నేడు " పేరెంట్స్ డే "

- July 22, 2017 , by Maagulf
నేడు

నేడు " పేరెంట్స్ డే ".....సందర్భంగా  తల్లి తండ్రులకు శుభాకాంక్షలు 

                              ఎందరో తల్లితండ్రులు... అందరికీ వందనాలు !!

కన్నవారిని గౌరవించేందుకు ... మదర్స్ డే , ఫాదర్స్ డే ఉన్నాయి కదా ...ఇంకా  ఈ తల్లిదండ్రుల దినోత్సవం ఎందుకు ?. తల్లిదండ్రులను వేరువేరు గా గౌరవించడం ఇష్టం లేక ...మదర్స్ డే ని , ఫాదర్స్ డే ని , రెండింటినీ కలిపి ఒకే రోజు వేడుక చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతొ అమెరికాలో ఈ ప్రతిపాదన మొదలయింది. అమెరికాలో ఫాదర్స్ డే ని జూన్‌ 3 వ ఆదివారం  , మదర్స్ డే ని -మే 2 వ ఆదివారం జరుపుకునే సాంప్రదాయం ఉంది . పేరెంట్స్ డే ని ప్రతి సంవత్సరము జూలై 4 వ ఆదివారం నిర్వహిస్తున్నారు. 1994 లో నాటి అమెరికా ప్రసిడెంట్ " బిల్ క్లింటన్‌ " సంతకము చేసి శాసనము చేసారు . అమెరికా సుప్రీం కోర్టు కూడా మదర్స్ డే , ఫాదర్స్ డే లను రద్దుచేసి తల్లిదండ్రుల విషయము లో లింగభేదము ఉండ కుండా చూడాలని తీర్మానానికి అంగీకరించింది . అప్పటినుండే " పేరెంట్స్ డే "  ని జరుపుకోవడం ప్రపంచమంతటా విస్తరించింది  .కొరియా లో పేరెంట్స్ డే ని ' మే 8 వ తేదీన జరుపుకుంటారు . ఇండియా లో జూలై 4 వ ఆదివారం రోజున ఇప్పుడిప్పుడే జరుపుకోవడం మొదలైనది .
తల్లితండ్రులు అంటే...చేతులు పట్టుకొని తోలి నడక నేర్పినవారు... కంటిలో నలుక పడితే నాలుకతో తీసినవారు అడిగిన వాటికి లేదన కుండా కొన్నవారు... పిల్లల కోసం  సర్వస్వం త్యాగం చేసిన జనకులు వారు.. మీకు గుర్తుందా ?  అమ్మ ఎప్పుడు అనేది బంగారు తండ్రీ అని ..నాన్న ఎప్ప్పుడే అనేవాడు మనల్ని ముద్దుగా బడుద్ధాయి.. జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పింది నాన్న ...అనారోగ్యంలో ఉన్నప్పుడు అక్కున చేర్చుకునేది అమ్మ...బ్రతుకు పాఠాలు నేర్పి మనిషిగా చేసి బంగారు బాటలో నడిచే మార్గం చూపిస్తాడు నాన్న..సింహంలా గర్జించినా, పులిలా గాండ్రించినా ఆయన ఓ కర్కశుడు కాదు. కుటుంబాన్ని క్రమశిక్షణలో...కష్టల్లేని రీతిలో నడపాలన్నదే ఆయన తపన. నాన్నంటే ఓ సింహం, ఓ పులి కానే కాదు..ఆయనో మార్గదర్శి.అందరికీ పెద్ద దిక్కు.నిజానికి నాన్నంటే ఇంటి 'పై కప్పు''...అందుకే తల్లి లాంటి లాలన, తండ్రిలాంటి రక్షణ అన్నారు.పైకి కోపంగా కనిపించినా..కాసింత ప్రేమ కోసం నిలువెల్లా కరిగిపోతాడు నాన్న.బిడ్డల శ్రేయస్సే పరమావిధిగా భావించి ఎన్ని కష్టాలైనా భరిస్తాడు.పిల్లలపై అమ్మకు ఎంతటి ఆప్యాయతలు, బాధ్యతలున్నాయో అవన్నీ నాన్నకూ ఉన్నాయి.పిల్లలను పెంచడంలో, మమతానురాగాలను పంచడంలో అమ్మ ఎంతగా పరితపిస్తుందో నాన్నకూడా అందులో ఏ మాత్రం తీసిపోడు.ఆయన కసురుకున్నా, కళ్లెర్ర చేసిన వాస్తవ అంతరంగం అదే. ఆత్మీయతకు అమ్మ ప్రతిబింబమైతే..అంతులేని వాత్సల్యానికి నాన్న ఓ ప్రతిరూపం. పిల్లల్లో ధైర్యాన్ని నింపి, వారు దర్జాగా బతికేందుకు అనుక్షణం ఆసరా ఇచ్చేది నాన్న.మారుతున్న కాలంతో పాటు కుటుంబ వ్యవస్థలోనూ అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి.