రివ్యూ: ఆనందాన్ని పంచే 'ఆనందో బ్రహ్మ'

- August 18, 2017 , by Maagulf
రివ్యూ: ఆనందాన్ని పంచే 'ఆనందో బ్రహ్మ'

చిత్రం: ఆనందో బ్రహ్మ
తారాగణం: తాప్సీ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, శకలక శంకర్, తాగుబోతు రమేశ్, రాజీవ్ కనకాల, శశాంక్, విజయ్ చందర్, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర, టార్జన్, తనికెళ్ల భరణి, రఘు కారుమంచి తదితరులు
ఎడిటర్: శ్రావణ్
సినిమాటోగ్రఫీ: అనిశ్ తరుణ్ కుమార్
మ్యూజిక్: కె.క్రిష్ కుమార్ 
ప్రొడ్యూసర్స్: విజయ్ చిల్ల, శషి దేవిరెడ్డి
డైరెక్టర్: మహి.వి.రాఘవ్
రిలీజ్ డేట్ : 2017 ఆగస్టు 18

ఆనందో బ్రహ్మ టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచాయి. మనుషులను చూసి దెయ్యాలు భయపడ్డం అనే పాయింట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. తాప్సీ ఫస్ట్ టైం హర్రర్ కామెడీ జానర్ లో చేసిన సినిమా ఆనందో బ్రహ్మ. ఇక హర్రర్ కామెడీస్ ఎప్పుడూ సేలబుల్ సబ్జెక్టే. దీంతో ఆనందో బ్రహ్మ ఆడియన్స్ ను బాగానే ఎంటర్టైన్ చేస్తుందనే హైప్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ అంచనాలతోనే బరిలో దిగిన ఆనందోబ్రహ్మ, ప్రేక్షకులను ఆనందింపజేసిందా? బాక్సాఫీస్ ఇంప్రెస్ అయ్యిందా? చూద్దాం

కథ:
రాము(రాజీవ్ కనకాల) మలేషియాలో బిజినెస్ బిజినెస్ మేన్. హైదరాబాద్ లో ఉండే అతని తల్లిదండ్రులు చార్ ధామ్ యాత్రకు వెళ్లి, వరదల్లో గల్లంతవుతారు. దీంతో వాళ్లు ఉంటున్న ఇంటిని అమ్మేసి మలేషియా వెళ్లిపోవాలనుకుంటాడు రాము. కానీ ఆ ఇంటిలో దెయ్యాలున్నాయని కొనడానికి ఎవరూ ముందుకురారు. వచ్చిన వాళ్లు చాలా తక్కువ రేట్ కు అడుగుతారు. ఆ టైంలో సిద్ధు(శ్రీనివాస్ రెడ్డి) వచ్చి ఓ నలుగురిని ఆ ఇంట్లో కొన్నిరోజులు ఉంచితే దెయ్యం ఉందన్న ప్రచారం ఆగిపోతుంది. మంచి రేటుకు ఇంటిని అమ్ముకోవచ్చని సలహా ఇస్తాడు. దీంతో బాబు(శకలక శంకర్), రాజా(వెన్నెల కిశోర్), తులసి(తాగుబోతు రమేశ్)లను తీసుకుని దెయ్యాలు కాపురం ఉంటోన్న ఇంట్లోకి వెళ్తాడు సిద్ధు. కానీ అక్కడి దెయ్యాలు ఈ నలుగురిని భయపెట్టి ఇంట్లోంచి వెళ్లగొట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తుంటాయి. ఆ ప్రయత్నంలో ఎవరు గెలిచారు. అసలు దెయ్యాలు ఆ ఇంటిపై మమకారం ఎందుకు పెంచకున్నాయి అనేది మిగిలిన కథ

