బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలిశారో.. అంతే.. చైనా ఘాటు హెచ్చరిక

- October 21, 2017 , by Maagulf
బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాను  కలిశారో.. అంతే.. చైనా ఘాటు హెచ్చరిక

 బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాను విదేశీ నాయకులు ఎవరైనా కలిస్తే.. దానిని తీవ్ర నేరంగా పరిగణిస్తామంటూ చైనా శనివారం ఘాటు హెచ్చరికలు జారీచేసింది. టిబేట్‌ మతనాయకుడైన దలైలామాను 'వేర్పాటువాద' నేతగా భావిస్తున్న చైనా.. ఆయనకు ఏ దేశమైన ఆతిథ్యమిచ్చినా, విదేశీ నాయకుడు ఎవరైనా ఆయనను కలిసినా సహించబోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. విదేశీ నేతలు ఎవరైనా వ్యక్తిగతంగా దలైలామాను కలుసుకోవచ్చునని భావిస్తూ ఉండవచ్చునని, కానీ, తమ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అలా చేయరాదని చెప్పుకొచ్చింది.

1959లో చైనా పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన దలైలామా ప్రస్తుతం భారత్‌లో ప్రవాసముంటున్న సంగతి తెలిసిందే. నోబెల్‌ శాంతిపురస్కారాన్ని గెలుచుకున్న దలైలామాను చైనా ప్రమాదకర వేర్పాటువాదిగా అభివర్ణిస్తూ వస్తోంది. మరోవైపు దలైలామా తన హిమాలయ మాతృభూమి అయిన టిబేట్‌కు సముచితమైన స్వతంత్ర ప్రాతిపత్తి కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

దలైలామాను ఏ దేశమైనా, ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా కలిస్తే.. అది చైనా ప్రజల సెంటిమెంట్‌కు విరుద్ధమైన తీవ్ర నేరమే' అంటూ కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రభుత్వానికి చెందిన ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ మినిష్టర్‌ ఝాంగ్‌ యిజియాంగ్‌ అన్నారు. గతంలో ప్రపంచ నేతలు ఎవరైనా దలైలామాను కలిస్తే.. చైనా నిరసన తెలిపిదే. కానీ, తాజాగా దలైలామాపై చైనా తన వైఖరిని కఠినతరం చేసినట్టు కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com