'గల్ఫ్' రివ్యూ

- October 13, 2017 , by Maagulf
'గల్ఫ్' రివ్యూ

చిత్రం: గల్ఫ్‌ 
తారాగణం: చేతన్ మద్దినేని.. డింపుల్‌.. సంతోష్ పవన్‌.. తోటపల్లి మధు.. పోసాని కృష్ణమురళి.. నల్ల వేణు.. తనికెళ్ల భరణి తదితరులు 
సంగీతం: ప్రవీణ్ ఇమ్మాడి 
మాటలు: పులగం చిన్నారాయణ 
నిర్మాతలు: యొక్కలి రవీంద్రబాబు, ఎం.ఎస్‌.రాంకుమార్‌ 
రచన, దర్శకత్వం: పి.సునీల్ కుమార్ రెడ్డి 
సంస్థ: శ్రావ్య ఫిలిమ్స్‌ 
విడుదల: 13 అక్టోబరు 2017
సొం త ఊరు, గంగపుత్రులు చిత్రాలతో ఆకట్టుకొన్నారు సునీల్ కుమార్ రెడ్డి. ఓ సామాజిక సమస్యని ప్రతిబింబిస్తూ ఆయన కథలు సాగాయి. అందుకే సునీల్ కుమార్ రెడ్డి సినిమా అంటే బలమైన సమస్యేదో ప్రతిబింబిస్తుందని ప్రేక్షకులు ముందే ఓ అంచనాకు వస్తారు. ఈసారి ఆయన 'గల్ఫ్‌' వెతల్ని సినిమాగా తీశారు. పేరు, ప్రచార చిత్రాలు చూస్తే, పొట్ట కూటి కోసం గల్ఫ్ వలస వెళ్లిన బతుకుల్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమైంది. మరి ఆ ప్రయత్నం ఎంత సమర్థంగా సాగింది? 'గల్ఫ్‌' బానిస బతుకుల్ని ఆయన తెరకెక్కించిన విధానం ఎలా ఉంది?
కథేంటంటే... 
శివ (చేతన్ మద్దినేని) సిరిసిల్ల గ్రామ వాస్తవ్యుడు. చదవు పెద్దగా అబ్బలేదు. వంశ పారంపర్యంగా వస్తున్న చేనేత వృత్తి చేస్తూ బతకడం అస్సలు ఇష్టం లేదు. అందుకే గల్ఫ్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనుకొంటాడు. ఇంట్లో ఒప్పించి, లక్ష రూపాయలు అప్పు చేసి మరీ గల్ఫ్ వెళ్తాడు. ఈ ప్రయాణంలోనే లక్ష్మి (డింపుల్‌) పరిచయం అవుతుంది. ఎన్నో ఆశలతో గల్ఫ్ లోకి అడుగుపెట్టిన వీరిద్దరికీ అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. శివ కార్మికుడిగా మారతాడు. లక్ష్మి ఓ సేటు ఇంట్లో నరకయాతన పడుతుంది. వీళ్లవే కాదు... అక్కడున్న వేలాదిమంది భారతీయుల బతుకులివే. ఈ నరకం నుంచి శివ, లక్ష్మి ఎలా తప్పించుకొన్నారు? ఆ ప్రయత్నంలో వాళ్లకు ఎదురైన అనుభవాలేంటి? అనేదే కథ.
ఎలా సాగిందంటే..? 
గల్ఫ్ వెళ్లి.. అక్కడ అష్టకష్టాలు పడుతున్న భారతీయుల దీన గాధని పేపర్లలో చదువుతున్నాం. టీవీల్లో చూస్తున్నాం. బహుశా ఇవే.. సునీల్ కుమార్ రెడ్డి ఇలాంటి కథ రాసుకోవడానికి అస్త్రాలుగా మారి ఉండొచ్చు. గల్ఫ్ జీవితాల్ని దర్శకుడు చక్కగానే ఆవిష్కరించారు. ఓ రకంగా డాక్యుమెంటరీ చేశారు. దూరపు కొండలు నునుపు అన్నట్టు... ఇక్కడి నుంచి చూస్తే గల్ఫ్ బంగారు కొండలానే కనిపిస్తుంది. అక్కడకు వెళ్తే గానీ, అందులో ఉన్న చీకటి కోణాలు అర్థం కావు. దాదాపుగా ఆ కోణాల్ని దర్శకుడు వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఓ సీరియెస్ పాయింట్ చుట్టూ నడిచిన కథ కాబట్టి.. వినోదం ఆశించకూడదు. అయితే అక్కడక్కడ వెకిలి జోకులతో కాస్త ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసినా.. సెన్సార్ కత్తెరతో ఆ సంభాషణలకు తెర పడింది. ఎంతసేపూ కష్టాలు, కన్నీళ్లు చూపిస్తామంటే... ప్రేక్షకులకు రుచించదు. చెప్పాల్సిన విషయాన్ని బలమైన భావోద్వేగాలతో ముడి పెట్టి చెబితే గానీ అర్థం కాదు. ఈ విషయంలో దర్శకుడు అంతగా సఫలీకృతం కాలేదు. ద్వితీయార్థంలో కథ ఓ చోటే ఆగిపోతుంది. గల్ఫ్ కష్టాలు తప్ప... సినిమాలో ఇంకేం కనిపించలేదు. యాంటీ క్లైమాక్స్‌తో దర్శకుడు కన్నీరు పెట్టించే ప్రయత్నం చేసినా - అప్పటి వరకూ కష్టాలు చూసీ చూసీ అలవాటు పడిపోయిన ప్రేక్షకుల మనసుకు అదీ అంతగా చేరువ కాలేదు.
ఎవరెలా చేశారంటే...? 
నాయకా నాయికలు కొత్తవారే. అయితే.. ఈ కథకు, వాళ్ల పాత్రలకు తగినట్టుగా నటించారు. చేతన్, డింపుల్‌కి పాస్ మార్కులు పడిపోతాయి. పోసాని, తోటపల్లి మధులవి చిన్న పాత్రలే. భరణి ఓ పాటలో కనిపిస్తారంతే. నిజానికి ఆ పాట కూడా అవసరం లేదు. గల్ఫ్ అంటే దుబాయ్‌, సౌదీ చూపించాలి. అక్కడే సినిమా నడిపించాలి. ఈ సినిమాకి అంత బడ్జెట్ లేదు. ఇక్కడ సీన్లు తీసి, దుబాయ్ అన్నట్టు భ్రమించే ప్రయత్నం చేశారు. దర్శకుడు చెప్పాలనుకొన్న అంశం మంచిదే. అయితే.. కష్టాల డోస్ మరీ ఎక్కువైంది. పులగం అందించిన సంభాషణలు అక్కడక్కడ మెరిశాయి. 'పెద్దోడు మగ్గాన్ని నెగ్గలేక ఉరి వేసుకొని వెళ్లిపోయాడు, చిన్నోడు మగ్గానికే ఉరి వేసేశాడు', 'గోదారైనా గల్ఫ్ అయినా అమ్మాయి సెల్‌ఫోన్‌కి రీఛార్జ్ చేయించాల్సింది అబ్బాయే' లాంటి మాటలు ఆకట్టుకొంటాయి. పాటలు బాగానే ఉన్నా... ఇలాంటి కథని మరింత షార్ప్‌గా చెప్పడానికి అవి ఉపయోగపడవు.
బలాలు 
కథా నేపథ్యం 
సంభాషణలు
బలహీనతలు 
కష్టాలు ఎక్కువ

--మాగల్ఫ్ రేటింగ్:3

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com