రమదాన్ మాసపు ఉపవాసాలు

- June 15, 2017 , by Maagulf
రమదాన్ మాసపు ఉపవాసాలు

దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నారు׃  “యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుమ్ ల అల్లకుమ్ తత్తఖూన్” - “ఓ విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడినది. ఏవిధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించే వారికి కూడా విధించబడినదో. దీనివలన మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది” దివ్యఖుర్ఆన్ అల్ బఖర 2׃౧౮౩ ఉపవాసం నిర్వచనం ׃ “ఉపవాసం ఓ ఆరాధన. ఫజ్ర్ (ప్రాత׃కాలం) నుండి మగ్రిబ్ (సూర్యాస్తమయం) వరకు అన్నపానీయాల నుండీ, ఉపవాసమును భంగపరచు ప్రతి విషయమూ, పనులనుండీ మానవుడు దూరముండడమే ఉపవాసం.” ఉపవాస ప్రాముఖ్యత ׃ బుఖారి మరియు ముస్లిం - “అన్ అబిహురైర రదిఅల్లాహు అన్హు అన్నన్నబియ్య శల్లల్లాహు అలైహివసల్లం ఖాల׃ ఖాలల్లాహు అజ్జవజల్ల - కుల్లు అమలిబ్ని ఆదమ లహు ఇల్లా అస్సియాము, ఫఇన్నహు లి వ అనా అజ్ జీ బిహీ వస్సియాము జున్నతున్,ఫఇజా కాన యౌము సౌమి అహదికుమ్ ఫలా యర్ ఫుస్ యౌమఇదిఁవ్వలా యస్ ఖబ్. ఫఇన్ సాబ్బహు అహదున్, ఔ ఖాతలహు - ఫల్ యఖూల్ ఇన్నిమ్రఉన్ సాయిమున్. వల్లదీ నఫ్సు ముహమ్మదిన్ బియదిహి లఖలూఫు ఫమిస్సాఇమి అత్యబు ఇందల్లాహి యౌమల్ ఖియామతి మిర్రీహిల్ మిస్కి వ లిస్సాఇమి ఫర్హతాని యఫ్ రహు హుమా ఇదా అఫ్ తర ఫరిహ లిఫిత్ రిహి వ ఇదా లఖియ రబ్బహు ఫరిహ బి సౌమిహి”అబూహురైర రదిఅల్లాహు అన్హు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త శల్లల్లాహు అలైహివసల్లం ఇలా తెలిపారు, అల్లాహ్ అజ్జవ జల్ సూచిస్తున్నారు - “మానవుని ప్రతి కార్యం తనకై కాగా ఉపవాసం నా కొరకు కాబట్టి దాని ప్రతిఫలం నేనే ఇస్తాను” వాస్తవానికి ఈ ఉపవాసం ఒక ఢాలు మరియు కవచమూను. కాబట్టి మీలోనుంచి ఏదినమున ఎవరైతే ఉపవాసంతో ఉంటారో వారు ఉపవాసాన్ని భంగం చేయునట్టి ఏ దుర్చేష్టనూ చేయరాదు. అంటే భార్యతో రసక్రియలలో పాల్గనడం, ఎవరితోనైనా దుర్భాషలాడడం చేయరాదు. ఒకవేళ ఎవరైనా వారితో దర్భాషలాడినా, వాదులాడినా, ఉపవాసి ఆ వాదులాడు, దర్భాషలాడు వానితో నేను ఉపవాసిని అనాలి.మరలా ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు - “ఎవరిచేతిలోనైతే ముహమ్మద్ ప్రాణాలు ఉన్నాయో ఆయన సాక్షిగా - ఉపవాసి నోటివాసన అల్లాహ్ వద్ద ప్రళయ దినాన ముష్క్(కస్తూరి), అంబర్ ల పరిమళాలకంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనదీ మరియు శ్రేష్ఠమైనదీను కానుంది”. ఉపవాసి కొరకు రెండు సందర్భాలు అత్యంత సంతోష కరమైనవి, వాటియందు అతను అమితమైన సంతోషాన్ని పొందుతాడు. వాటిలో మొదటిది - ఉపవాస విరమణా సమయం (ఇఫ్తార్ సమయం)లో ఇఫ్తార్ చేస్తున్నందుకు, రెండవది - తన ప్రభువైన అల్లాహ్ ను కలుసుకునే సమయం. ఆ సమయమునందు