వీసా ఫీజులు పెంచేసిన భారత్..

- June 25, 2017 , by Maagulf
వీసా ఫీజులు పెంచేసిన భారత్..

న్యూఢిల్లీ: అమెరికా, ఆస్ట్రేలియా తరహాలోనే విదేశీ వీసాల విషయంలో భారత ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం అమలులో ఉన్న వీసా ధరలను పెంచడానికి నిర్ణయం తీసుకుంది. భారత్ లో అడుగుపెట్టే విదేశీయులకు వివిధ కేటగిరీల్లో 50శాతం మేర ఫీజు పెంచనున్నట్లు ప్రకటించింది.
కాగా, అమెరికా, కెనడా, యూకె, ఇజ్రాయెల్, ఇరాన్, యూఏఈ దేశాల వీసాలకు సంబంధించి వివిధ కేటగిరీల్లో ఇప్పటికే భారత్ ఫీజులు పెంచిన సంగతి తెలిసిందే. తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఏడాది వరకు ఇచ్చే పర్యాటక వీసాలకు ఇంతకుముందు అమలులో ఉన్న 100డాలర్ల రుసుంను 153డాలర్లకు పెంచింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.9869 కాగా.. ఇంతకుముందు రూ.6450గా ఉండేది.
ఇక ఐదేళ్ల కాలపరిమితితో కూడిన వీసాలకు 120డాలర్లుగా ఉన్న ఫీజును 306డాలర్లకు పెంచారు. ఈ లెక్కన ఐదేళ్ల వీసా కోసం రూ.19736 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో యూకె దేశస్తులకు కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. యూకె నుంచి వచ్చే విదేశీయులకు ఏడాది కాల పరిమితితో ఇచ్చే పర్యాటక వీసాలను 484డాలర్ల నుంచి 741డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కెనడా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, థాయ్ లాండ్ దేశస్తులు ఉద్యోగ వీసాలకు 300డాలర్లకు బదులు 459డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com