అలరించి మెప్పించిన 'దర్శకుడు' ... రివ్యూ

- August 04, 2017 , by Maagulf
అలరించి మెప్పించిన 'దర్శకుడు' ... రివ్యూ

రివ్యూ    : దర్శకుడు
బ్యానర్: సుకుమా రైటింగ్స్ 
తారాగణం: అశోక్, ఈషా, నోయల్, పూజిత పొన్నాడ తదితరులు 
సంగీత దర్శకుడు: సాయి కార్తీక్ 
నిర్మాత: సుకుమార్, విజయ్ కుమార్, థామస్ రెడ్డి 
దర్శకుడు: హరిప్రసాద్ జక్కా 
రిలీజ్ డేట్    : 04.08.17

సుకుమార్ తెలివైన దర్శకుడు.. అందుకే నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అతను కొన్ని కథలకు అలవాటయ్యాడు. కొన్ని కథలు ఇష్టపడతాడు. కానీ ఇష్టపడే కథల్ని తను డైరెక్ట్ చేయలేడు. అందుకే ఇష్టాన్ని అభిరుచిగా మార్చుకుని ఆ చిత్రాలకు నిర్మాతగా మారుతున్నాడు. అలా తన అన్న కొడుకు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ.. ఇప్పుడు దర్శకుడు అనే సినిమా నిర్మించాడు. ఈషా హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి హరిప్రసాద్ జక్కా దర్శకుడు. ప్రోమోస్ తోనే అట్రాక్ట్ చేసిన దర్శకుడు ప్రమోషన్స్ తో ఇంట్రెస్ట్ పెంచాడు. మరి సుకుమార్ నమ్మకం నిజమైందా లేదా అనేది చూద్దాం.. 
కథ    : 
మహేష్(అశోక్)చిన్నప్పటి నుంచీ దర్శకుడు కావాలనేది కల. అందుకు తండ్రి ప్రోత్సాహం కూడా తోడు కావడంతో దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. అసిస్టెంట్ గా వర్క్ చేస్తూనే దర్శకత్వ ప్రయత్నాలు చేస్తుంటాడు.అయితే తన కథా వస్తువులన్నీ తన లైఫ్ నుంచే తీసుకుంటాడు. ఓ నిర్మాతను ఒప్పించి.. దర్శకత్వ చాన్స్ కొట్టేస్తాడు. కానీ కథలో లవ్ స్టోరీని ఇంకా బాగా డెవలప్ చేయమంటాడు నిర్మాత. ఆ ప్రయత్నంలోనే సొంత ఊరికి వెళతాడు. తిరుగు ప్రయాణంలో అతనికి ఫ్యాషన్ డిజైనర్ కావాలని ప్రయత్నిస్తోన్న నమ్రత(ఈషా)పరిచయం అవుతుంది. తను అనుకోకుండా ట్రైన్ నుంచి దిగి మళ్లీ అందుకోలేకపోతే తనే వెనక్కి వెళ్లి తనకు హెల్ప్ చేస్తాడు. కానీ ఏం చేసినా తన సినిమాకు కావాల్సిన సీన్స్ గానే చూస్తుంటాడు అశోక్. మొత్తంగా ఆప్రయాణంలో నమ్రత.. మహేష్ తో ప్రేమలో పడుతుంది. కానీ అతను మాత్రం ఆమె ఫీలింగ్స్ ను స్క్రీన్ ప్లేగా మలుస్తాడు. అది నచ్చని నమ్రత అతనితో బ్రేకప్ అవుతుంది. దాన్ని కూడా స్క్రీన్ ప్లేలో భాగంగా ఇంటర్వెల్ బ్యాంగ్ గా మలచుకున్న అశోక్ ఆ తర్వాత దర్శకడవుతాడు.. కానీ ప్రేమను కోల్పోతాడు. ఆ కోపం నుంచి దర్శకత్వానికీ గుడ్ బై చెబుతాడు. మరి దర్శకత్వం అంటే అంత ప్యాషన్ ఉన్న అతను అలా ఎందుకు మారాడు. నిర్మాత వల్ల అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనేది మిగతా కథ. 
