అర్మేనియా డైరీ పార్ట్ – 1

- July 20, 2017 , by Maagulf


A quote from the Dalai Lama "Once a year, go somewhere you have never been before" 
హైదరాబాదులో ఉన్న అబిడ్స్ ప్రాంతానికి ఆ పేరు రావటానికి కారణం అర్మేనియా దేశానికి చెందిన ఒక వ్యాపారి. ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ని పాలించే సమయంలో అర్మేనియాకి చెందిన ఆల్బర్ట్ అబిద్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో ఒక దుకాణం నడిపేవాడు.అందువల్ల ఆ ప్రాంతాన్ని అబిద్ షాప్ అని పిలిచేవారు. కాలక్రమేణా అది అబిడ్స్ అయ్యింది.ఇది మన తెలుగు నేలకి అర్మేనియా కి ఉన్న అనుభంధం. ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశానికి సెలవలకి వెళ్ళటం రివాజు. ఇంతకుముందు భార్గవి నేనూ యూరప్ దేశాలు, గత నాలుగేళ్లుగా దుబాయ్ లో నివాసం ఉండటంతో పక్కనున్న గల్ఫ్ దేశాలన్నీ కవర్ చేసేశాం. ఇక సంవత్సరం మాతో పాటు మా అబ్బాయి హన్ష్ కూడా మాకు తోడయ్యాడు. అర్మేనియా దేశాన్ని ఈ సంవత్సరం మా పర్యటనకి ఎంచుకున్నాం.
మే 19 వ తేదీ ఉదయం 11.40 గంటలకి దుబాయ్ నుండి ఫ్లై దుబాయ్ విమానంలో అర్మేనియా రాజధాని నగరమైన యెరవాన్ కి పయనమయ్యాం. టికెట్లు, హోటల్ ఏర్పాట్లు అన్నీ ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసుకోవటంతో మాకు పెద్దగా ఇబ్బంది ఏమి లేదు.దుబాయ్ నుండి యెరవాన్ మూడు గంటల ప్రయాణం.మధ్యాహ్నం మూడు గంటలకల్లా యెరవాన్ లోని జావార్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండ్ అయ్యాం.దుబాయ్ మరియు అర్మేనియా సమయాల్లో తేడా ఏమీ లేదు.ఈ రెండు దేశాలు భారత కాలమానం కంటే గంటన్నర వెనక వుంటాయి.
దుబాయ్ లో నివాస వీసా ఉండే భారతీయులకి అర్మేనియా ఆగమానంతర వీసా సదుపాయం కల్పిస్తోంది. ఎయిర్ పోర్ట్ లో పాస్పోర్ట్ చెక్ కంటే ముందే వీసా విభాగం ఉంది. వీసాకి చెల్లించాల్సిన పైకం ఆర్మేనియా కరెన్సీ లోనే చెల్లించాలి. అర్మేనియా కరెన్సీ పేరు డ్రామ్, ఒక డాలర్ కి 477 డ్రాములు వస్తాయి. 21 రోజులు మీరు ఆర్మేనియాలో ఉండాలంటే 3000 డ్రాములు వీసా ఫీజు చెల్లించాలి.అంటే 6 డాలర్లు, మన డబ్బుల్లో అయితే 400 రూపాయలు.18 ఏళ్ల వయసు లోపు వారికి వీసా ఉచితం.మా అబ్బాయి హన్ష్ వయసు 8 నెలలు కావటంతో తనకి వీసా చార్జీలు లేవు.వీసా కౌంటర్ పక్కనే ఉన్న కరెన్సీ ఎక్స్చేంజి లో 100 డాలర్స్ మార్చుకుంటే 47700 అర్మేనియా డ్రాములు వచ్చాయి.6000 డ్రాములు చెల్లించి నేను నా శ్రీమతి భార్గవి వీసా తీసుకున్నాం. ఎయిర్పోర్ట్ బయటకి రాగానే ట్రావెల్ ఏజెంట్ మా పేర్లు ఉన్న ప్లకార్డు తో నిలబడి ఉన్నాడు. మాతో పాటు దుబాయ్ నుండి మరో 9 మంది అదే ట్రావెల్ ఏజెంట్ ద్వారా వచ్చారు. అందరిని కలిపి 18 సీట్స్ ఉన్న ఒక మినీ బస్సులో కూర్చోబెట్టారు. మా గైడ్ పేరు మేరీ, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతోంది. మేము మొత్తం 4 రోజులు ఈ దేశంలో ఉండబోతున్నాం. అయితే కేవలం రెండు రోజులకి మాత్రమే మేము ట్రావెల్ ఏజెంట్ దగ్గర లోకల్ టూర్స్ తీసుకున్నాం. నాకు చరిత్ర అంటే ఉన్న ఆసక్తి వల్ల ఈ టూర్ ప్యాకేజీలో లేని కొన్ని ప్రదేశాలని సందర్శించాలని నిశ్చయించుకోవటంతో మిగతా 2 రోజులు వాటి కోసమే అట్టిపెట్టుకున్నాను.బస్సు బయలుదేరగానే మా గైడ్ మేరీ తనను తాను పరిచయం చేసుకుని మా వివరాలు అడిగింది. అందరం పరిచయం చేసుకున్నాక యెరవాన్ గురించి చెప్పటం ప్రారంభించింది.
