్ను ప్రోత్సహిస్తుండేది. 
అది ఎలా జరిగిందో చెబుతాను వినండి అంటూ కథలోకి వెళ్ళిపోయాను. 
 
ఓ రోజు నేను కంపనీకి వచ్చిన ఉత్తరాలను ఎప్పట్లాగే తిరగేస్తుండగా నా పేరు మీద ఒక ఉత్తరం కంటబడింది. 
అరే ఇది 'కువైట్' నుండి వచ్చిందే నాకు తెలిసిన వారేవరబ్బా అక్కడా? అని వెనక్కి తిప్పి చూస్తే ఎవరో "ప్రియ" అని ఉంది ఆశ్చర్యం వేసింది గబా గబా ఒక ప్రక్కన చించి,అందులోని కాగితాన్ని బయటకు లాగాను 
పసుపు పచ్చని కాగితం నీలం సిరాతో లిఖించబడ్డ గుండ్రని ముత్యాల లాంటి అక్షరాలు .. ఇక కళ్ళు అగలేనంటూ అక్షరాల వెంట పరుగులు తీస్తున్నాయి.   
'ఉదయ్' గారికీ నమస్సులతో వ్రాయునది నా పేరు ప్రియ, మీరు క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ,వ్రాయు విషయం ఏమనగా,
గత వారం "ఆంధ్ర భూమి" లో అచ్చయిన మీ 'తెలుగందం' కవిత చదివాను. 
కవితా భావం చాలా బాగుంది మీ భావాలు చదివిన వెంటనే నేను మీకు అభిమానిని అయిపొయ్యాను. 
చాల సంతోషం మీ స్నేహాన్ని ఆశిస్తూ నమష్కారములతో ప్రియ.  
ఆ ఉత్తరం చదివిన వెంటనే సంతోషంతో నాకు నోట మాట రాలేదు, 
వెంటనే తిరుగు టపాలో, ప్రియ గారికి నమస్సులతో మీ ఉత్తరం అందినది నాకు చాలా సంతోషం అయినది. 
నా కవితను భూమి లో చదివి మీ అభిప్రాయం తెలిపినందులకు మరియు మీ ప్రశంసలతో నన్ను ముంచెత్తినందుకు మరీ మరీ ధన్యవాదాలు. 
మీలాంటి స్నేహితురాలు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మీ నుండి మరిన్ని ఉత్తరాలను ఆశిస్తూ ఉంటాను.  
ప్రియమయిన 'ఉదయ్' గారికి నమస్తే, మీరు వ్రాసిన లేఖ అందినది చాలా హ్యాపి, నిజంగా మీరు జాబు వ్రాస్తారో లేదోనని తెగ ఆందోళన పడ్డాను, మీరు మంచితనంతో స్నేహ హస్తం ఇచ్చినందుకు కృతజ్ఞ్యతలు. 
మనం ఇండియా వెళ్ళాకా, మిమ్మల్ని ఒక్కసారయినా ముఖాముఖీ కలవాలని నా కోరిక. 
 
కానీ, మీరు నన్ను మీరు మీరు అని సంభోదించడం ఏమీ బాగా లేదు సుమీ! 
ఎందుకంటే నేను మీకన్నా చిన్నదాన్ని మీ అభిమానిని కావున నన్ను ఇక నుండి నువ్వు అని సంభోదించ ప్రార్థన..మీ ప్రియ. 
ప్రియమయిన ' ప్రియ గారికి సారీ నువ్వు  అనాలి కదా, నువ్వు వ్రాసిన ఉత్తరం అందినది. 
అందులో మీరు వ్రాసిన విషయం అదిగో మళ్లీ మీరు అని వస్తుంది, అయినా మనకున్న ఈ రెండు ఉత్తరాల పరిచయంతోనే నేనెలా అలా ఏకవచనంతో పిలువగలను? సరే తర్వాత ఎప్పుడయినా ప్రయత్నిస్తా. 