విశ్లేషణ    : 
నిజానికి విశ్లేషించాల్సినంత గొప్ప మెటీరియలేం లేదీ సినిమాలో. కథలోచెప్పిన విషయాలే కాస్త వైడ్ యాంగిల్ లో చూసేస్తే సరిపోతుంది. అలాగని బోరింగ్ సబ్జెక్ట్ కాదు. కాన్ ఫ్లిక్ట్స్ ఏమీ లేకుండా సింపుల్ గా సాగిపోయే కథ. ట్విస్టులు, థ్రిల్స్, ఐటమ్స్ అంటూ రొటీన్ అంశాలకు భిన్నంగా ఓ సింపుల్ స్టోరీని ఓ కుర్రాడి యాంబిషన్ ను జోడించి చెప్పిన విధానం బావుంది. కాకపోతే సినిమా పరిశ్రమ నేపథ్యంలో సాగే కథ కాబట్టి కామన్ ఆడియన్ కు ఏ మేరకు రీచ్ అవుతుందనేది చూడాలి. సింపుల్ స్టోరీయే కానీ తరచి చూస్తే ఈ సినిమా పాయింట్ కట్టిపడేస్తుంది. ఏ విషయమ్మీదైనా ఇష్టం పెంచుకుంటే దాన్ని ప్యాషన్ గా మలచుకోవాలి.. ప్యాషన్ అంటే తపస్సు. కానీ దాని కోసం తపస్సులాగే శ్రమించాలి. మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ తపస్సు నుంచి డీవియేట్ కావొద్దు అంటూ ఓ బలమైన పాయింట్ ను చాలా సింపుల్ గా చెప్పాడీ దర్శకుడు. చిన్న ఊరు నుంచీ.. చిన్నప్పటి నుంచీ సినిమాపై ప్రేమ పెంచుకున్న కుర్రాడు.. ఆ కల కోసం తపిస్తూ.. ప్రయాణించిన విధానం బావుంది. మధ్యలో హీరోయిన్ ఇంటర్ డక్షన్ కూడా చాలా నేచురల్ గా.. వీరి పరిచయం, స్నేహం, ప్రేమ.. అన్నీ సహజంగా ఆకట్టుకుంటాయి. సంఘర్షణలు పెద్దగా లేని కథ కాబట్టి ప్రేక్షకుడికీ పెద్ద పరీక్షలేం ఉండవు. వీళ్లెలాగూ కలుసుకుంటారనేది తెలుసు కాబట్టి.. ఆ కలయిక వరకూ సాగే సన్నివేశాలన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్లడమే ప్రేక్షకుడి పని. కాకపోతే సెకండ్ హాఫ్ లో మరీ సాగదీసి కొంత బోర్ కొట్టించినా మళ్లీ సినిమాటిక్ క్లైమాక్స్ కాకుండా దర్శకుడి ఆలోచనకు తగ్గ క్లైమాక్స్ తో అలరిస్తాడు. 
ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ అన్నీ నవ్విస్తాయి. విలన్స్ తో ఫైట్ కూడా కొంత వరకూ నేచురల్ గానే వర్కవుట్ అయింది. ఓ అమ్మాయి ప్రేమలో పడటానికి హీరో వేసుకునే కాలిక్యులేషన్స్ కూడా అతనో సినిమా మనిషిగానే చూస్తాడు.. అవి కూడా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా రొమాంటిక్ గా సాగినా ఇంటర్వెల్ బ్యాంగ్ తో అది కాస్తా రసకందాయంలో పడుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ భలే ఉంది. ఈ సీన్ లో ఈషా పర్ఫార్మెన్స్ సూపర్. దాన్నే తన సినిమా ఇంటర్వెల్ సీన్ గా దర్శకుడు చెప్పే విధానం నవ్విస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో తనకూ నమ్రతకూ మధ్య జరిగిన సన్నివేశాల్నే రిపీట్ చేస్తూ సినిమాగా తీస్తుంటాడు మహేష్. తన సినిమాలో ఫ్యాషన్ డిజైనర్ గా నమ్రతను తీసుకోవడం కోసం ఆమె ఫ్రెండ్ ను హీరోయిన్ ను చేయడం కూడా కథానుగుణంగా అతికినట్టు సరిపోయింది. దర్శకుడు కావాలనే ప్యాషన్ తో ప్రేమనే త్యాగం చేసి.. ప్రేమ కోసం దర్శకత్వాన్నీ త్యాగం చేసిన ఓ సిన్సియర్ యంగ్ స్టర్ స్టోరీగా వచ్చిన దర్శకుడు మెప్పిస్తాడు. కాకపోతే కొన్ని సీన్స్ బాగా తేలిపోయాయి. సెకండ్ హాఫ్ మరీ లాగ్ గా ఉంది. ముఖ్యంగా ఈషా బర్త్ డే సీన్ భరించలేం. కానీ అదే టర్నింగ్ పాయింట్ కావడం విశేషం. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లో సాగే కథ కాబట్టి అక్కడ జరిగే కొన్ని ‘‘ఇంట్రెస్టింగ్’’ ఎలిమెంట్స్ చూపిస్తారనుకున్నవారిని డిజప్పాయింట్ చేశారు. ఇండస్ట్రీలో జరిగే ఎలాంటి పాలిటిక్స్ చూపించకపోవడం కూడా విశేషమే. ఇక  నటన పరంగా అశోక్ ఒక యాంగిల్ లో ఒకే. కానీ ఎమోషనల్ సీన్స్ లో పూర్తిగా తేలిపోయాడు. చూడ్డానికి బానే ఉన్నాడు. కానీ ఎమోషనల్ సీన్స్ లో డెడ్లీ ఎక్స్ ప్రెషన్స్ చూపించాడు. పూర్తిగా తేలిపోయాడు. ఈషా బాగా చేసింది. కార్ లో నీపై ప్రేమలేదు అని చెప్పే సీన్ లో తన నటన చాలా బావుంది. మిగతా పాత్రల్లో అశోక్ అసిస్టెంట్ గా చేసినతను బానే చేశాడు. జెమినీ సురేష్ కిది రొటీన్ క్యారెక్టర్. ఈషా ఫాదర్ గా టివి ఆర్టిస్ట్ ప్రదీప్ ఓకే. ఓవరాల్ గా ఇది గొప్ప కథ కాదు.. గొప్ప కథనమూ లేదు.. అయినా ఆకట్టుకుంటుంది.. సింపుల్ మూవీ కానీ బెస్ట్ కాదు. ఓసారి హ్యాపీగా చూసేయొచ్చు. 
చివరిగా :  
సాంకేతికంగానూ మెప్పిస్తాడీ దర్శకుడు. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సింపుల్ గా బావుంది. సెకండ్ హాఫ్ లో ఎడిటర్ కు ఇంకా పని ఉందనిపిస్తుంది. మాటలు మెప్పిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.. ఇక దర్వకుడికి ఇది ఫస్ట్ మూవీ అయినా ఎక్కడా తడబడకుండా తను రాసుకున్న ప్రతి పాయింట్ నూ తీసి తీరాల్సిందే అన్నట్టుగా తీశాడు. నెరేషన్ స్లోగా ఉన్నా.. ఫస్ట్ మూవీ కాబట్టి పాస్ మార్కులేయొచ్చు. టైటిల్స్ లో సుకుమార్ మార్క్ కనిపిస్తుంది. సినిమాలో మాత్రం అది లేదు. అంటే దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడనుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com