తను తన ఉపవాసం మూలంగా అమితమైన సంతోషాన్ని పొందుతాడు. రమదాన్ నెల ఉపవాసాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఉపవాసులకు అందించే సహకారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఉపవాసులకు ఇఫ్తార్‌ చేయించిన వారు, వారికి భోజనం పెట్టిన వారు కూడా అదే స్థాయి ప్రతిఫలానికి అర్హులవుతారు. ఈ విషయాన్ని వివరిస్తూ మహాప్రవక్త హజ్రత ముహమ్మద్‌(స) ఇలా పేర్కొన్నారు.‘‘దైవప్రసన్నతని కోరి ఒక ఉపవాసికి ఉపవాస విరమణ (ఇఫ్తార్‌)చేయించిన వ్యక్తికి ఆ ఉపవాసికి లభించినంత పుణ్యం వస్తుంది. అది అతని పాపాల క్షమాపణకు నరకాగ్ని నుంచి విముక్తికి కారణమవుతుంది. పైగా ఉపవాసికి లభించే ప్రతిఫలంలో ఎటువంటి తగ్గింపూ ఉండదు.’’ఇఫ్తార్‌ చేయించే స్తోమత కూడా లేని వారి సంగతేమిటి? అని ప్రశ్నించారు అనుచరులు. ‘ఓ కర్జూరంతో కాని, ఏమిలేనప్పుడు గుక్కెడు మంచినీటితో ఇఫ్తార్‌ చేయించినా చాలు. అంతే ప్రతిఫలం దక్కుతుంద’న్నారు మహాప్రవక్త(స).‘ఉపవాసికి ఓ పూట భోజనం చేయించిన వ్యక్తికి దైవం అంతిమ దినాన నాకోసం కేటాయించిన కొలను (కౌసర్‌) జలాన్ని తనివి తీరా తాగిస్తాడు. అతనికి దప్పిక అనేది ఉండదు. అదే స్థితిలో స్వర్గంలోకి ప్రవేశిస్తాడు’ అని తెలిపారు. ఏ కారణం చేతనయినా ఉపవాసాన్ని మధ్యలో విరమించి ఉపవాసభంగం చేసిన వ్యక్తి దానికి పరిహారంగా వరుసగా అరవై రోజులు పాటు ఉపవాసం ఉండాల్సిందిగా ఆజ్ఞాపించడం జరిగింది. లేని పక్షంలో అరవైమందికి భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఒకరోజు ఒక వ్యక్తి మహాప్రవక్త(స)వద్దకు పరుగెత్తుక వచ్చాడు. తన చేత ఉపవాసభంగం జరిగిందని, దానికి పరిహారంగా ఏం చేయాలో చెప్పమని అడిగాడు. వరుసగా అరవైరోజుల పాటు ఉపవాసాలు ఉండమన్నారు ప్రవక్త(స). అది విని ఆ వ్యకి ‘మండుటెండలో కష్టపడి కట్టెలు కొట్టుకుని బతికే వాడిని. ఈ 30 రోజులు పాటించడమే సాధ్యం కాలేదు. మధ్యలో ఉపవాస భంగం జరిగింది. ఇక 60 రోజులు ఉపవాసం ఉండటం సాధ్యమయ్యే విషయం కాద’ని అన్నాడు.‘పోనీ అరవై మందికి భోజనం పెట్టించు’ అన్నారు ప్రవక్త(స). తనకు సరైన తిండి ఉంటే ఈ ఉపవాస భంగమే జరిగి ఉండేది కాదంటాడా వ్యక్తి. అతని మాటలు విని మహాప్రవక్త(స) బాధతో ఇల్లంతా కలియచూసారు. ఏమీ కనిపించలేదు. ఇంతలో ఎవరో ఓ కర్జూరాల గంపను మహాప్రవక్త(స) సన్నిధికి పంపిస్తారు. అప్పుడు ఆయన ఆ వ్యక్తితో ఆ గంపను తీసుకుపోయి అతని ఇంటి చుట్టు పక్కల ఉన్న నిరుపేదలకు తినిపించమంటారు. తన ఇంటి చుట్టుపక్కల చాలా దూరం వరకు తన కన్నా పేదవాడు మరొకడు లేడంటాడా వ్యక్తి. ‘సరే ఈ ఖర్జూరాలను తీసుకుపోయి నీ భార్యాపిల్లలకు పెట్టు. నీవూ తిను. అదే పరిహారమవుతుంది’’ అంటారు మహాప్రవక్త(స).