ఏఆర్ రెహమాన్ కు వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డ్.!

- October 20, 2017 , by Maagulf
ఏఆర్ రెహమాన్ కు వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డ్.!

ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ విజేత ఎ.ఆర్. రహమాన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డ్ రెహ్మాన్‌ను వరించింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన 'రోజా' చిత్రానికి రహ్మాన్ స్వరాలు సమకూర్చినప్పుడు ఎవ్వరూ... భవిష్యత్తులో అతను అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తాడని ఊహించి ఉండరు. ఒకవేళ అలాంటి ఊహ ఉన్నా ఈ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందుతాడని అనుకోకపోవచ్చు. భారత సినీ సంగీత సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రెహ్మాన్ గత కొన్నేళ్ళుగా వరల్డ్ సినిమాపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న రెహ్మాన్ తాజాగా వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డును అందుకున్నాడు. రహ్మాన్ సంగీతం అందించిన ఇండో-బ్రిటిష్ చారిత్రక చిత్రం 'వైస్రాయ్స్ హౌస్'కు గాను ఈ అవార్డు లభించింది. ఈ పీపుల్ ఛాయిస్ అవార్డుకు రెహ్మాన్‌కు వందదేశాల నుండీ ఓట్లు పడ్డాయని నిర్వాహకులు తెలిపారు. వీరందరికీ రహ్మాన్ సోషల్‌మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.

ఇదిలా ఉంటే '99 సాంగ్స్' అనే చిత్రాన్ని రహ్మాన్ నిర్మిస్తున్నాడు. దీనికి రచన కూడా అతనే చేయడం విశేషం. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ మాత్రమే ఇప్పటి వరకూ విడుదలైంది. అయితే దీపావళి సందర్భంగా రహ్మాన్ '99 సాంగ్స్' సినిమా విశేషాలు తెలిపారు. విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించే ఈ సినిమాలోని హీరోహీరోయిన్ల కోసం దాదాపు వెయ్యిమందిని ఆడిషన్ చేశారట. చివరకు ఇద్దరిని ఎంపిక చేశామని వారికి సంగీత వాద్యాలను ఉపయోగించడంతో శిక్షణ ఇచ్చామని తెలిపారు. అనంతరం హాలీవుడ్‌లో యాక్టింగ్ వర్క్ షాప్స్‌కు పంపారట. ఈ సినిమా షూటింగ్‌ను ఇదే యేడాది ఇండియాలో ప్రారంభించామని, ఇటీవలే ఉక్రేయిన్‌లో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేశామని రెహ్మాన్ చెప్పారు. పేరు చూసి ఈ చిత్రంలో 99 పాటలు ఉంటాయా అని అందరూ తనని అడుగుతున్నారని, ఇందులో పది, పన్నెండు గీతాలు మాత్రమే ఉంటాయంటున్నారు రహ్మాన్. మరి రహ్మాన్ మానసపుత్రికగా తెరకెక్కుతున్న మ్యూజికల్ లవ్ స్టోరీ '99 సాంగ్స్' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com