అర్మేనియా డైరీ పార్ట్ - 3

- July 27, 2017 , by Maagulf

అర్మేనియాకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయంచాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని అధికారికంగా స్వీకరించిన మొట్టమొదటి దేశం ఇది. క్రీస్తు ముఖ్య శిష్యులైన దాడియస్బార్తోలోమేవ్ ప్రభావంతో క్రీస్తుశకం 301 వ సంవత్సరంలో అర్మేనియన్లు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. తద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి క్రైస్తవ దేశంగా అర్మేనియా గుర్తింపు పొందింది. మరో పది సంవత్సరాలకి రోమ్ నగరానికి ఆ హోదా లభించింది.

గార్ని దేవాలయం నుండి మా ప్రయాణం దానికి కొద్ది దూరంలోనే ఉన్న గెగార్డ్ అనే చర్చి దగ్గరకి. గార్ని వెళ్లిన ప్రతి ఒక్కరు తప్పకుండా చూసే ప్రాంతం గెగార్డ్ చర్చి. ఇవి రెండూ కూడా కొద్ది దూరంలోనే ఉంటాయి. మేము బస్ దిగి కొంచెం ఏటవాలుగా ఉన్న ప్రాంతంలోకి నడిచి చర్చి లోపలి చేరుకున్నాం.ఇందులో మొత్తం చర్చిలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే ఇవి అన్నీ ఒకే రాతిలో తొలిచిన నిర్మాణాలు. మొదటి చర్చి నాలుగు శతాబ్దంలో రాతి గుహ మాదిరిగా తొలిచారు. తరువాత వరుసగా 8, 10 వ శతాబ్దాల్లో మిగతా రెండు చర్చి లని పక్కనే ఉన్న మరో రాతిలో తొలిచారు. పైకి చూడటానికి మాత్రం ఇదంతా ఒకే నిర్మాణంలా అనిపిస్తుంది. కానీ లోపల మూడు నిర్మాణాలు ఉన్నాయి. వెలుగు కోసం పైన వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. అన్నేళ్ల క్రితం అలాంటి నిర్మాణం ఎలా చేశారా అని ఆశ్చర్యపోయాం. అక్కడినుండి బయటకి వస్తుండగా హల్వాలా కనిపించే కాండీ లు అమ్ముతున్నారు. ఒక దారానికి కాజు పిస్తా లాంటి డ్రైఫ్రూప్ట్స్ గుచ్చి వాటిని హల్వా లాంటి పదార్థంలో ముంచి కాండీ లాగ తయారు చేసి అమ్ముతున్నారు.దీనిని సుజుక్ అంటారు,ఇది చాలా మంచి పోషకాలు కలిగిన ఆహరం. పూర్వం యుద్ధాలకి వెళ్లే సైనికులు ఈ కాండీలని ఆహారంగా తీసుకెళ్లేవారట. ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు మంచి శక్తిని ఇస్తాయని వీటిని తినేవారట. మేము కూడా క్యాండీలు కొన్నాం.అప్పటికే సాయంకాలం గంటలు అయ్యింది.ఇక్కడి నుండి తిరుగు ప్రయాణం అయ్యి 2గంటల తర్వాత యెరవాన్ రిపబ్లిక్ స్క్వేర్ కి చేరుకున్నాము. మా గ్రూప్ లో కొంతమంది షాపింగ్ కోసం అక్కడ దిగిపోయారు. మరుసటి రోజు టూర్ ప్లాన్ అంతా మిగతా వారికి చెప్పి గైడ్ మేరీ కూడా మా దగ్గర వీడ్కోలు తీసుకుని మధ్యలోనే దిగిపోయింది. మరుసటి రోజు వారందరూ యెరవాన్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరారత్ పర్వతాల దగ్గరకి వెళుతున్నారు.