మీరన్నట్లు నా ప్రియమయిన నా మొదటి కవితకి ప్రియమైన మొదటి అభిమానివి కదా నాకూ కూడా మిమ్మల్ని చూడాలని ఉండదా తప్పకుండా చూద్దాం. 
విధి మనల్ని ఎక్కడ కలుపుతుందో ఆయినా మీరు తప్పుగా అనుకోకుంటే మీ గురించి కొంత తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే తెలుగునాట మీ స్వస్థలం,కుటుంబ నేపత్యం. 
గల్ఫ్ జీవితం, చివరగా మీ హాబీస్ మీకు ఇష్టం లేక పోతే చెప్పొద్దులెండి, ఉత్తరాలు మాత్రం వ్రాయటం మానేయ వద్దు!     
మీ లేఖలు మీ స్నేహం ఈ భయంకరమయిన ఒంటరి తనానికి ఓదార్పు కలిగేలా ఉంటాయి.  
మీరు ఈ వారం భూమి కొన్నారో లేదో అందులో అచ్చయిన "ఫలించిన లెక్షరర్ ట్రిక్" అనే నా కాలేజ్ రోజుల్లోని సరదా కొంచెం హాస్యంతో కూడుకున్న మా విహారయాత్ర సంఘటనల గురించి ఒక ఆర్టికల్ వ్రాసాను. 
చదివి మీ అభిప్రాయం చెప్పండి మీ జాబు కోసం ఎదిరిచూస్తూ సెలవ్..ఇక ఉంటాను మీ ఉదయ్.
ప్రియమైన ఉదయ్ గారికి నమస్సులతో చాలా సంతోషం మీరు నా స్నేహాన్ని గురించి పోగిడినందుకు కానీ నిజానికి నేనే అదృష్ట వంతురాలను మీ వంటి గొప్ప వ్యక్తి స్నేహితుడుగా దొరికినందుకు. 
ఇక మీ ఆర్టికల్ చదివి చాలా నవ్వు మరియు మీరు వ్రాసిన విహార యాత్ర గురించి ముఖ్యంగా ఆ ఊటీ గాట్స్ పైకి వెళుతూ 
ఆ మేఘాల ప్రక్కన మీ బస్ స్టీరియోలో లాహిరి లాహిరి లో ఓహో జగమే ఊగెను గా" అనే పాట వింటూ ఆ చల్లదనాన్ని ఆస్వాదించిన తీరు మీరు యువతకు సందేశాత్మకంగా వ్రాసిన తీరు చదివి, 
"నేను కూడా మీ ప్రక్కనే ప్రయాణించిన అనుభూతికి లోనయ్యాను". 
ఇక నా గురించి అడిగారు తప్పకుండా మీలాంటి ఆత్మీయ స్నేహితునికి చెప్పుకుంటే నా గుండె భారం కొంతైనా తీరిపోతుంది కదా? అన్న ఆశతో,
నా కథ మొదలు పెట్టే ముందు మీరు ఒక టీ కాచి ప్రక్కనే పెట్టుకోండి ఒక వేళా మీకు ఇబ్బంది కలిగితే అప్పుడప్పుడు మధ్యలో త్రాగుతూ ఉండండి ఇక మొదలు పెడతాను.  
మాది గోదావరి జిల్లా నేను మా ఇంట్లో అందరికన్నా చిన్నదాన్ని. 
నా కంటే ముందు ముగ్గురు అన్నయ్యలు నాన్నగారు రైల్వేలో చిన్న ఉద్యోగం చేసి,పదవి విరమణ చేసారు.
అమ్మకు ఎక్కువ చదువు లేదు ఇంటివద్దనే ఉండి మమ్మల్ని చూసుకునేది ముగ్గురు అన్నయ్యల ముద్దుల చెల్లెలుగా అమ్మ నాన్నల గారాల కూతురిగా చాలా గారాబంగా పెరిగాను.
అనుకోకుండా అనుకోని, ఒక సమస్య వచ్చిపడింది. 
నేను పదవ తరగతి చదువుతున్నాను,అప్పుడే అమ్మ నాన్నల ఒక ఖచ్చితమయిన నిర్ణయం తెలిపారు.
