ఆషాడ శుక్ల ఏకాదశి విశిష్టత !

- July 03, 2017 , by Maagulf
ఆషాడ శుక్ల ఏకాదశి విశిష్టత !

ఆషాడ శుక్ల ఏకాదశిని 'తొలి ఏకాదశి' అని అంటారు. ఈరోజు నుంచి నాలుగు నెలలు చాతుర్మాసం మొదలు అవుతుంది. ఈ పవిత్ర సమయంలో భక్తులు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు ఆరాధన చేస్తే శుభ ప్రధమని పురాణాలు చెపుతున్నాయి.
ఈ వ్రతాన్ని ఎంత నియమ నిష్టలతో ఆరాధిస్తే అంత మంచిదని అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలు చెపుతూ ఉంటారు. ఈ వ్రత ప్రాముఖ్యాన్ని గౌతమ బుద్ధుడు అనుభవ పూర్వకంగా తెలియచేసాదని జాతక కథలు వెల్లడిస్తాయి. ఈ నాలుగు నెలలు శ్రీమహావిష్ణువు క్షీరాబ్ది పై యోగ నిద్రలో ఉండటం వల్ల నదులకు ఆధ్యాత్మిక శక్తి కలుగుతుంది అని అంటారు.
ఈ కాలంలో వంటలను నిలిపివేసి ఎక్కువగా ఉపవాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదే కాలంలో వచ్చే వ్యాస పూర్ణిమ 'గురు పౌర్ణమి' గా సమాదరణ పొందుతుంది. ఈ కాలంలో శ్రద్ధతో వేద పురుష పఠనాలు దైవాభిషేకం మిత భాషణ మిత భోజనం చేస్తారు. ఈ కాలంలో భూత దయతో అన్న జల గోదానాలతో కాలం సద్వినియోగం చేసుకోవడమే కాకుండా పర నింద చేయకుండా కాలం గడపాలని పెద్దలు సూచిస్తారు.
యోగ నిద్రలో ఉండే శ్రీమహావిష్ణువు ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తుల యోగ ముద్రలు ఎంతో సహకరిస్తాయి. ఈ కాలంలో చేసే యోగ సాధన మనకు మంచి ఫలితాలు ఇస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెపుతూ ఉంటారు. మన హిందూమత సాంప్రదాయానికి సంబంధించి తొలి పండుగగా భావించే ఈ 'తొలి ఏకాదశి' రోజున వైష్ణవ ఆలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి.
యోగ సాధనతోనే భగవంతుడి సాక్షాత్కారం లభిస్తుంది అన్న విషయాన్ని తెలియచేసే రోజుగా ఈ తొలి ఏకాదశి రోజును భావిస్తూ మన పాపాల విముక్తి కోసం శ్రీమహావిష్ణువు ని ఆరాధించడం అన్నిటికి శుభ సూచికం..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com