ప్రపంచంలో ఉన్న అతి పురాతన నగరాల్లో యెరవాన్ ఒకటి. క్రీస్తు పూర్వం 782 వ సంవత్సరంలో ఆర్గిష్టి 1 అనే రాజు ఏరేబుని కోట నిర్మాణంతో ఈ నగరానికి పునాది వేసాడు. ఏరేబుని ఒక గొప్ప పరిపాలన మరియు మతపరమైన కేంద్రంగా, పూర్తిగా రాజధానిగా రూపొందించబడింది.తరువాత కొంత కాలానికి కొత్త రాజధాని నగరాలు స్థాపించబడి, యెరవాన్ ప్రాముఖ్యత తగ్గింది.ఇరాన్ మరియు రష్యన్ పాలనలో 1736 నుండి 1828 వరకు కొంత వైభవాన్ని పొందింది. 1850 నుండి 1917 వరకు ప్రత్యేక గవర్నరేట్ గా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఒట్టోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక అర్మేనియా గణతంత్ర రాజ్యంగా మారిన పిమ్మట 1918 నుండి నేటి వరకు అర్మేనియాకి రాజధాని గా ఉంది.మొత్తం వెరసి 2800 సంవత్సరాల వయస్సున్న పురాతన నగరం యెరవాన్.
ఇక అర్మేనియా విషయానికి వస్తే అరారత్ పర్వతాల ఒడిలో దాదాపు 5000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న దేశం ఇది.కానీ ఏనాడు కూడా స్థిరత్వంగా ఉన్న దాఖలాలు లేవు. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్బైజాన్, దక్షిణాన ఇరాన్ మరియు అజర్బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్క్లేవ్లు ఉన్నాయి.ఇది ల్యాండ్ లాక్డ్ దేశం, అంటే భూబంధిత ప్రాంతం. నాలుగు వైపులా భూమి మాత్రమే సరిహద్దుగా ఉంది. ఈ దేశానికి సముద్ర తీర ప్రాంతం లేదు, కేవలం అక్కడపర్వత ప్రాంతాల్లో దొరికే రాగి , బంగారం, తగరం వంటి ఖనిజాల తవ్వకాల మీదనే ఈ దేశం ఆధారపడి ఉంది. ఒకప్పుడు దేశంలో భాగంగా ఉండి, దేశానికి జాతీయ చిహ్నంగా భావించే అరారత్ పర్వతాలు ప్రస్తుతం టర్కీ లో ఉన్నాయి. అయినా సరే వాటిని తమ దేశ జాతీయ చిహ్నంగా భావిస్తారు.బైబిల్ ప్రకారం జల ప్రళయం ఏర్పడినప్పుడు నోవా అనే పెద్దాయన కొన్ని ప్రాణులను ఒక నౌకలో పెట్టి రక్షిస్తాడు. ఆ నౌక అరారత్ అనే కొండ దగ్గరికి చేరుకుందని అర్మేనియన్లు నమ్ముతారు. కొంతకాలం పర్షియన్లు , బైజాంటైన్, మంగోలులు ఈ దేశాన్ని పరిపాలించారు. మరికొంత కాలం తూర్పు , పశ్చిమ అర్మేనియాలుగా విభజించి పశ్చిమాన్ని టర్కీ ఒట్టోమన్ ప్రభుత్వం , తూర్పు భాగాన్ని ఇరాన్ పాలించాయి. అర్మేనియాలో నివసించే జనాభా 30 లక్షలు అందులో దాదాపు 50 శాతం మంది రాజధాని నగరం యెరవాన్ లోనే నివసిస్తారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా మిగతా దేశాలలో ఉన్న ఆర్మేనియన్లు 80 లక్షలు. ఆది నుండి ఈ దేశం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కోవటంతో పలు దఫాలుగా ఇక్కడి పౌరులంతా వలసలు వెళ్లిపోయారు.
ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన మా బస్సు నగరం వైపు ప్రయాణిస్తోంది. ఇక్కడి ఇళ్ళు అన్నీ పింక్ మరియు లేత పసుపు రంగులో ఉండటం గమనించాం. దీని గురించి మా గైడ్ మేరీ ని అడగగా, ఆలా కనిపించటానికి కారణం ఇక్కడ నిర్మాణాలకు ఉపయోగించే టాఫ్ అనే ప్రత్యేకమైన రాయి. నగరంలో ఉన్న ఇళ్ళు , భవంతులు , పెద్ద పెద్ద కట్టడాలన్నీ ఈ రాతితోనే నిర్మిస్తారు. పింక్ మరియు లేత పసుపు రంగులో వల్కనో బూడిద నుండి ఏర్పడిన ఈ రాయి యెరవాన్ లోని కారాబాగ్ అనే ప్రాంతంలో విరివిగా లభిస్తుంది. 2800 ఏళ్ల క్రితం ఈ నగర నిర్మాణం మొదలైనప్పటినుండి నేటి వరకు కూడా ఇదే రాయిని నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. అందుకే నగరమంతా ఎరుపు , లేతపసుపుల మిశ్రమంగా కనిపిస్తుంది. మేము ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళినపుడు కింద ఉన్న నిర్మాణాలన్నీ ఇదే రంగుల్లో కనిపించాయి. ఆధునిక నిర్మాణాలకు కూడా సిమెంట్ గాని సున్నం గాని వేయరు.కేవలం రాళ్ళని నిలబెట్టి వాటి మధ్యలో మాత్రం సిమెంటుతో పూడుస్తారు. పెద్ద ఫ్యాక్టరీల నుండి చిన్న ఇంటి వరకు కూడా ఇదే తరహాలో నిర్మాణం జరుగుతుంది. వేసవిలో చల్లగా , చలికాలంలో వెచ్చగా ఉండటంఈ రాయి ప్రత్యేకత. 

--రాజేష్ వేమూరి(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com