సిరియా రాజధానిలో బాంబు పేలుళ్లు

- March 12, 2017 , by Maagulf
సిరియా రాజధానిలో బాంబు పేలుళ్లు

- 44 మంది మృతి 
 సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఓల్డ్‌ సిటీలో శనివారం రెండు చోట్ల బాంబు దాడులు జరిగాయి. ఒక చోట మందుపాతర పేలిందని, మరో చోట ఆత్మాహుతి దాడి జరిగిందని, ఈ రెండు ఘటనల్లో 44 మంది ప్రాణాలు కోల్పోయారని సిరియాలోని మానవ హక్కుల పర్యవేక్షణ ఏజెన్సీ ఒకటి మీడియాకు తెలిపింది. సిరియా అధ్యక్షుడు అస్సద్‌ సైన్యం ఆధీనంలో ఉన్న డమాస్కస్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. అయినప్పటికీ బాంబు పేలుళ్లు చోటుచేసుకోవటం సర్వత్రా ఆందోళన రేపింది. 
బస్సు ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు పక్కన అమర్చిన మందుపాతర పేలిందని, బాబ్‌ అల్‌ సాఘర్‌ అనే ప్రాంతంలో ఒక దుండగుడు తనను తాను పేల్చుకున్నాడని స్థానిక మీడియా వార్తల్ని ప్రసారం చేసింది.
బాబ్‌ అల్‌ సాఘర్‌లో షియాలకు చెందిన ప్రఖ్యాత మ్యూజియం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. వీరిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగి ఉంటుందని, మృతుల్లో ఎక్కువగా షియా వర్గం వారే ఉన్నారని స్థానిక పోలీసులు చెప్పారు. రెండు చోట్ల జరిగిన బాంబుదాడుల్లో పెద్ద సంఖ్యలో అమాయక ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని, మరికొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ చీఫ్‌ రామీ అబ్దెల్‌ రహమాన్‌ 'ఎఎఫ్‌పీ' మీడియాతో చెప్పారు.

రాజధాని డమాస్కస్‌లో రెండు చోట్ల బాంబు దాడులు జరిగాయని ప్రభుత్వ మీడియా 'సనా' న్యూస్‌ కూడా తెలియజేసింది. ఇరాక్‌, సిరియాల్లో అల్‌ఖైదా, దాని అనుబంధ సంస్థలు, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ముఖ్యంగా షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు జరుపుతున్నారు. ఇటీవల ఈ దాడుల తీవ్రత పెరిగింది. తాజా దాడులు తమ పనేనని అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఫతే అల్‌ షామ్‌ ప్రకటించుకుంది.

రష్యా, సిరియా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేశామని ఆ సంస్థ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com