ఉంగరాల రాంబాబు రివ్యూ

- September 15, 2017 , by Maagulf
ఉంగరాల రాంబాబు రివ్యూ

చిత్రం: ఉంగరాల రాంబాబు 
నటీనటులు: సునీల్.. మియా జార్జ్.. ప్రకాష్ రాజ్.. పోసాని కృష్ణమురళి.. ఆశిష్ విద్యార్థి.. అలీ.. వెన్నెల కిషోర్.. రాజీవ్ కనకాల.. రాజా రవీంద్ర.. మధు నందన్.. ప్రభాస్ శ్రీను.. తాగుబోతు రమేష్.. దువ్వాసి మోహన్ తదితరులు. 
సంగీతం: జిబ్రాన్. 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, రెహమాన్. 
ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి. 
కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు. 
మాటలు: చంద్ర మోహన్ చింతాడ. 
కళ: ఎ.ఎస్.ప్రకాష్. 
నిర్మాత: పరుచూరి కిరీటి. 
దర్శకుడు: కె.క్రాంతి మాధవ్. 
బ్యానర్‌: యునైటెడ్ మూవీస్ లిమిటెడ్‌. 
విడుదల తేదీ: 15-09-2017 
సునీల్ సినిమా అనగానే ప్రేక్షకులు కడుపుబ్బా కితకితలే ఊహిస్తారు. సునీల్ కూడా ఆ విషయానికే మొదటి ప్రాధాన్యమిస్తూ కథల్ని ఎంచుకొంటుంటారు. తెరపై ఎన్ని చేసినా, కామెడీని పంచడం మాత్రం మరిచిపోరు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన విజయం దక్కలేదు. ఆయన ఎంచుకొంటున్న కథలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని నవ్వించడం లేదు. ఈ దశలోనే `ఉంగరాల రాంబాబు` కోసం సునీల్ - క్రాంతిమాధవ్ జట్టుకట్టారు. ఒక విభిన్నమైన కలయికగా అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిందీ సినిమా. `ఓనమాలు`, `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` వంటి చిత్రాలతో మంచి అనుభూతిని పంచిన క్రాంతిమాధవ్ `ఉంగరాల రాంబాబు`ని ఎలా ముస్తాబు చేశారు? సునీల్ ఆ పాత్రలో ఎలా ఒదిగిపోయారు? ఈ చిత్రంతో సునీల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారా?
 
