గౌతమ్‌ నంద రివ్యూ

- July 28, 2017 , by Maagulf
గౌతమ్‌ నంద రివ్యూ

రివ్యూ: 
సినిమా పేరు: గౌతమ్‌ నంద 
నటీనటులు: గోపీచంద్‌.. హన్సిక.. కేథరిన్‌.. తనికెళ్ల భరణి.. ముఖేష్‌ రుషి తదితరులు 
సంగీతం: తమన్‌ 
ఛాయాగ్రహణం: సౌందర్‌రాజన్‌ 
కళ: బ్రహ్మ కడలి 
నిర్మాతలు: జె.భగవాన్‌, పుల్లారావు 
కథ.. మాటలు.. స్క్రీన్‌ ప్లే.. దర్శకత్వం: సంపత్‌ నంది 
విడుదల: 28-07-2017
తొ లి అడుగులోనే ఆకట్టుకొన్న దర్శకుడు సంపత్‌ నంది. ‘ఏమైంది ఈ వేళ’తో హిట్‌ అందుకొన్నాడు. ఆ తర్వాత ‘రచ్చ’.. ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాలతో మాస్‌ దర్శకుడుగా తన ముద్ర వేశారు. ‘ధనమ్‌ ఇదమ్‌ జగత్‌’ అనే కాన్సెప్టుతో ‘గౌతమ్‌ నంద’ తెరకెక్కించాడు. గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది గోపీచంద్‌ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకే ‘గౌతమ్‌ నంద’ ఆయన కెరీర్‌కి చాలా కీలకం. సంపత్‌ నందిపై గోపీచంద్‌ పెట్టుకొన్న అంచనాలు నిజమయ్యాయా? ‘గౌతమ్‌ నంద’ ఎలా ఉన్నాడు? అంటే..
కథేంటంటే?: గౌతమ్‌ (గోపీచంద్‌) అపర కుబేరుడు. అతనికి డబ్బు తప్ప ఏ ఎమోషన్స్‌ తెలీవు. అల్ట్రా మోడ్రన్‌ జీవితం. సుఖాల్లో మునిగి తేలుతుంటాడు. ఓ సంఘటన అతనిలో మార్పు తీసుకొస్తుంది. తానెవరో తెలుసుకోవాలన్న కోరిక పుట్టిస్తుంది. ఆస్తుల్ని.. సుఖాల్ని.. సంపదను వదిలేసి తన గురించి తాను తెలుసుకోవడానికి ఓ ప్రయాణం మొదలెడతాడు. ఆ సమయంలోనే తనలాంటి పోలికలున్న మరో వ్యక్తి కనిపిస్తాడు.
అతను పేదరికంలోంచి వచ్చినోడు. డబ్బుల్లేక ఆత్మహత్య చేసుకోవాలని చూస్తాడు. అతని స్థానంలో గౌతమ్‌ నంద ఓ బస్తీకి వెళ్తాడు. ఆ బస్తీలో సామాన్యమైన జీవితం గడపడం ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటి? అనేదే ‘గౌతమ్‌ నంద’ కథ.
ఎలా ఉందంటే..?: ఒకరి స్థానంలోకి మరొకరు వెళ్లడం అనేది పాత కాన్సెప్టే. అయితే దాని చుట్టూ దర్శకుడు అల్లుకొన్న సన్నివేశాలు.. ముడివేసుకొన్న భావోద్వేగాలు కొత్తగా ఉంటాయి. ఈ కథకు ప్రాణం అదే. ‘‘డబ్బు ముఖ్యమే కానీ అదొక్కటే ముఖ్యం కాదు.. దాని కంటే విలువైన వస్తువులు.. విషయాలు జీవితంలో చాలా ఉంటాయి. వాటికి గౌరవం ఇవ్వాలి. కుటుంబ బంధాలు.. బాంధవ్యాలు నిలబెట్టుకోవాలి’’ అనే విషయాన్ని స్పృశిస్తూ కమర్షియల్‌ కోటింగ్‌ ఇస్తూ సాగిన సినిమాగా చెప్పాలి.
దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ బాగుంది. దాన్ని తీర్చిదిద్దిన విధానమూ బాగుంది. కథానాయకుడ్ని పరిచయం చేసిన పద్ధతి చాలా లావీష్‌గా ఉంది. స్టైలీష్‌ మేకింగ్‌పై దృష్టి పెట్టాడు దర్శకుడు. దాంతో తెరపై ప్రతీ దృశ్యమూ కనుల పండుగలా కనిపిస్తుంది. తొలి భాగం ఎలాంటి ఒడుదుడుకులూ లేకుండా హాయిగా సాగిపోతుంది. పాటలు చిత్రీకరించిన విధానం బాగుంది. పోరాట ఘట్టాలూ మాస్‌కి నచ్చుతాయి. ద్వితీయార్థం కాస్త ఎమోషనల్‌గా నడిచింది.
సెంటిమెంట్‌ సీన్లపై ఆధారపడిన దర్శకుడికి.. అవి ఆశించినంతగా పండలేదు. చివర్లో వచ్చే ట్విస్ట్‌.. దాన్ని రివీల్‌ చేసిన తీరు నచ్చుతాయి. ఓ మంచి పాయింట్‌ని కమర్షియల్‌ అంశాలతో ఎలా నడిపించొచ్చో గౌతమ్‌ నంద చెబుతుంది. అయితే అక్కడక్కడ లాజిక్కులు మిస్‌ కావటం.. సినిమా కాస్త నిదానంగా సాగడం ఇబ్బందిగా అనిపించే వీలుంది.
ఎలా చేశారంటే..?: గోపీచంద్‌ నటన.. అతని స్టైలింగ్‌ ఆకట్టుకొంటాయి. ఇప్పటివరకూ వచ్చిన అతని ఏ సినిమాలోనూ కనిపించనంత అందంగా ఉన్నాడు గోపీచంద్‌. స్టైలీష్‌ లుక్‌లో మరింత నచ్చుతాడు. అతని బలం యాక్షన్‌ ఘట్టాలు. వాటిని తెరకెక్కించిన తీరు బాగుండడంతో గోపీచంద్‌కి ఫుల్‌గా మార్కులు పడిపోతాయి. కథానాయికల పాత్రలకు కాస్త ప్రాధాన్యం ఇస్తే బాగుండేది. వాన పాట మోతాదు మించినట్లుగా ఉంటుంది. బిత్తిరి సత్తి కొన్ని నవ్వుల్ని పంచాడు. భరణి.. చంద్ర మోహన్‌తో ఇలా అందరూ సీనియర్లే కావటంతో ఎవరి పాత్రకు వాళ్లు న్యాయం చేశారు.
నిర్మాతలు పెట్టిన ఖర్చు అడుగడుగునా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బ్యాంకాక్‌ ఎపిసోడ్లు ఆకట్టుకొంటాయి. సౌందర రాజన్‌ కెమెరా పనితీరు నచ్చుతుంది. సినిమాని బాగా లావీష్‌గా చూపించింది కెమెరా. తమన్‌ బాణీలు మాస్‌ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినవే. దర్శకుడు చెప్పదలచుకొన్న పాయింట్‌ బాగుంది. దీనికి మరికొంత వినోదం జోడించి.. కాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే ఇంకా బాగుండేది. మాస్‌కి నచ్చే అంశాలు ఉండడం ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్‌.
బలాలు 
గోపీచంద్‌ స్టైలీష్‌ లుక్‌ 
నేపథ్య సంగీతం 
నిర్మాణ విలువలు 
డైలాగులు
బలహీనతలు 
- లాజిక్కులు లేకపోవడం 
* చివరగా.. గోపీచంద్‌కు సరికొత్త ఇమేజ్‌ఇచ్చే.. ‘గౌతమ్‌ నంద’ 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com