నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం....

- March 06, 2017 , by Maagulf
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం....

" మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు."  – స్వామి వివేకానంద

ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత) అని ఆర్యోక్తి. సృష్టికి మూలం స్త్రీ. దేవుడికి ప్రతిరూపం తల్లి. అలాంటి తల్లి తల్లడిల్లి కన్నీరు కారిస్తే అది మనకు మంచిదా?. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. 106 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులందరికి అందరికీ శుభాకాంక్షలు!”
గత చరిత్రను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళీ శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు మార్చి 8 వ తేదీ  అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.  
మార్చి 8 వ తేదీ ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజు. పదిగంటల పనిదినాలకోసం, పురుషులతో సమానమైన వేతనాలకోసం అమెరికా లోని  పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది. ఇందులో 5000 మంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందుకే ఆరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతటి ప్రాధాన్యతల గల 8వ తేదీ ముంగిట్లో... మార్కెట్‌ యుగంలో మహిళ స్థితిగతులను పరిశీలిద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశం, జాతి, భాష, రాజ్యం, సాంస్కతిక భేదభావాలకు తావు లేకుండా మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. చరిత్రను అనుసరించి సాధికారత సాధన దిశగా మహిళలు పోరాటానికి అంకురార్పణ చేశారు. ప్రాచీన గ్రీకు రాజ్యంలో లీసిస్టాటా పేరు గల మహిళ ఫ్రెంచి విప్లవం ద్వారా యుద్ధానికి ముగింపు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పార్శీ మహిళలతో కూడిన సమూహం ఒకటి ఇదే రోజు వెర్సెల్స్‌లో ఒక ఊరేగింపును నిర్వహించింది.
యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ వారు ఊరేగింపు జరిపారు. 1909 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలో మహిళా దినోత్సవం జరిగింది. 1910 సంవత్సరంలో కొపెన్‌హెగన్‌లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ద్వారా మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్ల సాధనకు మహిళలు ఈ ర్యాలీలో పాలు పంచుకున్నారు. 1913-14 మధ్య కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శాంతిని స్థాపించాలని కోరుతూ ఫిబ్రవరి మాసాపు చివరి ఆదివారం నాడు రష్యా దేశపు మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఐరోపా అంతటా యుద్ధ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 1917 సంవత్సరం వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో రష్యాకు చెందిన రెండు లక్షలకు పైగా సైనికులు మరణించారు. ఆహారం మరియు శాంతిని కోరుతూ ఇదే రోజున రష్యా మహిళలు హర్తాళ్ కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యమాలు, పోరాటాలతో రష్యా మహిళలు ఓటు హక్కును సాధించుకున్నారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి యేటా మార్చి ఎనిమిదవతేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మహిళా సంరక్షణలో భారతీయ చట్టాలు
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు గడచిన దశాబ్ద కాలంగా భారీ సంఖ్యలో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకుని ఉన్నట్లయితే భారత దేశంలో మహిళల పట్ల వివక్ష మరియు అత్యాచారాలు ఈ సరికే ముగిసిపోయి ఉండేవి. కానీ పురుషాధ్యికత విశృంఖలమైన పరిస్థితులు ఈ అద్భుతం ఆవిష్కరణకు అడ్డుపడ్డాయి. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు ఈ చట్టాలు అమలుకు నోచుకుంటున్నాయి. భారతదేశంలో స్త్రీలను కాచుకోవడంలో చట్టాలను మించినవి మరేవీ కానరావు. భారతీయ సంవిధానంలోని ప్రతి అంశం కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ రూపుదిద్దుకుంది. ఈ విషయమై మహిళలు సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సంవిధానంలోని 14వ అధ్యాయం ద్వారా సమన్యాయం, అధ్యాయం 15 (3) లో జాతి, ధర్మం, లింగం మరియు జన్మస్థానం తదితరాలను అనుసరించి భేదభావం చూపరాదు. అధ్యాయం 16 (1) ని అనుసరించి లోక సేవలో బేధభావం లేకుండా సమానత్వం, అధ్యాయం 19 (1) లో సమాన రూపంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, స్త్రీ మరియు పురుషులను ప్రాణ, దేహపరమైన స్వాధీనం చేసుకోవడంతో వంచించిరాదని అధ్యాయం 21 తెలుపుతుంది. అధ్యాయాలు 23-24 లలో శోషణకు విరుద్ధంగా సమాన రూపంలో అధికార ప్రాప్తి, అధ్యాయాలు 25-28 లలో స్త్రీపురుషులివురికి సమాన రూపంలో ధార్మిక స్వతంత్రత ప్రాప్తి, అధ్యాయాలు 29-30 ల ద్వారా విద్య మరియు సాంస్కృతిక అధికారం సంప్రాప్తించింది.
అధ్యాయం 32లో సంవిధానపు సేవలపై అధికారం, అధ్యాయం 39 (ఘ) ను అనుసరించి స్త్రీలు పురుషులు చేసే సమానమైన పనికి సమవేతనాన్ని పొందే హక్కు, అధ్యాయం 40లో పంచాయతీ రాజ్ వ్యవస్థ 73 మరియు 74 అధికరణాలను అనుసరించి ఆరక్షణ యొక్క వ్యవస్థ, అధ్యాయం 41 ద్వారా పని లేమి, వృద్ధాప్యం, అనారోగ్యం తదితర అసహాయ స్థితిలో సహాయాన్ని పొందే అధికారం, అధ్యాయం 42లో మహిళా శిశు సంక్షేమ ప్రాప్తి, అధ్యాయం 33 (క) లో పొందుపరిచిన 84వ అధికరణ ద్వారా లోక్‌సభలో మహిళలకు తగు ప్రాధాన్యత, అధ్యాయం 332 (క) లోని 84వ అధికరణాన్ని అనుసరించి రాష్ట్రాల్లోని శాసనసభల్లో మహిళలకు తగు ప్రాధాన్యత సంప్రాప్తించాయి.
చట్టం ఇలా అంటోంది-

