రాజీనామాకు సిద్ధపడ్డ రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు

- August 23, 2017 , by Maagulf
రాజీనామాకు సిద్ధపడ్డ రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు

- ‘ఉత్కళ్‌’ ప్రమాద ఘటనకు నైతిక బాధ్యతగా నిర్ణయం
- తొందరపడొద్దన్న ప్రధాని మోదీ.. వేచిచూడాలని ఆదేశం
రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ రైల్వేలో ఇటీవల భారీ ప్రమాదాలు చోటుచేసుకోవడం, పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు నైతిక బాధ్యతగా ఆయన తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని సురేశ్‌ ప్రభునే స్వయంగా తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా బుధవారం తెలిపారు.
‘ఇటీవల చోటుచేసుకున్న  రెండు రైలు ప్రమాదాలు నన్ను తీవ్రంగా బాధించాయి. దీనికి నైతిక బాధ్యత వహించాలనుకున్నాను. కొద్ది సేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి నా నిర్ణయాన్ని చెప్పాను’ అని సురేశ్‌ ప్రభు తెలిపారు.
తొందరపడొద్దన్న మోదీ: కాగా, రాజీనామా విషయంలో తొందరపాటు వద్దని సురేశ్‌ ప్రభుకు ప్రధాని మోదీ సూచించారు. ‘వేచిచూడండి..’ అని ప్రధాని తనతో అన్నట్లు రైల్వే మంత్రి చెప్పారు.
గత శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి వద్ద పూరీ–హరిద్వార్‌ ఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో 23 మంది మృతిచెందగా.. 60 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. దీనికి నైతిక బాధ్యతగా సురేశ్‌ ప్రభు రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com