జై లవకుశ రివ్యూ

- September 20, 2017 , by Maagulf
జై లవకుశ రివ్యూ

చిత్రం: జై లవకుశ 
నటీనటులు: ఎన్టీఆర్‌.. రాశీఖన్నా.. నివేదా థామస్‌.. పోసాని కృష్ణమురళీ.. బ్రహ్మాజీ.. సాయికుమార్‌.. ప్రదీప్ రావత్‌.. జయప్రకాష్ రెడ్డి తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు 
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు 
నిర్మాత: కల్యాణ్‌రామ్‌, హరికృష్ణ 
దర్శకత్వం: కె.ఎస్‌. రవీంద్ర(బాబి) 
బ్యానర్‌: ఎన్టీఆర్ ఆర్ట్స్‌ 
విడుదల తేదీ: 21-09-2017 
ఎన్టీఆర్‌ సినిమా అంటేనే అభిమానులకు పండగ. తన డాన్సులు, నటన, డైలాగులతో విందు భోజనం వడ్డిస్తాడు. ఒక్క ఎన్టీఆరే ఇన్ని చేస్తుంటే.. ముగ్గురు ఎన్టీర్లను చూపిస్తే ఇంకెన్ని చేయొచ్చు..?? ఈ ఆలోచన నుంచి పుట్టిందే 'జై లవకుశ'. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి చాలా కారణాలున్నాయి. ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కనిపించడం ఒక ఎత్తైతే.. అందులో ఒకటి ప్రతినాయకుడి పాత్ర కావడం విశేషం. అందుకే ఈ 'లవకుశ' విడుదలకు ముందే అందరినీ ఆకట్టుకొంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?? అభిమానుల్ని ఏ మేరకు మెప్పించింది?
కథేంటంటే..: జై, లవ, కుశ (ముగ్గురు ఎన్టీఆర్‌లు) కవల సోదరులు. జైకి నత్తి. సరిగా మాట్లాడలేడు. అందుకే మిగిలిన ఇద్దరు సోదరులతో కలవలేడు. లవ, కుశ కూడా జైని చిన్న చూపు చూస్తారు. ఈ కారణంగా చిన్నప్పుడే తన సోదరులపై కోపం పెంచుకొంటాడు జై. ప్రమాదవశాత్తూ అన్నదమ్ములు ముగ్గురూ... చిన్నప్పుడే తప్పిపోతారు. లవ కుమార్‌ పెరిగి పెద్దవాడై బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడతాడు. కుశ ఏదోలా మాయ చేసి, అమెరికా వెళ్లి, గ్రీన్‌ కార్డ్‌ సంపాదించి అక్కడే సెటిలవ్వాలని కలగంటాడు. వీరిద్దరి జీవితాల్లోకి 'జై' ప్రవేశిస్తాడు.చిన్నప్పటి పగనీ, ప్రతీకారాన్నీ ఎలా తీర్చుకొన్నాడు? తన ఎదుగుదలకు వీళ్లని ఎలా వాడుకొన్నాడు? ఈ ముగ్గురూ కలిశారా? కలిసుంటూనే ఒకరిపై మరొకరు పోరాటం చేశారా? చివరికు ఏం జరిగిందన్నదే మిగిలిన కథ.
ఎలా ఉందంటే..: ఎన్టీఆర్‌ బలాలపై బేస్‌ అయిన సినిమా ఇది. అక్షరాలా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం తీశారనడంలోనూ ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌ ఒక్కడే ఈ సినిమాని ముందుండి నడిపిస్తాడు. తన నటన, డైలాగులు, వినోదం, డాన్సులతో అడుగడుగునా రక్తికట్టిస్తాడు. ఎన్టీఆర్‌కాకుండా జై లవకుశని మరో కథానాయకుడితో వూహించలేం అన్నంతగా ఈ మూడు పాత్రల్లో ఇమిడిపోయాడు. తొలి పదిహేను నిమిషాలూ.. తెరపై కేవలం కథే కనిపిస్తుంది. కవల సోదరుల బాల్యం, విడిపోవడం, పెరిగి పెద్దవారవడం... ఈ సన్నిశాలతో నడిపించాడు. ఆ తరవాతఒక్కో పాత్రనీ పరిచయం చేశాడు. ఈ కథలో జై పాత్ర కీలకం. కానీ ఆ పాత్ర కనిపించేవరకు కుశ బాగా ఎంటర్‌టైన్‌ చేస్తాడు. విశ్రాంతి ఘట్టం నుంచి 'జై' విశ్వరూపం మొదలవుతుంది. 'జై' పరిచయం అభిమానుల్ని ఆకట్టుకొనేలా ఉంది. విశ్రాంతి ఘట్టం కూడా.. బాగా తెరకెక్కించారు. ద్వితీయార్ధంలో కథ, కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. అయితే.. అక్కడక్కడ కుశ వినోదం పంచుతూ వెళ్తాడు. పాటలను సందర్భానికి తగ్గట్టు వాడుకొన్నారు. అందులో ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులు ఉత్సాహపరుస్తాయి. పతాక సన్నివేశాల్లో సెంటిమెంట్‌ బాగా 
దట్టించారు. అక్కడ కూడా జై విశ్వరూపం ప్రదర్శించాడు. కుటుంబ ప్రేక్షకులకు, ఎన్టీఆర్‌ అభిమానులకు నచ్చేలా డిజైన్‌ చేసినట్టు అనిపిస్తుంది.
 