* కార్యక్షేత్రంలో స్త్రీపురుషులకు సమానమైన వేతనాన్ని ఇవ్వాలి.

* మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు  మరియు స్నానాల గదులు ఏర్పాటు చేయాలి.

* ఏ మహిళను కూడా దాస్యభావంతో చూడరాదు.

* బలాత్కారం నుంచి బయటపడేందుకు అవసరమైతే సదరు పురుషుని హత్య చేసే అధికారం మహిళకు ఉంది.

* వివాహితురాలైన హిందూ మహిళకు తన ధనంపై సర్వాధికారాలు ఉంటాయి. తన ధనాన్ని ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకునే అధికారం ఆమెకు ఉంటుంది.

* వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టవిరుద్ధం.


మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హింస, వేధింపులు చూస్తుంటే మనం పూర్తిగా తిరోగమిస్తున్నామనిపిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ మాతృమూర్తిని వేధించి మనం బాగుకున్నదేంటి? వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తున్నప్పటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారు. మహిళా సాధికారత కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు తలెత్తినా, ఎందరో నినదించినా ఫలితం లేకుండా పోయంది. మహిళల చదువు ఏ సమాజానికైనా వెలుగునిస్తుంది. వారిలో చైతన్యం ప్రపంచాన్ని నడిపిస్తుంది. మహిళల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం రావాలి. ఆయా రంగాల్లో రాణించిన, రాణిస్తున్న వారిని స్పూర్తిగా తీసుకోవాలి. వీరికి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పౌరునిది.
సమానత్వం సాధించాలంటే మహిళలు కదం తొక్కి ముందుకు కదలాలి. వేళ్లూనుకున్న వివక్షా పూరిత భావజాలాన్ని కూకటి వేళ్లతో పెకలించాలి. తమ హక్కుల కోసం పోరాడాలి. మేము మానవులనమే అని, మాకు హక్కులుంటాయని వెలుగెత్తి చాటాలి. చరిత్రలో నిలిచిపోయిన వీర వణితలు ఎంతో మంది ఉన్నారు. తల్లిగా, భార్యగా తన పాత్ర పోషిస్తూనే రాజ్యాన్ని కాపాడిన వీరవణితల చరిత్రలు భారత దేశంలో చాలా ఉన్నాయి.  చరిత్రలో కొంత మంది పేర్లు చిరస్థాయిగా నిలిచి పోయినా..కొంత మంది పేర్లు మాత్రం వెలుగులోకి రాలేదు. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది వీర వణితలు తమ మాన, ప్రాణాలు వదిలారు. బ్రిటీష్ పరిపాలన వెనుతిరిగే వరకు మగవారితో సమానంగా పోరాడారు. ఇక ప్రస్తుత కాలంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు పోటీ పడుతున్నారు. రాజకీయ,శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అంతరిక్ష రంగంలో కూడా ముందడుగు వేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంత మంది వీర వణితలు గురించి తెలుసుకుందాం. 