నేను నాకంటే చాలా పెద్ద వయసున్న మా మామయ్యను పెళ్లి చేసుకోవాలని' 
నాకు ఓకే సారి కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లు కళ్ళు తిరిగి పడిపోతానేమో అనిపించింది. 
ఎందుకంటే, నేను బాగా చదివి ఏదో ఒక గొప్ప ఉద్యోగం సంపాదించాలి నాకు తగిన ఒక అందమైన యువకున్ని పెళ్లి చేసుకోవాలి అని అందరు కన్నె పిల్లల్లాగే నేను ఎన్నో కలలు కనేదాన్ని ఏం చేద్దాం ?
అమ్మ నాన్నలకు ఎలా నచ్చ చెబుదాం అని అలోచించి అలోచించి,
అమ్మ నాన్నలతో  అన్నాను, "నాకు ఏమంత వయసొచ్చింది ఇప్పుడే పెళ్ళెందుకు ఇంకా చదువుకుంటాను" అని. 
"లేదమ్మా మామయ్య చాలా ఆస్తిపరుడు మనం ఆలస్యం చేస్తే, మళ్లీ నిన్ను కాదని అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు" అని బలవంత పెట్టారు. 
కానీ నేను కనీసం ఇంకా రెండు సంవత్సరాలు చదువుకుంటానని చాలా ఏడ్చాను. 
వాళ్ళు ఏమనుకున్నారో ఏమో "సరే మామయ్యతో మాట్లాడి ఇంకా రెండు ఏళ్ళు ఇంటర్ పూర్తి అయ్యేవరకు చదివిస్తాము" అన్నారు. 
"ఆపైన మా మాట విని మామయ్యను పెళ్లి చేసుకోవాలి" అన్నారు. 
సరే లెండి అలాగే అన్నాను ఇప్పటికి ఈ ఆపద గట్టెక్కాలి అని నేను. 
ఇక సంతోషంగా సాగిన కాలేజ్ చదువు. నేను కాలేజ్ బ్యూటి అని, అబ్బా ఏం ఉందిరా ఈ అమ్మాయి అని,అబ్బాయిలు మాట్లాడుకోగా విని లోలోనే సంతోషించే దాన్ని. 
నాకు నవలలు చదవడం,పాటలు వినడం,నాకు ఇష్టమైన సినిమా ''మూగ మనసులు" సినిమా ఎన్నో సార్లు చూసాను.
నాన్న రైల్వే ఉద్యోగి కావున సెలవల్లో, దేశంలోని ఎన్నో అందమైన ప్రదేశాలు చూసి మనసు అనుభూతి మయం చేసుకోవడం జరిగింది ఇలా జాలిగా రెండు సంవత్సరాలు ఎంతో త్వరగా గడచి పోయాయి.  
ఇక ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర కొస్తున్నాయనగా గుండె దడ మొదలయింది ఇప్పుడు మామయ్యతో పెళ్లి ఎలాగు తప్పదు అంటారు అమ్మా నాన్నఅన్నయ్యలు. 
నేను నా మనసు నా భావాలకు తగిన వాడు కాదు మామయ్య అసలు అంత పెద్ద వయసు అతన్ని ఎలా చేసుకునేది?  
ఇలా ఆందోళన చెందుతున్న నన్ను ఓదార్చి అప్పుడే గల్ఫ్ నుండి వచ్చిన తన బంధువైన ఒక అక్కతో చెప్పింది,నా గురించి సర్వం తెలిసిన నా స్నేహితురాలు.  
నా ఇబ్బంది గురించి విన్న నా స్నేహితురాలు అక్క అంది నాతో జాలితో. 
"అయ్యో ఎంత ఘోరం నేను ఒక్క సహాయం మాత్రం చేయగలను నీకు" అంది. 
"నువ్వు అందమయిన అమ్మాయివి కాబట్టి, నాకు తెలిసున్న ఒక బొమ్మల దుకాణంలో "సేల్స్ గర్ల్" గా ఉద్యోగం ఇప్పించి నీకు వీసా తెప్పించగలను గల్ఫ్ వెళ్ళుటకు నీకు ఒప్పందం అయితే". 
