ఈనెల 26న కేసీఆర్‌కు ఆపరేషన్

- June 25, 2017 , by Maagulf
ఈనెల 26న కేసీఆర్‌కు ఆపరేషన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గత మూడు రోజులుగా డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత ఈనెల 26వ తేదీన ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ ఆపరేషన్ ఏంటనేకదా మీ సందేహం.
ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రామ్‌నాథ్ గోవింద్ నామిషన్ కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. గత మూడు రోజులుగా ఢిల్లీలోని కేసీఆర్‌ అధికార నివాసమైన 23, తుగ్లక్‌ రోడ్డులో ఉంటున్నారు. ఈయనకు మూడు రోజులుగా వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు.. ఇంటికి వచ్చి కళ్లలో చుక్కల మందు వేస్తున్నారు. కుడి కంటిపై పొర ఏర్పడటంతో సీఎం చూపు కాస్త మందగించింది. దాన్ని తొలగించడానికి ఆపరేషన్‌ చేయనున్నారు.
వాస్తవానికి, గత నెలలో ఢిల్లీకి వచ్చినప్పుడే ఆయన ఆపరేషన్‌ చేయించుకోవాలని భావించారు. ఆపరేషన్‌ అవసరమా లేదా మందులతో తగ్గిపోతుందా? అన్న సందేహంతో డాక్టర్లు ఆపరేషన్‌ వాయిదా వేశారు. తాజాగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహిస్తే మంచిదని నిర్ణయించారు. దీంతో ఆపరేషన్‌కు కేసీఆర్ అంగీకరించారు. కేసీఆర్‌ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి చెందిన కంటి డాక్టర్‌ సచ్‌దేవ్‌ ఆయనకు ఆపరేషన్‌ చేశారు. ఇపుడు కూడా ఆయన చేయనున్నారు.
ఆపరేషన్‌ తర్వాత రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 30వ తేదీన అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరగబోయే జీఎస్టీ అమలు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాతే తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com