చరిత్రలో ప్రముఖ భారతీయ మహిళలు:

యజ్ఞవాల్కవ్యునితో చర్చలు జరిపిన మహిళ – గార్గి
వర్థమాన మహావీరుని తల్లి – త్రిశాల
బుద్ధుని తల్లి – మహామాయ
వర్థమానుని భార్య – యశోద
బుద్ధుని భార్య – యశోధర
వర్థమానుని కుమార్తె – అనోజ్ఞ
బుద్ధుడిని పెంచిన తల్లి – ప్రజాపతి గౌతమి
బుద్ధుని చర్యలతో మారిన వేశ్య – అమ్రపాలి
చంద్రగుప్త మౌర్యుని తల్లి – ముర
సెల్యుకస్‌ నికేటర్ కుమార్తే, చంద్రగుప్త మౌర్యుని భార్య – హెలీనా
నాసిక్ శాసనం వేయించింది – గౌతమీ బాలాశ్రీ
నానాఘాట్ శాసనం వేయించింది – నాగానిక
‘కరర్తీ’ అనే భంగిమ వలన మరణించిన కుంతలశాతకర్ణి భార్య - మలయవతి
మొదటి చంద్రగుప్తుని భార్య – కుమారదేవి
హర్షుని సోదరి – రాజశ్రీ
ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ – రజియా సుల్తానా
చిత్తోడ్ పాలకుడు రాణారతన్ సింగ్ భార్య (అద్భుత సుందరి) – రాణి పద్మిని
కాకతీయ రాజ్యాన్ని పాలించిన ఏకైక మహిళ – రుద్రమదేవి
కృష్ణ భక్తురాలైన భక్తి ఉద్యమకారిణి – మీరాభాయి
శ్రీ కృష్ణదేవరాయల తల్లి – నాగాంబ
శ్రీ కృష్ణదేవరాయల భార్యలు – తిరుమలదేవి, చిన్నాదేవి
షేర్షా వివాహమాడిన వితంతువు – లాడ్ మాలిక
అక్బర్ తల్లి – హామీదాభాను భేగం
అక్బర్ వివాహమాడిన రాజపుత్ర వనిత – జోద్ భాయి
అక్బర్‌ను ఎదిరించిన గోండ్వానా రాణి – దుర్గావతి
అక్బర్‌ను ఎదిరించిన అహ్మద్ నగర్ రాణి – చాంద్ బీబీ
జహంగీర్ వివాహమాడిన వితంతువు – మెహరున్నీసా
షాజహాన్ భార్య – ముంతాజ్ మహాల్
షాజహాన్ కుమార్తెలు – రోషనార, జహనారా
ఔరంగజేబు కుమార్తె –జేబున్నిసా
శివాజీ తల్లి – జిజియాభాయి
“ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్” అని ఎవరినంటారు – ఝాన్సీ లక్ష్మీభాయి
1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న అయోధ్య ప్రాంత మహిళ – బేగం హజ్రత్ మహల్
చివరి మొగల్ రాజు 2వ బహదూర్‌షా భార్య – జీనత్ మహల్
భారతదేశంలో తొలి మహిళా టీచర్ – సావిత్రి భాయి పూలే
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి మహిళ – అనీబిసెంట్
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తొలి భారతీయ మహిళ – సరోజినినాయుడు
జర్మనీలోని స్టట్‌గట్‌లో త్రివర్ణ పతాకం ఎగుర వేసిన తొలి మహిళ – మేడంకామా
అనుశీలన్ సమితిని ప్రోత్సహించిన మహిళ – మార్గరేట్ ఎలిజెబెత్ నోబుల్
అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మహిళ – కల్పనాచావ్లా
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ - బచేంద్రిఫాల్
గాంధీజీ తల్లి – పుత్లీభాయి