"కానీ విమాన ఖర్చులు మాత్రం నువ్వే భరించాలి" అన్నది. 
నేను వెనక ముందు చూడకుండా "సరే అక్క" అన్నాను. 
మెడలో ఉన్న బంగారు గొలుసు అమ్మి విమాన టికెట్ తీసుకొని అలా ఆమెతో బయలు దేరాను విదేశానికి.  
 
ఇక్కడకి వచ్చి జాబ్ లో సెట్ అయ్యాక కొద్దిరోజులు స్నేహితుల ఉత్తరాల ద్వారా తెలిసిన మా ఇంటి విషయాలు, నేను ఇల్లు విడచి వచ్చాక అమ్మా నాన్న, మామయ్య చాలా గొడవలు పడ్డారట. 
ఇంత మా పరువు తీసి వెళ్లి పోయింది జీవితంలో అది ఈ ఇంటి గుమ్మం తొక్కడానికి, దాని ముఖం మాకు చూపించడానికి వీలు లేదు అని అన్నారట, ఇక మాకు కూతురు లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పారట.  
ఆ విషయం తెలిసి, నేను ఒంటరినైపోయానని గుర్తొచ్చినప్పుడల్లా ఎన్నో రాత్రుళ్ళు నిద్రనుండి లేచి వెక్కి వెక్కి ఏడ్చే దానిని.  
ఇప్పుడు నాకెవరు లేరు అప్పుడప్పుడు నాకు ఉత్తరాలు వ్రాసే ఒక స్నేహితురాలు ఇంకొకరు ఇప్పుడే పరిచమయిన నా మనసును అర్థం చేసుకునే కవి మిత్రుడు అది మీరే. 
ఇదే నా కథ మిమ్మల్ని బోర్ కొట్టించి నట్లైతే క్షమించమని కోరుతూ .. మీ ప్రియ. 
ప్రియమైన ప్రియా! మీ కథ విని నేను ఎంతో బాధ పడ్డాను .. ఏది ఏమైనా మీరు ఆధైర్య పడొద్దు మీ బాధను తీర్చలేనేమో కానీ మీకు ఓదార్పు ఇచ్చు మీ 
స్నేహితునుగా భావించి నాతో సంతోషంగా లేఖలు పంచుకోగలరు మరియు మీ తీయని "పంచదార" పలుకులతో నన్ను ఇంకా వ్రాయమని ప్రోత్సాహం 
తెలుపుతున్నారు అందుకే ఈ నిద్ర రాని రాత్రుళ్ళు ఇంకా వ్రాస్తూనే ఉన్నాను ఈ వారం "జ్యోతి" లో నాకవిత అచ్చయింది, కాపీ ఈ ఉత్తరంతో జత పరుస్తున్నాను, బై బై.  
అంతా మీ నోటి చలవ కదా మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా ప్రియమైన స్నేహితురాలిగా "పంచదార చిలక" అని పిలుచుకుంటాను. 
ఇంకా చెప్పాలంటే మీలాగే నాకు మంచి సినిమాలు చూడటం,పాటలు వినడం ఇంకా కథలు నవలలు చదవడం అందమైన ప్రదేశాలు చూడటం హాబీలు. 
ముఖ్యంగా, మీరు ఇంటి మీద ఎలాంటి బెంగ పడొద్దు,మీరు చేసింది తప్పు కాకపోవచ్చు కానీ, సమాజం దృష్టి లో ఇంటి నుండి వెళ్ళిపోయిన అమ్మాయిగా మీఇంట్లో అమ్మ నాన్నలు అన్నయ్యలు అందరిలాగే అవమానంగా భావించారు కాబోలు. 
ఎందుకంటే ఇది తరతరాలుగా వస్తున్న,మన దేశ కుటుంబ వ్యవస్థ యొక్క పటిష్టత ప్రభావం. 
