జపాన్ ప్రధానిగా మళ్లీ షింజో అబేకే పట్టం కట్టిన జనం

- October 23, 2017 , by Maagulf
జపాన్ ప్రధానిగా మళ్లీ షింజో అబేకే పట్టం కట్టిన జనం

జపాన్ పార్లమెంట్‌ ఎన్నికల్లో  ప్రధాని షింజో అబేకు చెందిన అధికార కూటమి భారీ విజయం సాధించింది. మరోసారి విజయంతో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున షింజో అబే మరో మూడేళ్ల పాటు ప్రధానిగా నిలవనున్నారు. ఇవాళ జరిగిన కౌంటింగ్‌లో మొత్తం 465 స్థానాలకు షింజో అబే పార్టీ 312 సీట్లు గెలుచుకుంది. మిగతా పార్టీలు 143 సీట్లు గెలుచుకున్నాయి. ఫలితాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మూడింట రెండు వంతుల మెజారిటీ కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న షింజో అబే పార్టీ మళ్లీ అధికారం చేపట్టనుంది.

ప్రధాని షింజో అబే మరోసారి భారీ మెజారిటీతో విజేతగా నిలుస్తారని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార కూటమి సులభంగా నెగ్గుతుందని, శక్తిమంతమైన దిగువ సభలో మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందని సర్వేలు చెప్పాయి. షింజోకు జపాన్ ప్రజలు అంత సానుకూలంగా లేకపోయినా.. వరస క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా దూకుడు పెంచుతుండడం అబేకు అనుకూలమైంది. 

ఇలాంటి పరిస్థితుల్లో షింజో అబేలా ఎవరూ వ్యవహరించలేరని ఓటర్లు భావించారు. దీంతో జపాన్ ఓటర్లు మళ్లీ ఆయనకే విజయం కట్టబెడతారని అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టే నిర్ణీత గడువు కంటే ఏడాది ముందే దిగువసభను రద్దు చేసిన అబే ఎన్నికలకు వెళ్లాడు. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ బలహీనంగా ఉండడం కూడా షింజో అబేకు కలిసొచ్చింది. 

జపాన్ ఎదుర్కొంటున్న 'జాతీయ సంక్షోభాన్ని' పరిష్కరించడానికి ప్రజల నుంచి తాజా తీర్పు కోరుతూ సెప్టెంబర్ 25న  షింజో  మధ్యంతర ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఉత్తర కొరియా జపాన్‌ను సముద్రంలో ముంచేస్తానని హెచ్చరించడాన్ని షింజో చాలా సీరియస్‌గా తీసుకున్నారు.  దీనికి తోడు ప్రధాన ప్రతిపక్షం అయిన డెమెక్రటిక్ పార్టీ బలహీనంగా ఉండడంతో 'షింజోకి ఓటు వేయడం మినహా వేరే ప్రత్యామ్నాయం వారికి లేకుండా పోయింది. 

2006లో కొంతకాలం ప్రధానిగా పనిచేసిన షింజో 2012 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు  మధ్యంతర ఎన్నికల్లో కూడా గెలిస్తే యుద్ధానంతర జపాన్ చరిత్రలో సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతమవుతుంది. మొత్తం 465 సీట్లు ఉన్న దిగువ సభలో షింజే.. ఎల్‌డీపీకి సుమారు 300 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. షింజో మిత్ర పక్షాలు కొమియిటో మరో 30 పైగా స్థానాల్లో పోటీ చేస్తుండటంతో ప్రభుత్వానికి మూడింట రెండు వంతుల మెజారిటీ లభించే అవకాశముందని సర్వేలు చెప్తున్నాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com