నాన్నల వైఖరిలో, ధోరణిలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.గతంలో...సంపాదించడం ఒక్కటే నాన్న ప్రధాన బాధ్యత అన్న భావం ఉండేది. అమ్మ ఇంటికే పరిమితమైతే, నాన్న ఇంటా, బయట కుటుంబం కోసం శ్రమిస్తాడు. ఒకప్పుడు పిల్లలంతా తండ్రి మాటను జవదాటని వారే! ఆధునిక యుగంలో ఆ పరిస్థితి ఎంతో మారింది.పిల్లల మనోభావాలను తెలుసుకుంటూ వారి ఇష్టప్రకారమే అంతా జరగాలని తండ్రులు భావిస్తున్నారు.పిల్లల అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించినప్పుడు మేలే జరుగుతుందన్న విషయాన్ని నాన్నలు గ్రహిస్తున్నారు.చదువు విషయంలో గానీ, పెళ్ళి విషయంలో గానీ పిల్లల మనోభావాలను గుర్తించేందుకు తండ్రులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.ఉదయానే నిద్ర లేపి పిల్లల చేత పద్ధతి ప్రకారం చదివించడం, వారి యోగక్షేమాలు విచారించడం, పరీక్షలు రాసేందుకు ధైర్యం ఇస్తూ వారిని పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువెళ్ళడం, మంచి మార్కులొస్తే అభినందించడం, తక్కువ మార్కులొస్తే ధైర్యం చెప్పడం, వారి ఇష్టప్రకారం అనువైన కోర్సులు చదివించడం, అనుకున్న ఉద్యోగం దక్కేలా ప్రోత్సహించడం, యుక్తవయసుకొచ్చి ప్రేమలో పడితే నిండుమనుసుతో అంగీకరించడం, నచ్చిన వారితో పెళ్ళి జరిపించడం...ఈ బాధ్యతలన్నీ తండ్రులు నేడు మనస్పూరిగా నిర్వహిస్తున్నారు. కుటుంబ వ్యవస్థలో ఇటీవల కాలంలో వచ్చిన పెనుపరిణామం.ఇలాంటి మార్పులే కుటుంబ వ్యవస్థ మరింతగా బలపడడానికి, మమతానురాగాలు వెల్లివిరియడానికి దోహదం చేస్తాయి. తమ అభివృద్ధి కోసం తల్లితండ్రులు ఎంతగా పరితపిస్తున్నారో... పిల్లలూ అంతగా తపన చెందాలి . మంచి ఉద్యోగం వచ్చాక 'రెక్కలొచ్చిన పక్షి ' మాదిరిగా నేడు ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమవుతున్నారు.ఉద్యోగం, సంపాదన, తన కుటుంబమనే స్వార్ధంతో  గిరి గీసుకుంటూ..తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నవారు ఎందరో ఉన్నారు.కొందరైతే మరీ కఠినంగా..వయోభారం పెరిగిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.అమెరికాలోనో, ఇంకెక్కడో ఉద్యోగాలు వెలగబెడుతూ సొంతగడ్డ పై పేరెంట్స్ ను మరిచిపెతున్నారు.ఇది మంచిది కాదని ఎవరైనా ఆప్తులెవరైనా అంటే 'డబ్బు పంపుతున్నాం కదా..వృద్ధాశ్రమాల్లో అన్నీ ఏర్పాటూ చేసాం కదా..' అని కొందరు పుత్రరత్నాలు చెబుతుంటారు.అప్యాయతలు, అనురాగాలు డబ్బుతో కొనలేమని వారు తెలుసుకోలేకపోతున్నారు.తాము వృద్ధులమైనప్పుడు తమ పరిస్థితి కూడా ఇంతే కదా! అన్న నగ్న సత్యాన్ని కొందరు విస్మరిస్తున్నారు.ఆస్తిపాస్తులను, అనురాగాన్ని పంచిన అమ్మానాన్నలను అలక్ష్యం చేస్తే భవిష్యత్తులో అలాంటి వేదనలే ఎదురవుతాయని  గ్రహించాలి. ' ఏది భూమిలో  విత్తుతామో..అదే పంట కోస్తామని ' కొందరు భావించడం లేదు. నిండైన జీవితాన్ని, బంగారు భవిష్యత్తును తమకు ప్రసాదించిన తల్లితండ్రుల అంతరంగాన్ని చదివి, వారి వృద్ధ మనస్సులకు  అన్ని విధాలా ఆనందం కలిగించడం పిల్లల కనీస కర్తవ్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com