మీరు మీ సమస్యని కాలానికి వదిలేసి నిశ్చింతగా మీ జాబు మీరు చేసుకోగలరు,ఖచ్చితంగా 
మీ వాళ్ళు కన్న ప్రేమతోనో, తోడబుట్టిన ప్రేమతోనో దగ్గరకు తీసుకుంటారు. 
మళ్లీ మీనుండి వచ్చే లేఖ కోసం ఎదిరి చూస్తూ.. మీ నేస్తం. 
 
ప్రియ నేస్తం, 
మీకు ప్రేమతో మీ "పంచదార చిలక" వ్రాయునది,
మీరు నాకు ప్రేమతో పెట్టిన ఈ పేరు నాకు చాలా ఆనందం పంచింది,మీలాంటి గొప్ప వ్యక్తిత్వం గల స్నేహితుడు లభించడం నా అదృష్టం. 
మరియు మీరు పంపిన మీ కవిత చదివాను, చాలా చాలా నచ్చేసింది, మీరు ఎప్పుడూ అలాగే వ్రాస్తుండాలి .. ఎప్పటికైనా మీరు గొప్ప సాహిత్యకారులు అవుతారు,
ఇక నా కథ విని స్పందించిన మీ దయా హృదయానికి వేల వేల వందనాలు. 
మరి మీరన్నట్లు మా వాళ్ళు నన్ను తిరిగి తమలో కలుపుకుంటే అది నాయొక్క 
గొప్ప అదృష్టమే. 
కానీ, మొన్నే సెలవు మీద ఇంటికి వెళ్ళిన మా స్నేహితురాలి అక్కయ్యతో మా అమ్మ నాన్నకు పంపిన ఉత్తరం చింపి ఎవర్తే అది? మాకు కూతురు లేదు, మా కూతురు ఎనాడో చనిపోయింది అని మొహం మీదే తలుపేసుకున్నారట ఇక ఉన్నఆ ఆశ కాస్త ఊడి పోయింది. 
సరే లెండి! 
నా కర్మ ఎలా వ్రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది, మీరు నా గురించి ఎలాంటి వ్యధ చెందనవసరం లేదు. 
మీరు మీ కవిత్వం ఎల్లప్పుడూ అలాగే కొనసాగించాలని మనసార కోరుకుంటూ మీ హాబీలు నా హాబీలు కలిసినందుకు సంతోషించాను ఇక మీకు నీలం రంగు అంటే ఇష్టం అనుకుంటాను..పత్రికలో వేసిన మీ ఫోటోలోని మీ 'టీ షర్ట్ ' చూసి అలా అనిపించింది ఇక ఉంటాను,మీ పంచదార చిలక.
ప్రియ పంచదార చిలకకి' 
మీరు వ్రాసిన విషయం మీ ఇంటి వాళ్ళు అలా ఖరాఖండిగా చెప్పడం చాలా బాధేసింది. 
మీరేమి బెంగ పడొద్దు మీ పని మీరు చేసుకోగలరు, మీకు త్వరలోనే ఓ మంచి వార్త వస్తుంది అని నా మనసుకు అనిపిస్తుంది  సెలవ్. 
ప్రియమైన ఉదయ్ గారికి ఉభయ కుశలోపరి, 
ఇక మీకో ముఖ్య విషయం చెప్పాలి మీరు మీ మనసు చెప్పినట్లు ఇది మంచి వార్తనేనో కాదో విన్నాక మీరే చెప్పాలి సుమా! 
నిన్న మీ లేఖతో పాటు నా స్నేహితురాలు వ్రాసిన లేఖ వచ్చింది, అదే  నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో నేను ఇంతకు ముందు లేఖల్లో చెప్పిన నా స్నేహితురాలు వద్దనుండి. 
నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళుతూ వారి ఇంటి మనిషిలా కలిసి మెలిసి ఉండేదాన్నికదా ? దాని వద్ద నుండి అన్నమాట. 