మరుసటి రోజు మేము గైడ్ లేకుండానే కొన్ని ప్రాంతాలు చూడాలని నిర్ణయించుకోవటంతోమాకు అంతకుముందే పరస్పర మిత్రుల ద్వారా పరిచయం అయిన ఆర్మేనియన్ నివాసిమన తెలుగు వారు అయిన డాక్టర్ లక్ష్మణ్ కుమార్ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఆర్మేనియాలో మెడికల్ యూనివర్సిటీ మరియు మెడికల్ కాలేజీ ఉన్నాయి. ఇండియా నుండి పలువురు విద్యార్థులు ఏటా ఇక్కడ డాక్టర్ కోర్సు చెయ్యటానికి వస్తుంటారు. ఇండియాతో పోలిస్తే ఇక్కడ డాక్టర్ చదువు చాలా చవక. నివాస ఖర్చులు కూడా తక్కువేమన దగ్గర అయ్యే ఖర్చులో కేవలం 20 శాతంతో ఇక్కడ డాక్టర్ చదువు అయిపోతుంది. అలాగే ఐదేళ్ల క్రితం ఇక్కడ మెడిసిన్ చదవటానికి వచ్చి ఇక్కడే స్థిరపడిన హైదరాబాద్ కి చెందిన లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడి భాషతో ఈ దేశంతో మమేకమయ్యారు.అసలు భారతీయులే పెద్దగా కనపడని ఈ దేశంలో మన తెలుగు వారు ఉండటం చాలా సంతోషం అనిపించింది. మరుసటి రోజు ఉదయం లక్ష్మణ్ గారు ఏర్పాటు చేసిన టాక్సీ డ్రైవర్ మాకోసం గంటకల్లా వచ్చాడు. ఇక్కడ ఇంగ్లిష్ మాట్లాడే వారు చాలా అరుదుటాక్సీ డ్రైవర్ కి కూడా ఇంగ్లీష్ రాదు. ఆ రోజు ప్లాన్ మొత్తం మేము లక్ష్మణ్ గారికి చెప్పటం ఆయన దానిని ఆర్మేనియన్ భాషలో ఆ డ్రైవర్ కి చెప్పటంతో పెద్ద సమస్య లేకుండానే మా మిగతా రెండు రోజుల పర్యటన జరిగింది. ఎప్పటికప్పుడు ఫోన్ లో మమ్మల్ని గైడ్ చేస్తూ ప్రతి క్షణం జాగ్రత్తలు తీసుకున్న లక్ష్మణ్ కుమార్ గారి ఆదరణ ని ఎన్నటికీ మరచిపోలేము.

ఇంతకుముందు చెప్పుకున్నట్లు మొట్టమొదటగా క్రీస్తు ముఖ్య శిష్యులైన దాడియస్బార్తోలోమేవ్ ప్రభావంతో క్రీస్తుశకం 301 వ సంవత్సరంలో అర్మేనియన్లు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. 301 మరియు 304 సంవత్సరాల మధ్యలో ఇంతకుముందు పాగన్ దేవాలయం ఉన్నVagharshapat ప్రాంతంలో Etchmiadzin Cathedral అనే చర్చి నిర్మాణం గావించారు. ఇది ప్రపంచంలో నిర్మించిన తోలి క్రైస్తవ ప్రార్ధనా మందిరం. పర్షియన్ల పాలనా కాలంలో ఇది కొంత ధ్వంసం అయ్యింది. ఇప్పుడు మేము ఈ చర్చి చూడటానికే వెళుతున్నాం. మా హోటల్ నుండి ఈ ప్రాంతానికి 28 కిలోమీటర్లు దూరం ఉంది. హోటల్ నుండి యెరవాన్ నగరం మీదుగా గంట ప్రయాణించాక ఈ చర్చి ఉన్న ప్రాంతానికి చేరుకున్నాం. సన్నగా చినుకులు పడుతున్నాయి. మమ్మల్ని గేట్ దగ్గర దింపేసి డ్రైవర్ పార్కింగ్ లోకి వెళ్ళిపోయాడు. హన్ష్ కార్ లోనే నిద్రపోవటంతో వాడిని ట్రాలీలో పడుకోబెట్టి మెల్లగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాం. ఆ చర్చి గోపురాలకు అన్నీ ఇనుప రాడ్లతో ఫెన్సింగ్ లాగా వేశారు. చర్చికి రిపేర్ పనులు జరుగుతున్నాయి. మేము ఆ ఆవరణ అంతా తిరిగి ఫోటోలు తీసుకుని చర్చి లోపలికి వెళ్ళాం. వేల ఏళ్ల క్రితం ఒక మతానికి సంభందించిన తోలి ప్రార్ధనా మందిరంలో ఉండటం గొప్ప అనుభూతి. అక్కడున్న చాలా మంది టూరిస్ట్ లలో అసలు ఇండియన్స్ ఎవరూ లేరు. అక్కడున్న కొంతమంది భార్గవి తో మాట్లాడి ఫోటో తీసుకున్నారు. మేము చర్చి లోపలికి వెళ్ళేటప్పటికి హన్ష్ కూడా నిద్ర లేచాడు. అక్కడున్న దాడియస్బార్తోలోమేవ్ తైలవర్ణ చిత్రాలు అన్నీ చూసి బయటికి వచ్చాం.