ఎవరెలా చేశారంటే..?: 'టెంపర్‌', 'నాన్నకు ప్రేమతో'లా.. ఈ సినిమా కూడా ఎన్టీఆర్‌ వన్‌ మేన్‌ షో అనుకోవాలి. ఎన్టీఆర్‌ తప్ప మరో పాత్ర తెరపై కనిపించదు. 'జై'గా ఎంత భయపెట్టాడో, కుశగా అంతగా నవ్వించాడు. మూడు పాత్రల్లో వైవిధ్యం బాగా చూపించగలిగాడు ఎన్టీఆర్‌. డాన్సులో యథావిధిగా రెచ్చిపోయాడు. రాశీఖన్నా గ్లామరెస్‌గా కనిపించింది. నివేదా పాత్ర కూడా కీలకమే. కానీ ఇద్దరి స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా తక్కువ. తమన్నా ఓ పాటలో మెరిసింది. అయితే అక్కడా ఎన్టీఆర్‌ డామినేషనే కనిపించింది. కావాలని కామెడీ ట్రాకులు జోడించకపోవడం ఈసినిమాకు కలిసొచ్చింది. లవ, కుశ పాత్రల్లోనే వినోదాన్ని పండించాడు.
దేవిశ్రీ సంగీతం ఆకట్టుకొంది. పాటల్లో కంటే, నేపథ్య సంగీతం విషయంలో చాలా శ్రద్ధ తీసుకొన్నాడు. 'జై' పాత్రని ఎలివేట్‌ చేసేలా రూపొందించిన 'రావణా..' పాట ఆకట్టుకొంటుంది. బాబి ఎంచుకొన్న కథలో వైవిధ్యం లేకపోయినా, ట్రీట్‌మెంట్‌ పరంగా ఆకట్టుకొంటుంది. ఛోటా కె.నాయుడు కెమెరా పనితనం చిత్రానికి అదనపు బలం. కోన మాటలు మెరిశాయి. 
బలాలు 
+ ఎన్టీఆర్‌ నటన, డాన్సులు 
+ విశ్రాంతి ఘట్టం 
+ కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దిన పతాక సన్నివేశాలు
 
బలహీనతలు 
- తెలిసిన కథే 
- కాస్త నెమ్మదించిన ద్వితీయార్ధం
చివరిగా: 'జై లవకుశ'... జై ఎన్టీఆర్‌!! 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com