ఇక  విషయం లోకి వద్దాం, 
అయితే మా స్నేహితురాలికి ఒక అన్నయ్య ఉండేవాడు అయన ఎప్పుడు వారింటికి వెళ్ళిన, నన్ను ప్రేమగా పలకరించే కుశలం ప్రశ్నించే వాడు. 
అయితే ఇప్పుడతను తన చెల్లి అదే, నాస్నేహిరాలితో అన్నాడంట అతను నన్ను లోలోనే ఎంతో ప్రేమించానని నేను ఒప్పుకుంటే నన్ను పెళ్లి చేసుకొని జీవితమంతా అపురూపంగా చూసుకుంటానని.  
అతనంటే నాకు చెప్పుకోతగ్గ అభ్యంతరాలు ఏమీలేవు కానీ ఇక్కడ ఇంకో మెలికుంది, నా స్నేహితురాలు వాళ్ళు క్రిస్టియాన్లు మరి నేనేమో హిందూ పరివారం నుండి వచ్చినదాన్ని. 
అదే అతను మాత్రం నాకు తెలిసి చాలా మంచివాడే, మరి నేను నా నిర్ణయం తనకి ఎలా చెప్పాలి అని ఇందులో మీ సలహా ఏంటో చెబుతారని ఆశిస్తూ మీ జవాబు తర్వాతనే విని, నేను నా స్నేహితురాలికి ఉత్తరం వ్రాస్తాను .. అని తెలుపుతూ సెలవ్.  
హలో ప్రియ' నేను ఎప్పటిలాగానే కాకుండా కొంచెం ఆలస్యంగా ఉత్తరం వ్రాస్తున్నందుకు క్షమించాలి కొంచెం డ్యూటీ సమయం పెరగడం వల్ల పని వత్తిడి వలన ఇలా జరిగింది.
నేను గత ఉత్తరంలో వ్రాసినట్టు మీకు సుభవార్త అందింది కదా చాలా సంతోషం అయింది. 
మీరు తప్పకుండా మిమ్మల్ని మనస్సులోనే ప్రేమించి ఆరాధించి మిమ్ము అమితంగా ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోండి. 
అతను మిమ్మల్ని కచ్చితంగా బాగా చూసుకుంటాడు అని నాకనిపిస్తుంది. 
"అసలు మతాలదేముందండి? మనిషి మనిషితో ప్రేమగా బ్రతకడానికి,మంచి నడవడికను పెంచుకోవడానికి, సంఘం న్యాయ బద్ధంగా నడువడానికే ఆనాడు మతాలు ఏర్పడ్డాయి, కాకపోతే అప్పటి పెద్దమనుషుల ఆలోచనా విధానాన్ని బట్టి, ఆనాటి జీవన గమనాన్ని బట్టి రూపు దిద్దుకున్న మతాలలో ఇప్పుడు ఎన్నో లొసుగులుగా కనిపిస్తున్నాయి గాని,
"అప్పుడు ఏర్పడ్డవి ఏవి మనిషి వినాశాన్ని కోరుకోలేదు, అని నా అభిప్రాయం". 
కావున మీరు అతన్ని నిచ్చింతగా పెళ్లి చేసుకొని సుఖంగా జీవించగలరు అని మనవి. 
ఇక, చాలా రోజులుగా నేను కూడా మీకొక విషయం చేబుదామనుకుంటూనే ఎందుకో చెప్పలేక పోయాను. మీరు నా గురించి అడగక పోవడం ఒక కారణం కావొచ్చు. 
నాకు యుక్త వయసులోనే అంటే నేను గల్ఫ్ జీవితం ప్రారంభించక ముందే, నాకు పెళ్లి చేసారు మా అమ్మానాన్న. 
తర్వాత నా భార్య గర్భవతి ఉండగా నేను గల్ఫ్ వచ్చాను ఒక అబ్బాయి, తర్వాత రెండవ సంతానం అమ్మాయి. 
మా ఆవిడ ఒక అమాయకపు మంచి మనసు గల పల్లెటూరి అమ్మాయి ఆమె మనలా  ఇలా భావాలని పైకి చెప్పకోక పోయినా, నన్ను లోలోనే ఎంతగానో ప్రేమిస్తుంది.
