మహేష్ 'స్పైడర్' రివ్యూ

- September 27, 2017 , by Maagulf
మహేష్ 'స్పైడర్' రివ్యూ

రివ్యూ    : స్పైడర్
తారాగణం    : మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె. సూర్య, జయప్రకాష్, ప్రియదర్శి, భరత్ 
కథ            : ఏఆర్ మురుగదాస్
ఎడిటింగ్    : శ్రీకర ప్రసాద్ 
సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్
సంగీతం    : హారీస్ జయరాజ్
నిర్మాతలు    : ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు
దర్శకత్వం    : ఏఆర్ మురుగదాస్ 
రిలీజ్ డేట్    : 27.09.17
మురుగదాస్ ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఖచ్చితంగా అందులో ఏదో సామాజిక సందేశమో లేదంటే.. సామాజిక స్పృహ ఉన్న పాయింటో ఉంటుంది. అలాంటి కథల్ని కమర్షియల్ గా చెప్పడంలో అతను ‘కత్తి’. ఏ కథలోనైనా ఇమిడిపోయే హీరో మహేష్ బాబు. అలాంటి హీరోను తన కథలో తీసుకున్నాడనగానే చాలామంది ఫిక్స్ అయిపోయారు. అప్పుడెప్పుడో తెలుగులో స్టాలిన్ చేసిన మురుగదాస్ మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ బాబుతో మూవీ చేస్తున్నాడంటే సహజంగానే అందరిలోనూ ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. పైగా ఈ మూవీతో మహేష్ తమిళ్ డెబ్యూట్ ఇస్తున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన స్పైడర్ .. ఎలా ఉన్నాడో ఇప్పుడు చూద్దాం.. 
కథ  : 
శివ(మహేష్ బాబు) ఓ ఇంటిలిజెంట్ ఆఫీస్ లో పనిచేస్తుంటాడు. ప్రజలు వాడే ఫోన్స్ కు సంబంధించి ఇంపార్టెంట్ అనుకునే కాల్స్ ను రికార్డ్ చేయడం అతని పని. కానీ శివ సొంతంగా రెండు సాఫ్ట్ వేర్ లు తయారుచేసుకుని.. అధికారుల ఆదేశాలకు భిన్నంగా అన్ని కాల్స్ ను రికార్డ్ చేస్తుంటాడు. అలా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెళ్లి కాపడే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఓ టీనేజ్ అమ్మాయి చేసిన కాల్ అతని జీవితాన్ని మార్చేస్తుంది. తను కాపాడే ప్రయత్నం చేసినా ఆ అమ్మాయితో పాటు తనని కాపాడ్డానికి వెళ్లిన ఓ లేడీ కానిస్టేబుల్ ను ఎవరో హత్య చే్స్తారు. ఆ హత్య చేసినవాడిని కనిపెట్టే ప్రయత్నంలో శివకు ఒళ్లు గగుర్పొడిచే నిజాలు తెలుస్తాయి. ఆ ఇద్దరితో పాటు వేలమందిని చంపింది భైరవుడు అనే నరరూప రాక్షసుడు అని తెలుసుకుని అతన్ని అంతమొందించే ప్రయత్నం చేస్తాడు. మరి ఈ ప్రయత్నంలో అతను సక్సెస్ అయ్యాడా..? అసలీ భైరవుడు ఎవరు..? మధ్యలో హౌస్ సర్జన్ గా పరిచయమైన చార్లీ ఎవరు..?హత్యలు చేస్తోన్న భైరవుడి నేపథ్యం ఏంటీ అనేది మిగతా కథ..