అక్కడికి కొద్ది దూరంలోనే మరో చారిత్రక కట్టడం జీవర్నాట్స్ కాథెడ్రల్ ఉంది.క్రీస్తుశకం వ శతాబ్దంలో అర్మేనియా లో ఎక్కువ భాగం బైజాంటైన్ ల పరిపాలనలో ఉండేది. సమయంలోనే మధ్య ప్రాచ్యంలో ఇస్లాం మతం కూడా ప్రభావం చూపుతోంది. 643 వ సంవత్సరంలో కొంతమంది కాథలిక్కుల సూచన మేరకు Etchmiadzin కేథడ్రల్ కి పెద్దగా వ్యవహరిస్తున్న గ్రెగరీ అప్పటి రాజైన ట్రిడేట్ కి ఈ నిర్మాణం గురించి ప్రతిపాదించారు.అలా 643 లో ప్రారంభమైన ఈ నిర్మాణం 652 వ సంవత్సరంలో పూర్తయ్యింది.జీవర్నాట్స్ అంటే ఆకాశ దేవతలు అని అర్ధం. అర్మేనియా ఎయిర్పోర్ట్ పేరు కూడా జీవర్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పెట్టటానికి ఈ చారిత్రక కట్టడమే ఆధారం. చుట్టూ 32 స్తంభాలతో వృత్తాకారంగా ఉన్న ఈ కట్టడం మూడు అంతస్థులతో ఉండేదని చెపుతారు. ప్రస్తుతం మొండి స్తంభాలుగోడలు మాత్రమే మిగిలాయి.10 వ శతాబ్దం నాటికే ఈ కాథెడ్రల్ ధ్వంసం అయ్యింది. ఇందుకు గల కారణాల్ని చరిత్రకారులెవ్వరు వివరించలేదు. మళ్ళీ 1901 నుండి 1907 వరకు ఇక్కడ తవ్వకాలు జరిగి దీన్ని మళ్ళీ పునర్నిర్మించే ప్రతిపాదన జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తవ్వకాల్లో దొరికిన అవశేషాలు పక్కనే ఉన్న మ్యూజియంలో భద్రపరిచారు. సూర్య మానాన్ని సూచించే రాతి గడియారం మాత్రం ఈ ఆవరణలోనే బయట ఉంది. 2000 సంవత్సరంలో ఈ ప్రాంతం యునెస్కో వారసత్వ ప్రాంతంగా గుర్తింపు పొందింది. దీనికి కూడా ప్రవేశ రుసుము 2డాలర్లు.మేము ఈ కట్టడం చూస్తుండగానే ఒక ఆర్మేనియన్ యువతి వచ్చి మీరు ఇండియన్సా అని అడిగింది. అవునని చెప్పగానే తాను ఇండియన్ కాన్సులేట్ లో సంవత్సరాలు పని చేశానని తనకు ఇండియన్ వంటలు అన్నీ బాగా వచ్చని చెప్పింది. హన్ష్ ని ఎత్తుకుని ముద్దాడుతూ మాతో కలిసి ఒక ఫోటో దిగింది. మేము ఈ రెండు చూసేటప్పటికి మధ్యాహ్నం 12.30 నిమిషాలు అయ్యింది.అక్కడినుండి బయలుదేరి భోజనానికి యెరవాన్ వైపు మా కారు బయలుదేరింది.లక్ష్మణ్ గారి సూచన తో టాక్సీ డ్రైవర్ మమ్మల్ని సిటీ మధ్యలో నేల మాళిగలో ఉన్న ఒక అత్యాధునిక రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. తనని కూడా మాతోనే భోజనం చెయ్యమని కోరటంతో తానూ మాతోనే భోజనం చేశాడు. ముగింపు తరువాతి భాగంలో..

--రాజేష్ వేమూరి(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com