గాంధీజీ భార్య – కస్తూరిభాగాంధీ
నెహ్రూ తల్లి – స్వరూపరాణి
నెహ్రూ భార్య – కమలానెహ్రూ
ముంబాయి లోని క్రాంతి మైదాన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది – అరుణా అసఫ్‌అలీ
భారతదేశంలో ఒక రాష్ట్రానికి హోంమంత్రి అయిన తొలి మహిళ – సబితాఇంద్రారెడ్డి
మొదటి మహిళా I.P.S. అధికారి – కిరణ్ బేడి
ఒలంపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన మొదటి భారతీయురాలు – కరణం మల్లీశ్వరీ
భారత రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలు – విజయలక్ష్మీ విశ్వనాథన్
తొలి మహిళా లెప్టినెంట్ జనరల్ (సైనికదళం) – పునీతా అరోరా
మొదటి ఎయిర్ బస్ మహిళా ఫైలట్ – దుర్గా బెనర్జీ
భారత్‌లో మొదటి మహిళా అడ్వకేట్ – కోర్నేషియా సోరాబ్జీ
అస్కార్ అవార్డ్ పొందిన తొలి భారతీయ వ్యక్తి/మహిళ – భాను అతయ
ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళా - విజయలక్ష్మీ పండిట్
భారత తొలి మహిళా ప్రధానమంత్రి – ఇందిరాగాంధీ
మొదటిసారిగా గవర్నర్ అయిన తొలి భారతీయ మహిళ - సరోజిని నాయుడు
భారత్‌లో మొదటి మహిళా స్పీకర్ – షన్నోదేవి
భారతీదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి – సుచేతా కృపలాని
భారత్‌లో మొదటి మహిళా న్యాయమూర్తి – అన్నాచాందీ
భారత్‌లో మొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి – మీరా సాహెబ్ ఫాతీమా బీబీ
భారత్‌లో ఆధార్ కార్డు పొందిన తొలి మహిళ – రజనా సోనావానే
భారత్‌లో తొలి మహిళా ఎయిర్‌వైస్ అడ్మిరల్ (నేవి) – పునీతా అరోరా
భారత్‌లో వైమానిక దళంలో ఫైలట్ గా పనిచేసిన మొదటి మహిళ – హరితాకేర్
భారత్‌లో తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్ (వైమానిక దళం) – పద్మాబందోపాధ్యాయ
భారత్‌లో తొలి టెస్ట్‌ట్యూబ్ బేబీ – బేబీ హర్ష
భారత్‌లో మొదటి మహిళా I.A.S. – అన్నాజార్జ్
భారత్‌లో మొదటి మహిళా D.G.P. – కంచన్ చౌదరీ భట్టాచార్య
విశ్వసుందరి అయిన తొలి భారతీయ వనిత – సుస్మితా సేన్
మిస్ ఏసియా ఫసిఫిక్ అయిన తొలి భారతీయ వనిత – దియా మీర్జా
ప్రపంచ సుందరి అయిన తొలి భారతీయ వనిత – రీటా ఫారియా
అతి పిన్నవయసులో ఎవరెస్ట్‌ను అధిరోహించిన మహిళ – డిక్కీ డోల్మా
ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన తొలి భారతీయ మహిళ - ఆర్తీ సాహా
జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి భారతీయ మహిళ - ఆర్తీ సాహా
సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి భారతీయ మహిళ -బులా చౌదరీ
కలకత్తా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన తొలి మహిళ -కాదంబినీ గంగూలీ