విశ్లేషణ    :
టీజర్, ట్రైలర్ ను బట్టి స్పైడర్ ను ఓ స్పై థ్రిల్లర్ గానే అనుకుంటారు. అందుకు అనుగుణంగానే ఉన్నా.. మరీ ఊహించినంత గొప్పగా అయితే లేదు. కారణం.. స్పై థ్రిల్లర్ అనగానే మనం జేమ్స్ రేంజ్ లో ఊహించుకుంటాం. కానీ అలా ఉండదు. బట్ ఇదో కొత్త కథ. కథనం కూడా ఆకట్టుకుంటుంది. నిత్యజీవితంలో ప్రతి మనిషీ వాడే సెల్ ఫోన్ అనేది ఎవరికి వారికి పర్సనల్ అస్సలే కాదనే నిజం ఆశ్చర్యపరుస్తుంది. ప్రజలు వాడే ఫోన్ ప్రభుత్వ మానిటరింగ్ లో ఉంటుందనే విషయాలు సర్ ప్రైజ్ చేస్తాయి. అందరి ఫోన్లూ ట్యాప్ చేస్తూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ వెళ్లే హీరోకు ఓ బిగ్గెస్ట్ చాలెంజ్ ఎదురు కావడం.. ఆ ఛాలెంజ్ ను ఫేస్ చేస్తున్నప్పుడు ఎన్నో అనూహ్య సంఘటనలు జరగడం అన్నిటినీ తనదైన శైలిలో టెక్నాలజీ సాయంతో సాల్వ్ చేసుకుంటూ వెళ్లడం.. అన్నీ కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా మానవ జీవితంలో టెక్నాలజీ ఎంత పెరిగింది, దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనే విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకూ టెక్నాలజీని మిస్ యూజ్ చేయడం వల్ల ఏర్పడే అనర్థాలు గురించిన సినిమాలే ఎక్కువ. కానీ ఫస్ట్ టైమ్ పూర్తిగా టెక్నాలజీ సాయంతోనే నడిచే కథ ఇది. ఆ టెక్నాలజీ ఎక్స్ పర్ట్ గా మహేష్ బాబు అదరగొట్టాడు. ఇక మెయిన్ విలన్ ఎంటర్ అయ్యాక కథనం స్పీడందుకుంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్బ్. అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే రోలర్ కాస్టర్ ఫైట్ వండర్ ఫుల్. ఇక మెయిన్ విలన్ గా సూర్య పాత్ర ఎంటర్ కావడానికి ముందే వచ్చే అతని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఒళ్లు గగుర్పొడుస్తుంది. నరరూప రాక్షసుడు అనే మాట కూడా తక్కువే అనిపించే ఓ బ్రూటల్ క్రిమినల్ ను పట్టుకునేందుకు పోలీస్ ల సాయం లేకుండానే ప్రయత్నిస్తోన్న శివ కు అతను అడుగడుగునా చాలెంజ్ విసురుతుంటాడు. అన్నీ దాటుకుని అతన్ని అంతమొందించడం కామన్ పాయింటే అయినా.. కథనంలో వచ్చే ట్విస్టులు.. మురుగదాస్ రాసుకున్న కొన్ని సీన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. 
మహేష్ బాబు స్పీడ్ గా వెళుతోన్న బైక్ విలన్ కొట్టగానే అతను వెళ్లి ముందు వెళుతోన్న చువ్వల లారీకి గుద్దుకుని వేలాడుతూ ఉండటం.. ఇలాంటి సీన్ కు మహేష్ కు ఒప్పుకోవడం గొప్పైతే దాన్ని చిత్రీకరించిన విధానం చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. అలాగే ఇంట్లో తన తల్లిని, తమ్ముడ్ని కాపాడుకునే సీన్.. ఇక విలన్ ఉన్న వీధిలోని ఆడవాళ్లతో అతన్నికనిపెట్టడం.. సినిమాకే హైలెట్. ఈ సీన్స్ ను అద్భుతంగా రాసుకున్న దర్శకుడు సెకండ్ హాఫ్ లో కొంత వరకూ పెన్ను సడలిచినట్టు అనిపిస్తుంది. దీంతో సినిమా సాగుతోన్న ఫీలింగ్ వస్తుంది. ఓ బలమైన పాయింట్ ను అంత బలంగా చెప్పలేకపోయాడేమో అని కూడా ఒక అనిపిస్తుంది. కానీ నరరూప రాక్షసుడిగా విలన్ ను చూపించినప్పుడు అతని నెట్ వర్క్ ను కూడా ప్రెజెంట్ చేస్తే బావుండేది. ఇంత టెక్నాలజీ ఉన్నా.. ఎన్నో హత్యలు చేసే ఓ సాధారణ హంతకున్ని పట్టుకోలేకపోవడం మైనస్ పాయింటే. అతనికంటూ ఓ సెపరేట్ వింగ్ ఉండి ఉంటే కథ ఇంకా రసవత్తరంగా ఉండేది. ఇక పాటలన్నీ సిగరెట్ సాంగ్స్ కావడం మరో మైనస్..  అయితే ఎప్పట్లాగే మురుగదాస్ క్లైమాక్స్ లో హీరో చేత చెప్పించిన డైలాగ్స్ టచింగ్ గా ఉన్నాయి. మన కళ్లు ఏదో ఒక ‘స్క్రీన్’ కు అతుక్కుపోయి పక్కన ఉన్న మనిషిని కూడా పట్టించుకోవడం లేదనే డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి. 