ఇద్దరి పిల్లల్నిస్కూల్లో చదువిపిస్తూ అమ్మా నాన్నలతో కలిసి వ్యవసాయం పనులకు వెళుతుంది హమ్మయ్యా ఇప్పుడు నా బరువు దిగిపోయింది.
ఇక మీరు మీ పెళ్లి గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు తెలుపుతూ ఒక వేల ఆ అబ్బాయితోనే పెళ్ళికి ఒప్పుకుంటే మరి ఇండియా ఎప్పుడు వెళతారు అన్ని వివరాలతో ఉత్తరం వ్రాస్తారని ఆశిస్తూ మీ కలం స్నేహితుడు ఉదయ్. 
ఉదయ్ గారికి నమస్సులతో నా లేఖ కూడా ఆలస్యం అయినందుకు క్షమించాలి. 
మీరు తెలిపిన విదంగానే నేను నా అంగీకారాన్ని తెలుపుతూ జవాబు వ్రాసాను వారినుండి మళ్లీ లేఖ వచ్చింది. 
నన్ను సాధ్యమయినంత తొందరగా ఇండియాకు రమ్మన్నారు వచ్చిన వెంటనే  "చర్చ్" లో మా పెళ్లి జరిపిస్తామన్నారు. 
నేను కూడా ఈ నెలలో వెళ్ళిపోవడానికి నిర్ణయించుకొని, మా 'ఓనర్ మేడం' కి నా ఉద్యోగ విరమణ లేక ఇచ్చాను త్వరలోనే ఇండియా వెళతాను. 
మీరు మీ కుటుంబం గురించి తెలిపారు, అంతరంగంలో నైతేనేమి మిమ్మల్ని అమితంగా ప్రేమించే భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. 
మీరు మీ పిల్లా పాపలతో కలకాలం సుఖంగా వర్దిల్లాలని ప్రార్థిస్తూ.. మీరు ఇంకా సాహిత్యం వ్రాయాలని కోరుకుంటూ సర్వదా మిమ్ము జ్ఞ్యాపకం ఉంచుకునే మీ కలం స్నేహితురాలు .. ప్రియ, నమస్తే. 
ప్రియ గారికి నమస్తే .. మీ లేఖ అందిన వెంటనే జవాబు వ్రాస్తున్నాను ఎందుకంటే మీరు గల్ఫ్ నుండి వెళ్లక ముందు మీ చేతికి ఈ చివరి ఉత్తరం అందాలని. 
ఇక మీ పెళ్లి విషయం మీరు ఒప్పుకున్న మిమ్ము ప్రేమించిన మీ ప్రియునితో మీ పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషం, 
శుభాకాంక్షలు.
మీ సంసారం నిండు నూరేళ్ళు సంతోషాలతో వర్దిల్లాలని ఆశిస్తూ  మీరు నాకు వ్రాసిన ప్రతీ ఉత్తరం నాకో కొత్త ఉత్సాహాన్ని నింపింది .. నాకు అవి జీవిత కాల జ్ఞ్యాపకాలు. 
ఇంకొక ముఖ్య విషయం, మీరు నాకొక మాటివ్వాలి ఇన్ని రోజులు నేను మీకు వ్రాసిన ఉత్తరాలు అన్ని ఇప్పుడే మీరు చింపివేయాలి, ఎందుకంటే మనం ఒకరికొకరం ప్రత్యక్షంగా కలువక పోయిన అజ్ఞాత స్నేహితులమైనా, తాను అమితంగా ప్రేమించిన అమ్మాయి ఇంకొకరితో మానసికంగా దగ్గరయ్యారు అంటే మిమ్ము కట్టుకునేవాడు ఎంత సహృదయుడైనా ఎక్కడో చిన్న శంక బయలు దేరొచ్చు. 
మనమెలాగు మీ మదిలో నేను, నా మదిలో మీరు ఒక మంచి కలం స్నేహితులుగా చిరకాలం నిలిచి పోదాం. 