దక్షిణ ధ్రువాన్ని చేరిన తొలిభారతీయ మహిళ -రీనా కేశల్
అతిపిన్న వయసులో లోక్‌సభ సభ్యురాలయిన మహిళ -అగాథా సంగ్మా
అతిపిన్న వయసులో భారత్‌లో కేంద్ర మంత్రి పదవిని స్వీకరించిన తొలి మహిళ -సెల్జా కుమారీ
అతిపిన్న వయసులో కేంద్ర మంత్రి మండలిలో క్యాబినెట్ ర్యాంక్‌ను పొందిన తొలి మహిళ - సుష్మాస్వరాజ్
భారత్‌లో మొదటి మహిళాకేంద్ర మంత్రి -విజయలక్ష్మీ పండిట్
ఛీప్‌ ఎలక్షన్ కమీషనర్ అయిన తొలి మహిళ -V.S. రమాదేవి
భారత్‌లో బుక్కర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ -అరుంధతీ రాయ్
భారతరత్న అవార్డు పొదింన తొలి మహిళ -ఇందిరా గాంధీ
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న తొలి మహిళ -కాదంబీనీ గంగూలీ
నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ -మదర్ థెరీస్సా
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినతొలి మహిళ -దేవికారాణి రోరిచ్
RBI తొలి మహిళా డిప్యూటీ గవర్నర్ -K.J.ఉదేశీ
భూగోళం చుట్టివచ్చిన తొలి మహిళ -ఉజ్వలారాయ్
తొలి చలనచిత్ర నటి -కమాలాభాయి గోఖలే
లోక్‌సభ తొలి మహిళాస్పీకర్ -మీరాకుమార్
తొలి మిస్‌ ఇండియా -నటి ప్రమీలా
పద్మశ్రీ సత్కారం పొందిన తొలి నటి -నర్గీస్ దత్
తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి -మాయావతి
ఙ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన తొలి మహిళ -ఆశాపూర్ణా దేవి
ప్రపంచ అథ్లెటిక్స్‌లో పతకం సాంధించిన తొలి మహిళ -అంజు బాబిజార్జ్
గ్రాండ్‌స్లామ్ గెల్చుకున్న తొలి భారతీయ మహిళ -సానియా మీర్జా
ప్రపంచ షూటింగ్‌లో స్వర్ణం పొదింన తొలి భారతీయ మహిళ -తేజస్వినీ సావంత్
భారత తొలి మహిళా రాష్ట్రపతి -ప్రతిభాసింగ్ పాటిల్
భారత్‌లో తొలి మహిళా మెజిస్ర్టేట్ -ఓమన కుంజమ్మ
జాతీయ మహిళా కమీషన్ తొలి ఛైర్‌పర్సన్ -జయంతీ పట్నాయక్
రాజ్యసభ తొలి మహిళా సెక్రటరీ జనరల్ -V.S.రమాదేవి
గోబీశీతల ఎడారి దాటిన తొలి మహిళ -సుచేతా కడేత్కర్
భారతరత్న పురస్కారం పొందిన సంగీతకారిణి -M.S.సుబ్బులక్ష్మి
శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ తొలి మహిళా అధ్యక్షురాలు -బీబీ జాగీర్‌కౌర్
సహాయ నిరాకరణోద్యమంలో ఆంధ్రలో అరెస్టు అయిన తొలి మహిళ -దువ్వూరి సుబ్బమ్మ
“గుంటూరు ఝాన్సీ” అని ఎవరినంటారు – ఉన్నవ లక్ష్మీబాయమ్మ
ఆంధ్రలొ తొలి వితంతు వివాహం చేసుకొన్నది – గౌరమ్మ(సీతమ్మ)
భూస్వాములను ఎదురించిన పాలకుర్తికి చెందిన ధీర వనిత - చాకలి ఐలమ్మ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com