ఇటువంటి సడలింపులన్నీ పూర్తి అశక్తులు, ఏ దారీ లేని వారికి మాత్రమే. శక్తి స్తోమతలున్నా వారికి ఎటువంటి మినహాయింపులుండవు. ‘‘ఏకారణమూ లేకుండా రమజాన్‌ ఉపవాసాల్ని మానివేసిన వారు జీవితకాలం ఉపవాసాలున్నా మాని వేసిన వాటిలో ఒక ఉపవాసపు విలువా తీర్చలేరు’’ అన్నారు మహాప్రవక్త(స).పూర్వం ఉపవాసాల్ని ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఎంతో సాదాసీదాగా పాటించడం జరిగేది. ఆ కాలంతో పోలిస్తే నేడు మనం పాటిస్తున్నవి ఉపవాసాలేనా అన్న అనుమానం కలుగుతుంది. ఓ నలభై ఏళ్ల క్రితం గ్రామాల్లో కరెంటు ఉండేది కాదు. వసతులూ ఉండేవి కావు. రోజూ బావుల నుంచి నీళ్లు తోడుకునే వారు. రోళ్లపై మసాలాలు, కారం నూరుకునే వారు. తిరుగలిలో పప్పులు, పిండీ వగైరాలు పట్టుకునే వారు. కట్టెల పొయ్యిపై వంట చేసుకునేవారు. ఆహారపు కొరత తీవ్రంగా ఉండేది. కష్టపడి ఈ పనులన్నీ చేసుకుంటూ ఉపవాసాల్ని పాటించే వాళ్లు.నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆహారం సమృద్ధిగా లభిస్తోంది. సంపాదనా మార్గాలు మెరుగుపడ్డాయి. కొందరు ఏసీ రూముల్లో ఉపవాసాలు పాటిస్తున్నారు. పెద్ద పెద్ద ఇఫ్తార్‌ విందులు ఏర్పాటవుతున్నాయి. రాజకీయ పార్టీలు, నాయకులు భారీ ఎత్తున ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇఫ్తార్‌ అంటేనే ఉపవాస విరమణ. కాని ఈ ఇఫ్తార్‌ పార్టీల్లో ఉపవాసాలు ఎంత మేరకు ఉంటున్నారనేది తెలియని విషయం కాదు. ఇక కొన్ని వ్యాపారసంస్థలు ఉపవాసం వల్ల మనిషి ఎంతో శక్తిని కోల్పోతాడు. దానిని పూరించడానికి అత్యంత బలవర్ధకమైన ఆహారం అంటూ ప్రత్యేక వంటకాల్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఆ ప్రత్యేక వంటకాలకు, రమజాన్‌ ఉపవాసాలకు ఎలాంటి సంబంధమూ లేదు.
 కొంతమంది ఉపవాసులు కూడా బజార్లలో దొరికే అన్ని రకాల పండ్లు, వంటకాలు తెచ్చి ఇళ్లలో నిలువ చేసుకొంటున్నారు. . ఇళ్లలో కూడా రకరకాల ఆహారపదార్థాలు తయారు చేసుకుంటున్నారు. ఉపవాసం పేరిట రాత్రిని పగలుగా మార్చేస్తున్నారు. ఇది రమజాన్‌ నెల. ఉపవాసాల మాసం. రమజాన్‌ ఉపవాసాల స్ఫూర్తికే విరుద్ధమైన పనులివి. ఈ పవిత్రమాసాన్ని ఇతర నెలలన్నిటి కన్నా ఎక్కువ తిండి తినే నెలగా మార్చివేశారు. నిజానికి రమజాన్‌ దైవకరుణ వర్షించే మాసం. ‘రమజాన్‌ సహనపు మాసం. సహనానికి ప్రతిఫలం స్వర్గం’ అన్నారు మహాప్రవక్త హజ్రత ముహమ్మద్‌ (స). ఉపవాసం వలన లాభాలు ׃ ఉపవాసం వలన లాభాలు కోకొల్లలు, క్రింద పేర్కొన్న రెండు వాటిలో ముఖ్యమైనవి. 1. మనపై విధిగా గల అల్లాహ్ ఆదేశపాలన జరుగుతుంది. 2. ఈ ఉపవాసంతో విశ్వాసులలో భక్తీశ్రద్ధలు పెరిగి, అల్లాహ్ అనుక్షణం వారిని గమనిస్తున్నాడు అనే భావం పెరిగి, మరింత దృఢమౌతుంది. కాబట్టి అల్లాహ్ ఆదేశానుసారం ఆరాధన నందు సమయం గడిపి , ఆయన నివారించిన వాటినుండి ఉపవాసి దూరంగా ఉంటాడు. అల్లాహ్ ఓర్పు, అంకిత భావనలను ఎరిగినవాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com