ఆ ఇల్లు ఎవరిది?

- June 16, 2017 , by Maagulf

ఆ ఇంట్లో

కొక్కేలకి కవితలు వ్రేలాడుతున్నాయి;
దండేలపై అక్షరాలు ఆరేసున్నాయి;

కుండీల్లో రంగురంగుల గజళ్లు
అద్దాల అల్మరాలో గేయాలు
అగరుపొగల్లో పద్యాలు
గుబాళిస్తున్నాయి;

తివాచీలపై రుబాయీలు
దీవాన్ దుప్పటిపై కావ్యాలు 
టీపాయ్ మీద హైకూలు నానీలు
అద్దబడి ఉన్నాయి;

ఆ దంపతులు తత్సమాల్లా,
పిల్లలు తద్భవాల్లా ఉన్నారు;

గదుల మధ్య సంధులున్నా
వారి బంధాలు సమాసాల్లా ఉన్నాయి;
ఆలోచనలు సంయుక్తాలైనా 
వారి నిర్ణయాలు ద్విత్వాలవుతున్నాయి; 

వంటల్లో వ్యాకరణం, 
వడ్డింపులో ఛందస్సు ఉన్నాయి;

చూపుల్లోనే శబ్దాలు,
నవ్వుల్లోనే అర్ధాలు ఉన్నాయి;

ఆ ఇల్లు ఎవరిదోగాని-
కళ్లు మూసుకుంటే కనిపిస్తోంది,
తెరిస్తే మాయమౌతోంది. 

-సిరాశ్రీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com