భారత్ దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు..

- June 25, 2017 , by Maagulf
భారత్ దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు..

రంజాన్ సందడి షురూ అయింది. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు పండగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మసీదులు, ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆనందంగా పండగ చేసుకోవాలని ముఖ్యమంత్రులు పిలుపిచ్చారు.
ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావించే రంజాన్‌ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.ఆదివారం సాయంత్రం షవ్వాల్‌ నెలవంక కనిపించడంతోనే పండుగ సందడి కనిపించింది. రంజాన్ సందర్భంగా జరుపుకునే ఈదుల్‌ ఫితర్‌ ప్రార్థనల కోసం తెలుగు రాష్ట్రాల్లోని మసీదులు, దర్గాలను సుందరంగా అలంకరించారు. ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు  రాకుండా ప్రత్యేక వసతులు కల్పించారు. 
ముస్లిం సోదరులకు గవర్నర్‌ నరసింహన్‌, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుందని ఆకాంక్షించారు. మత సామరస్యానికి, సరస్వత సౌభ్రాతృత్వానికి నెలవైన తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆనందంగా పండుగ చేసుకోవాలని ఆకాక్షించారు. సత్ప్రవర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని మహ్మద్ ప్రవక్త చెప్పిన మాటలు సదా అనుసరణీయమని సీఎంలు అభిప్రాయపడ్డారు.
ప్రార్థించే పెదవులకన్నా సాయమందించే చేతులే మిన్న అన్న సూక్తికి స్ఫూర్తిదాయకంగా నిలిచే పండగే రంజాన్‌. దీన్ని ఉపవాసాల పండుగ, దాన ధర్మాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈద్గా మైదానాల్లో, మసీదుల్లో జరుపుకునే నమాజ్‌ ప్రార్థనలనే ఈదుల్‌ ఫితర్‌ ప్రార్థన అంటారు. నమాజ్‌ ప్రార్థనల అనంతరం పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా పరస్పర ఆలింగనం చేసుకుని సంతోషంగా ఈద్‌ ముబారక్‌ తెలుపుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించాలని ప్రార్థిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com