కథేంటంటే: కష్టం తెలియకుండా పెరిగిన కుర్రాడు రాంబాబు (సునీల్‌). 200 కోట్ల ఆస్తికి వారసుడు. తన తాత చనిపోయాక ఆ ఆస్తులన్నీ దూరమవుతాయి. వట్టి చేతుల్తో రోడ్డుపైకి వచ్చాక రాంబాబుకి బాదం బాబా (పోసాని కృష్ణమురళి) ఆశ్రమం కనిపిస్తుంది. జనాల్ని బురిడీ కొట్టించడమే పనిగా పెట్టుకొన్న బాదం బాబా.. రాంబాబు వేసుకొన్న సూటూ బూటూ చూసి నువ్వు మహర్జాతకుడువి అని చెబుతాడు. 'నేను చెప్పిన చోట బాదం చెట్టు నాటితే నీ ఆస్తి నీకు తిరిగొస్తుందం'టాడు. బాదం బాబా చెప్పినట్టుగానే చెట్టు నాటడానికి వెళితే అక్కడ 200 కోట్ల బంగారం దొరుకుతుంది. అప్పట్నుంచి జాతకాలపై మరింత నమ్మకం పెంచుకొంటాడు రాంబాబు. అప్పటిదాకా మామూలు రాంబాబు కాస్తా బాదం బాబాను కలిశాక ఉంగరాల రాంబాబు అయిపోతాడు. ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ పెట్టి వంద వోల్వో బస్సులు తిప్పుతుంటాడు. వ్యాపారంలో రోజూ ఏదో ఒక చికాకు వస్తుండటంతో ఫలానా జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని బాదం బాబా సలహా ఇస్తాడు. ఆ జాతకం ఉన్న అమ్మాయి తన ఆఫీసులోనే ఉన్న తన మేనేజర్ సావిత్రి (మియా జార్జ్‌) అని తెలిశాక ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. మరి నిజంగా సావిత్రిది బాబా చెప్పిన జాతకమేనా? వాళ్లిద్దరి ప్రేమకథ సఫలమైందా? అసలు రాంబాబుకి దొరికిన 200 కోట్ల బంగారం ఎవరిది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: సునీల్ ఎప్పట్లాగే తనకి తెలిసిన అన్ని విద్యలూ ప్రదర్శించారు. కానీ, కామెడీ సన్నివేశాలకు ఇంకాస్త ప్రాధాన్యం ఇస్తే బాగుండేది. దర్శకుడు తీర్చిదిద్దిన కథ కారణంగా ఆయా సన్నివేశాలకు స్కోప్‌లేకుండా పోయింది. జాతకాలపై పిచ్చి ఉన్న కథానాయకుడి పాత్రంటే హాస్యం పండించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సన్నివేశాలు ఆ దిశగానే వెళుతున్నాయనిపించేలోపే దర్శకుడు కథని విమానంలోకి ఎక్కించి దుబాయ్‌కి తీసుకెళ్లాడు. అక్కడే సినిమా కాస్త గాడి తప్పినట్లైంది. జాతకాలపై పిచ్చి ఉన్న కథానాయకుడి పాత్ర, కమ్యూనిస్టు నాయకుడైన రంగనాయర్‌గా ప్రకాష్‌రాజ్, పోసాని చేసిన బాదం బాబా పాత్రలు బాగానే ఉంటాయి. కానీ వాటిని సరిగ్గా నడిపించడంలోనూ, వాటి చుట్టూ సన్నివేశాలను అల్లుకోవడంలోనూ దర్శకుడు తడబడ్డాడు. ద్వితీయార్ధంలోనైనా కథ గాడిన పడుతుందనుకొంటే ఈసారి కేరళకి వెళ్లిపోతుంది కథ. అక్కడ కమ్యూనిస్టు నాయకుడిగా ప్రకాష్‌రాజ్ ఆయన గెటప్‌, ఎర్రపూల వనం అనే పేరుతో ఉన్న ఊరి సెటప్ అంతా కొత్తగానే అనిపిస్తాయి కానీ... అక్కడ సన్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకోలేకపోయింది. మందారం మందారం అంటూ కుక్క కోసం వెదికే సన్నివేశాలు, సైకిల్ పందేలు ఇవన్నీ కూడా ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెట్టేవే. కట్ చేస్తే వచ్చి పడిపోయే పాటలు మరోపక్క పంటికింద రాయిలా తగులుతుంటాయి. మంచి సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ ఈసారి చెప్పాలనుకొన్న కథని చెప్పడంలో తడబడ్డాడు. పలు సినిమాల ప్రభావం ఉంగరాల రాంబాబులో స్పష్టంగా కనిపిస్తుంది.
 
ఎవరెలా చేశారంటే?: సునీల్ ప్రతి సినిమాలోలాగే ఇందులోనూ నటించాడు. ఆయన నటనలో కానీ, బాడీ లాంగ్వేజ్‌లో కానీ కొత్తదనమేమీ లేదు. డ్యాన్సుల పరంగా మాత్రం ఆకట్టుకొన్నారు. మియా జార్జ్ పాటలకి, కొన్ని డైలాగులకి పరిమితమైంది తప్ప, ఆమె పాత్రకి పెద్ద ప్రాధాన్యం లేదు. పాత్రలో బలం లేకపోవడంతో ప్రకాష్‌రాజ్ పాత్ర కూడా నీరుగారిపోయింది. బాదం బాబాగా పోసాని, ఆయన శిష్యుడిగా వేణు, ఆశిష్ విద్యార్థి, వెన్నెలకిషోర్ లు అక్కడక్కడ నవ్వించారంతే. ఇక మిగిలిన పాత్రలు వారి పరిధిమేరకు ఒకే అనిపించారు. దర్శకుడు కథ, కథనాలపై మరిన్ని కసరత్తులు చేయాల్సింది. ఛాయాగ్రహణం పర్వాలేదు. సంగీతం పాటల వరకు బాగుందంతే. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
బలాలు 
+ సునీల్ డ్యాన్సులు 
+ పోసాని ఆయన శిష్య బృందం కామెడీ
బలహీనతలు 
- కథ, కథనం 
- వినోదం పాళ్లు తగ్గడం 
- సాగదీతగా సన్నివేశాలు 
చివరిగా: గింగిరాలు తిప్పించే ఉంగరాల రాంబాబు 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com