విశ్లేషణ:
డైరెక్టర్ మహి, ఆనందో బ్రహ్మ టైటిల్ కు తగ్గట్లుగానే సినిమాను కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. కామన్ గా దెయ్యాలకు మనుషులు భయపడుతుంటారు. కానీ దెయ్యాలే మనుషులను చూసి భయపడే పరిస్థితులు ఉంటే ఎలా ఉంటుందనే పాయింట్ ను చాలా హిలేరియస్ గా తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్టాఫ్ మొత్తం క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చెయ్యడానికి, వారి ఫ్లాష్ బ్యాక్ లు చెప్పడానికే తీసుకున్నాడు. దీంతో ఫస్టాఫ్ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. చాలా ప్లాట్ గా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ ఫస్టాఫ్ లోనూ తాప్సీ అండ్ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేసే సీన్ సూపర్బ్ అనిపిస్తుంది. దెయ్యాలు మనుషులను చూసి దెయ్యాలనుకుని భయపడే సీన్ చాలా హిలేరియస్ గా ఉంటుంది. కానీ ఆమేజిక్ అలాగే కంటిన్యూ చెయ్యడంలో దర్శకుడు కొంచెం తడబడ్డాడు. పైగా నలుగురు కమెడియన్స్ ను వాళ్ల ఫ్లాష్ బ్యాక్ ను చెప్పడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు. అయితే ఫస్టాఫ్ ను డీల్ చెయ్యడంలో డైరెక్టర్ కొంచెం వెనకబడ్డా, సెకండాఫ్ ను కామెడీతో నింపేశాడు. శ్రీనివాస రెడ్డికి గుండెకు రంద్రం ఉన్న పేషెంట్ గా మార్చి దానికి రివర్స్ ఇమర్షన్ అనే ట్రీట్మెంట్ ను పెట్టాడు. భయం,దు:ఖం వచ్చినప్పుడు నవ్వడం, నవ్వు వస్తే ఏడవడం ఆ వైద్యం. ఇక వెన్నెల కిశోర్ కు రేచీకటి, చెవుడు పెట్టి ఆడియో,వీడియో కట్ చేశాడు. శకలక శంకర్ ను సినిమాపిచ్చోడిగా, తాగుబోతు రమేశ్ ను రాత్రి 9గంటలకు మందు కొట్టే క్యారెక్టర్ లో చూపించి కామెడీ చేయించాడు. శ్రీనివాస రెడ్డి దెయ్యాలను చూసి నవ్వడం అవి దడుచుకుని పారిపోవడం హిలేరియస్ గా అనిపిస్తుంది. ఇక కిశోర్ కు 6దాటితే కనబడదు, మెషిన్ తీస్తే వినబడదు పైగా భయం అనిపిస్తే ఫ్లూట్ వాయిస్తాడు. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తిని భయపెట్టాలంటే దెయ్యాలు కూడా కష్టపడాల్సిందే. ఆ కష్టమే ఆడియన్స్ ను ఫుల్లుగా నవ్విస్తుంది. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ సినిమా చూస్తే ఆ హీరోలాగా మారిపోయే శకలక శంకర్ క్యారెక్టరే సినిమాకు మెయిన్ హైలెట్. దెయ్యాలు భయపెట్టడానికి వస్తే, తన సినిమా పిచ్చితో ఆ క్యారెక్టర్ ను ప్రజెంట్ చేస్తూ దెయ్యాలను దడిపిస్తాడు. బాబా రామ్ దేవ్, కెఎ పాల్ ఇలా ఏ వీడియో చూస్తే ఆ క్యారెక్టర్ ను దింపేస్తూ దెయ్యాలను ఏడిపిస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. అందుకే ఆనందో బ్రహ్మకు శకలక శంకర్ మెయిన్ అస్పెట్ గా, సినిమాకు హీరోగా నిలిచాడు. ఇక 9గంటలకు మందుకొడితే దెయ్యాలను కూడా చెవి మెలేసే పాత్రలో తాగుబోతు రమేశ్ కామెడీ పకపకలు పుట్టిస్తుంది. ముఖ్యంగా పిల్లదెయ్యాన్ని చెవి పట్టి చదువుకో పో అని గదమాయించే సీన్ ఫుల్లుగా నవ్విస్తుంది. వీళ్ల నలుగురి ఎపిసోడ్ తో సినిమా ఎంటైర్టైనింగ్ గా అనిపిస్తుంది. అయితే ఫస్ట్ టైం దెయ్యం సినిమా చేసిన తాప్సీ తన లీలా క్యారెక్టర్ పరిధి మేరకు నటించింది. కానీ ఆ పాత్రకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తాప్సీ పాత్ర ఓకే అనిపిస్తుంది. తాప్సీ ఆ పాత్ర చెయ్యకపోయినా పెద్దగా పోయేదేం లేదనిపిస్తుంది. సో ఆమె కెరీర్ లో ఈసినిమాకు, పాత్రకు పెద్దగా ప్రాధాన్యత అంటూ ఏం కనిపించదు. ఇక రాజా రవీంద్ర, టార్జన్, విజయ్ చందర్, రఘు కారుమంచి, పోసాని కృష్ణమురళి, పాత్రల పరిధి మేరకు నటించారు. రాజీవ్ కనకాల మాత్రం ఆస్తి కోసం తల్లిదండ్రులను కూడా చంపేసే క్రూయల్ క్యారెక్టర్ తో సైలెంట్ విలనిజాన్ని తన స్టైల్లో ప్రజెంట్ చేశాడు. అయితే ఆనందో బ్రహ్మ హర్రర్ కామెడీగా వచ్చినా, దీనిలో ఓ క్రైం ఎలిమెంట్ ను, సెంటిమెంట్ ను జోడించాడు దర్శకుడు. ఆస్తి కోసం తల్లిదండ్రులను కూడా కడతేరుస్తోన్న కలికాలపు కొడుకులను ఈ కథలో డిస్కస్ చేశాడు. ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే పాటల్లేని ఈసినిమాకు ‘కె’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చారు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాల మూడ్ ను ఎలివేట్ అయ్యేలా చేశాడు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సినిమా మొత్తం ఒక ఇంట్లోనే నడిచినా, ఆ ఫీలింగ్ క్రియేట్ కాకుండా దర్శకుడు బాగానే జాగ్రత్త పడ్డాడు. మొత్తంగా  ఆనందో బ్రహ్మ కొన్ని సార్లు నవ్విస్తే, కొన్ని సార్లు ట్రాక్ తప్పినట్లుగా కనిపిస్తుంది. అయితే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా శకలక శంకర్ కామెడీ వాటన్నింటిని ఓవర్ కమ్ చేస్తుంది. దీంతో ఆనందో బ్రహ్మను ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. 

చివరిగా: ఆనందాన్ని పంచే ఆనందో బ్రహ్మ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com