'అప్పట్లో ఒకడుండేవాడు' మూవీ రివ్యూ..

- December 30, 2016 , by Maagulf
'అప్పట్లో ఒకడుండేవాడు' మూవీ రివ్యూ..

టైటిల్ : అప్పట్లో ఒకడుండేవాడు
జానర్ : పీరియాడిక్ యాక్షన్ డ్రామా
తారాగణం : నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్య హోపే, బ్రహ్మజీ, ప్రభాస్ శ్రీను,
సంగీతం : సాయి కార్తీక్
దర్శకత్వం : సాగర్ కె చంద్ర
నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్

కథల ఎంపికలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించే యంగ్ హీరో నారా రోహిత్, తానే సమర్పకుడిగా తెరకెక్కించిన సినిమా అప్పట్లో ఒకడుండేవాడు. ఈ సినిమా తనకు రీలాంచ్ లాంటిదంటూ ప్రకటించిన రోహిత్ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తన గత చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు మరో హీరోగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు నారా రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టిందా..?

 

కథ : 
1990లలో జరిగే కథ అప్పట్లో ఒకడుండేవాడు. రైల్వే రాజు (శ్రీ విష్ణు)... అమ్మ, ఫ్రెండ్స్, క్రికెట్ తప్ప మరో విషయం తెలియని కుర్రాడు. ఎప్పటికైన రంజీ జట్టులో స్థానం సంపాదించి స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని కలలు కంటుంటాడు. అదే కాలనీలో ఉండే నిత్యా (తాన్యా హోపె)తో ప్రేమలో ఉంటాడు. ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తను నమ్మిన ధర్మాన్ని గెలిపించడానికి అధర్మం చేయడానికి కూడా వెనుకాడని ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్.

రైల్వే రాజు అక్క, అహల్య కాలేజీ రోజుల్లో సవ్యసాఛి అనే నక్సలైట్ ను ప్రేమించి దళంలోకి వెళ్లిపోతుంది. దళంలో యాక్టివ్ గా పనిచేసే అహల్య వివరాలు తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఇంతియాజ్ అలీ, రైల్వే రాజును పిలిపించి ఇంటరాగేట్ చేస్తాడు. తన అక్క ఎప్పుడో వెళ్లిపోయిందని ఆమెతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా.. రాజుకు రంజీ టీంలో క్రికెట్ ఆడే అవకాశం దక్కకుండా చేస్తాడు. అదే సమయంలో తను ప్రేమించిన నిత్యాను ఎత్తుకెళ్లిన భగవాన్ దాస్ అనే రౌడీతో గొడవపడిన రాజు ఆ రౌడీని చంపి, అరెస్ట్ అవుతాడు.

దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజు జీవితంలో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. దళంలో పనిచేసే అక్క చనిపోతుంది. ఆ విషయం తెలిసి రాజు తల్లి కూడా చనిపోతుంది. ఇలా తనకు ఇష్టమైనవన్ని ఒక్కొక్కటిగా దూరమవుతుండటంతో వీటన్నింటికీ కారణమైన ఇంతియాజ్ అలీ మీద కోపం పెంచుకుంటాడు రాజు. అదే సమయంలో ఓ ఇండస్ట్రియలిస్ట్ తన అవసరాల కోసం రాజుకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువస్తాడు. తన ఆస్తులకు రాజును బినామీగా మారుస్తాడు. ఆ ఇండస్ట్రీయిలిస్ట్ అండతో రాజు ఎన్నో చీకటి వ్యాపారాలు, దందాలు మొదలుపెడతాడు. ప్రేమించిన నిత్యాను పెళ్లి చేసుకుంటాడు. తన జీవితం కష్టాలపాలవ్వడానికి కారణమైన ఇంతియాజ్ అలీని సస్పెండ్ చేయించి, ఇక జీవితంలో నీ ఒంటి మీదకు పోలీస్ డ్రెస్ రానివ్వనని ఛాలెంజ్ చేస్తాడు.

ఒక్కొక్కటిగా రాజు ఆగడాలు ఎక్కువవుతాయి. తనకు అడ్డొచ్చిన వారిని చంపటం బెదిరించటంతో పాటు రియల్ ఎస్టేట్, హవాలా లాంటి వ్యాపారాలతో చాలా డబ్బు సంపాదిస్తాడు. అంతే కాదు దేశాన్నే కుదిపేసే స్టాంప్ పేపర్ల స్కాంలోనూ భాగస్వామి అవుతాడు. దీంతో రాజు ఆటకట్టించడానికి ఇంతియాజ్ అలీనే కరెక్ట్ అని భావించిన పోలీస్ డిపార్టెమెంట్, రాజును వేటాడటానికి ఇంతియాజ్ కు పోస్టింగ్ ఇస్తుంది. తిరిగి డ్యూటిలో జాయిన్ అయిన ఇంతియాజ్, రాజు అనుచరలను, వ్యాపారాలను, అన్నింటిని నాశనం చేస్తాడు. ఈ యుద్ధంలో ఎవరిదిపై చేయి అయ్యింది. తప్పుడుదారిలో వెళ్లిన రాజు చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు : 
మొదట నుంచి ఇది నారా రోహిత్ సినిమాగా ప్రచారం జరిగినా.. కథ అంతా శ్రీవిష్ణు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రోహిత్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. రోహిత్ లుక్, బేస్ వాయిస్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక శ్రీ విష్ణు తన నటనతో సినిమా స్థాయిని పెంచాడు. లక్ష్యం కోసం ప్రయత్నించే అమాయకుడైన కుర్రాడిగా, సమాజం మీద ఎదురుతిరిగే యువకుడిగా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ లో శ్రీ విష్ణు నటనకు మంచి మార్కులు పడ్డాయి. హీరోయిన్ గా నటించిన తాన్యా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. ఇతర పాత్రలో బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీనులు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు : 
ఈ సినిమాతో నిర్మాతగానూ మారిన హీరో నారా రోహిత్ తన మార్క్ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయ్యారే సినిమాతో దర్శకుడిగా మారిన సాగర్ కె చంద్ర, అప్పట్లో ఒకడుండేవాడుతో ఆకట్టుకున్నాడు. పీరియాడిక్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1990లలో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా కథా రెడీ చేసుకున్న దర్శకుడు, ఆకట్టుకునే కథనంతో సినిమాను నడిపించాడు. పెద్దగా పాటలు అవసరం లేని కథలో సాయి కార్తీక్ అందించిన పాటలు స్పీడు బ్రేకర్లలా అనిపించాయి. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ : 
నారా రోహిత్, శ్రీ విష్ణు నటన
నేపథ్య సంగీతం
కథా కథనం

మైనస్ పాయింట్స్ : 
పాటలు
తొలి 15 నిమిషాలు స్లో నారేషన్

ఓవరాల్ గా అప్పట్లో ఒకడుండేవాడు.. 2016కు వీడ్కోలు చెప్పే సక్సెస్ ఫుల్ యాక్షన్ డ్రామా

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com