ఆర్టిస్టుల పరంగా ఇది మహేష్ బాబు ఒన్ మేన్ షో. బలమైన విలన్ కూడా ఉండటంతో అతని టాస్క్ మరింత టఫ్ అయింది. ఇక మహేష్ నటన గురించి కొత్తగా చెప్పేదేముందీ.. అదరగొట్టాడు. ఇక ఎస్ జే సూర్య.. ఇతని నటన గురించి ఎంత చెప్పినా తక్కువ. దర్శకుడిగా ఎన్నో సెన్సిబుల్ లవ్ స్టోరీస్ తీసిన సూర్య ఇంత బ్రూటల్ విలన్ గా చేయడం సాహసమైతే.. తన నటనతో పెద్దవారిని కూడా భయపెట్టాడు. సైకోపాత్ పాత్రలో అతను సింపుల్ గా జీవించాడు. అంతమందిని చంపి ఆనందాన్ని వెదుక్కునే వ్యక్తిగా మనకు ఓ సైకో కనిపిస్తాడే కానీ ఎక్కుడా సూర్య అనిపించడు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్రకు ఏ ఇంపార్టెన్స్ లేదు.. జస్ట్ పాటల బొమ్మగా మిగిలిపోయింది. కానీ తన 98 పర్సెంట్ మార్క్స్ సీన్ మురుగదాస్ సినిమాలో ఎక్స్ పెక్ట్ చేయడం ఆశ్చర్యం. బట్ బావుంది. ఇతర పాత్రల్లో ప్రియదర్శి ఓకే. భరత్ ది రొటీన్ క్యారెక్టర్. నాగినీడు, జయ ప్రకాష్ జస్ట్ ఓకే. 
టెక్నికల్ గా  : 
సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ మనసు దోచేస్తుంది. ఎప్పట్లానే అద్భుతమైన వర్క్ ఇచ్చాడు. పాటలు బాలేకపోయినా హారీస్ జయరాజ్ బిజిఎమ్ మైండ్ బ్లోయింగ్. ఆర్ట్ వర్క్ అద్భుతం అనిపిస్తుంది. గ్రాఫిక్స్ అత్యంత నాసిరకంగా ఉన్నాయి. మాటలు గొప్పగా లేవు. డ్యాన్సులు, ఫైట్స్ అస్సలు బాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. మురుగదాస్ ఎంచుకున్న పాయింట్ బావున్నా.. దాన్ని అతని స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేదనే చెప్పాలి. కొన్నిసార్లు అసలు ఇది అతనే డైరెక్ట్ చేశాడా అనిపిస్తుంది కూడా. అందుకే స్పైడర్ కొన్ని వర్గాలకు మాత్రమే అర్థమైయ్యే సినిమా అయ్యే అవకాశాలున్నాయి.    


ప్లస్ పాయింట్స్ : 
కథ 
మహేష్ బాబు
సూర్య నటన 
సినిమాటోగ్రఫీ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఫస్ట్ హాఫ్ 
మైనస్ పాయింట్స్ : 
స్లో నెరేషన్ 
స్క్రీన్ ప్లే 
పాటలు 
సెకండ్ హాఫ్ 
మాటలు 
క్లైమాక్స్ 
ఓవరాల్ గా:  థ్రిల్లింగ్ లేకపోయినా సాఫీగా సాగిన స్పైడర్ 
రేటింగ్    : 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com