సిద్ధమైన టి-వాలెట్‌.!

- December 24, 2016 , by Maagulf
సిద్ధమైన టి-వాలెట్‌.!

సిద్ధమైన టి-వాలెట్‌ వెయ్యి రూపాయల విద్యుత్తు బిల్లు కట్టాలన్నా.. సిటీ బస్సెక్కి తర్వాతి స్టాప్‌లో దిగాలన్నా టికెట్‌ కొనటానికి డబ్బులివ్వక్కర్లేదు. టి-వాలెట్‌ మీ ఫోన్‌లో ఉంటే చాలు! చిన్నచిన్న మొత్తాల నుంచి ఓమోస్తరు పెద్దమొత్తం దాకా నగదురహితంగా లావాదేవీలు కొనసాగించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం తయారు చేయిస్తున్న వాలెట్‌ (టి-వాలెట్‌) సిద్ధమైంది. గ్రామీణ ప్రజలకూ వాడటానికి సులభంగా ఉండేలా తెలుగులో సంక్షిప్త సమాచారం అందించేలా అదనపు సదుపాయాలతో వస్తున్న టి-వాలెట్‌ జనవరి తొలివారంలో అందుబాటులోకి రాబోతోంది.

దీని ద్వారా ప్రభుత్వంతో చేసే లావాదేవీలకు ఛార్జీలను పూర్తిగా ఎత్తివేయటం ఇందులోని ప్రత్యేకత! వాలెట్‌ నిర్వహణకు ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి అనుమతి ఉండి.. ప్రభుత్వం ప్రజలకు కల్పించాలనుకుంటున్న అదనపు సదుపాయాల్ని సమకూర్చగల వీలున్న కంపెనీలకు ప్రాధాన్యమిస్తున్నారు. కేవలం స్మార్ట్‌ ఫోన్‌ మాత్రమే కాకుండా. ఫీచర్‌ ఫోన్‌ (ఇంటర్నెట్‌ సదుపాయం లేని), డెస్క్‌టాప్‌ కంప్యూటర్‌లతోనూ లావాదేవీలు జరిపే సదుపాయాల్ని టి-వాలెట్‌లో పొందుపరిచారు. ఇవే కాకుండా ఫోన్‌ చేతిలో లేకున్నా.. ఆధార్‌ నంబర్‌ చెప్పి మీసేవా కేంద్రాల్లో బయోమెట్రిక్‌ వేలిముద్రల ద్వారా బిల్లులు కట్టేలా ఏర్పాటూ ఉంది. ఫోన్‌ చేతిలో లేకుండా.

ఆధార్‌కార్డుతో ఇవ్వాలంటే బయోమెట్రిక్‌ సదుపాయం లేకుంటే కూడా నగదు రహితంగా బిల్లు చెల్లించేలా కాల్‌సెంటర్‌ ద్వారా సదుపాయం కల్పిస్తున్నారు. ఇలాంటి సదుపాయాన్ని భద్రతా కారణాల దృష్ట్యా తక్కువ మొత్తానికే పరిమితం చేస్తారు. విద్యుత్‌ ఛార్జీలు, టెలిఫోన్‌ ఛార్జీలు... బస్‌ పాసుల పునురుద్ధరణ. ఇలా ప్రతీదీ ఈ టివాలెట్‌ ద్వారా చేసుకోవచ్చు. ప్రభుత్వం చెల్లించే ఆసరా ఫించన్లు, విద్యార్థులకిచ్చే ఉపకారవేతనాలు టివాలెట్‌ ద్వారానే అందుతాయి. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రికి చూపించి దీన్ని లాంఛనంగా ఆరంభిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com