నాకు మీరెలాగు ఒక మంచి అనుభూతిని పంచిన "పంచదార చిలకై" నా గుండెల్లో ఒక గూడు కట్టుకున్నారు.   
ఇక ఈ మధ్య నాకు సాహిత్యంపై వైరాగ్యం, ఏదో విలువైన వస్తువు పోగొట్టుకున్నట్టు  హృదయం భారం.  
ఎందుకో ఏమి వ్రాయాల్నో అర్థం కావడం లేదు! 
అయినా మీరు కోరిన విధంగా ఎదో ఒకటి వ్రాయడానికి ప్రయత్నిస్తాను, సెలవ్ నమస్తే.    
 
ఇదీ జరిగిన కథ,
ఇక తర్వాత ఆ అమ్మాయి మళ్లీ ఎప్పుడు ఉత్తరాలు వ్రాయలేదు.
నేను కవిత్వం వ్రాయడం దాదాపు మరచి పోయాను.  
కొన్నిసార్లు వ్రాసుకున్న కేవలం నా డైరీకే పరిమితమయ్యేవి. 
కానీ ఆమె వ్రాసిన ఉత్తరాలు అప్పుడప్పుడు చదువుకొనే వాడిని ఆ ఉత్తరాలన్నీ మా ఇంటికి (ఇండియాకి) తీసుకు వెళ్లి,
ఓ పెట్టిలో బద్ర పరచుకున్నాను. 
కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు వారి లేత మనుషుల్లో ఎవో అనుమానాలు ఎందుకు అని, 
ఒక సారి ఎవరు లేనప్పుడు అన్ని చించి ఇంటి ముందు ఒక పురాతన బావిలో పడ వేసాను.  
మదిలో ఆ "తీపి జ్ఞ్యాపకాలు" మాత్రం అలాగే ఉన్నాయి. 
మళ్లీ చాలా కాలం తర్వాత ఇంటర్నెట్ లో కవి సంగమాలు పాత జ్ఞ్యాపకాలు రేపాయి. 
మళ్లీ చిగురించిన కవిత్వం ఈ ప్రశంసా పత్రాలు,కవిత్వం ప్రసంగాలు. 
ఎక్కడ ఏ పత్రికలో నా కవిత అచ్చైనా, ఆ అమ్మాయి వింటుందేమో చదువుతుందేమో, నా ప్రసంగం చూస్తుందేమో, అనిపిస్తుంతుంటుంది.  
ఈ నా విజయాలన్నింటి వెనక నన్ను ఉత్తరాల ద్వారా ప్రోత్సహించిన ఆ "అజ్ఞ్యాత స్నేహం" హస్తం ఉంది. 
అని నేను మనసారా నమ్ముతున్నాను.  
కథ విని రాము,తిరుపతి చప్పట్లు కొట్టారు,చాలా బాగుంది మీ కథ అన్నారు.
తర్వాత మా గదికి వెళ్లి , అందరం భోజనం ముగించి నిద్రకుపక్రమించాము.
(నేను నా మదిలో ఒక్క తీయనైన, ఆ భావ కథా రూపంలో ఉద్భవించిన  ఆ "పంచదార చిలక" క్షేమం కోరుకుంటూ,) 
నిద్రా దేవి ఒడిలోకి వెళ్లి పోయాను.
సమాప్తం.  
శ్రీయుత గౌరవ నీయులు,
మా గల్ఫ్ ఎడిటర్ గారికి ఈ నాయొక్క కథ స్వంతమేనని హామీ ఇస్తూ నమస్తే.
(కథలు వ్రాయడం నాకు క్రొత్త కావున నా యందు దయ తలచి నా కథ లో ఎలాంటి పొరపాట్లు ఉన్నచో నాకు తెలియ పరుచగలరని కోరుకుంటూ) 


మీ విదేయుడు 
జయరెడ్డి బోడ 
పోస్ట్ బాక్స్ 31150 
అబూ ధాబి 
యు.ఏ.ఇ. 
సెల్ 00971557813847. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com