నెక్ట్స్‌నువ్వే సినిమా రివ్యూ

- November 03, 2017 , by Maagulf
నెక్ట్స్‌నువ్వే సినిమా రివ్యూ

చిత్రం: నెక్ట్స్‌నువ్వే 
నటీనటులు: ఆది.. వైభవి.. రష్మి.. బ్రహ్మాజీ.. జయప్రకాష్‌రెడ్డి.. పృథ్వీ.. అవసరాల శ్రీనివాస్‌.. షకీలా తదితరులు 
సంగీతం: సాయి కార్తీక్‌ 
ఎడిటింగ్‌: ఎస్‌బీ ఉద్ధవ్‌ 
ఛాయాగ్రహణం: కార్తీక్‌ పళని 
నిర్మాత: కె.ఈ.జ్ఞానవేల్‌ రాజా, బన్ని వాసు 
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.ప్రభాకర్‌ 
సంస్థ: వి4 మూవీస్‌ 
విడుదల తేదీ: 03-11-2017
తొలిచిత్రం 'ప్రేమకావాలి'తోనే హుషారైన నటుడిగా పేరుతెచ్చుకున్న యువ కథానాయకుడు ఆది. గత కొంతకాలంగా ఆశించిన విజయాలు లేక సతమతమవుతున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన నటించిన మల్టీస్టారర్‌ 'శమంతకమణి'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తాను నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా హారర్‌కామెడీ జోనర్‌లో చేసిన చిత్రం 'నెక్ట్స్‌నువ్వే'. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో విజయం సాధించిన 'యామిరుక్క భయమే' చిత్రాన్ని తెలుగు నేపథ్యానికి అనుగుణంగా మార్చి 'నెక్ట్స్‌నువ్వే' పేరుతో తెరకెక్కించారు. మరి ఆది కొత్త జోనర్‌లో ఎలా నటించాడు? దర్శకుడిగా ప్రభాకర్‌ తొలి ప్రయత్నం ఫలించిందా?
 
కథేంటంటే: కిరణ్‌(ఆది) ఒక సీరియల్‌ డైరెక్టర్‌. 'జీవితం సేమ్యా ఉప్మా' అనే సీరియల్‌ తీస్తాడు. ఆ సీరియల్‌ కోసం జేపీ(జయప్రకాష్‌రెడ్డి) వద్ద రూ.50లక్షలు అప్పు చేస్తాడు. ఆ సీరియల్‌ ఫ్లాప్‌ కావడంతో టెలివిజన్‌ వాళ్లు దాన్ని ఆపేస్తారు. దీంతో కిరణ్ తీవ్రంగా నష్టపోతాడు. 'వారం రోజుల్లో అప్పు చెల్లించకపోతే నీ లవర్‌(వైభవి)ని తీసుకెళ్తా' అంటూ మరోపక్క జేపీ నుంచి బెదిరింపులు వస్తాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కిరణ్‌కు ఒక కొరియర్‌ వస్తుంది. అరకులో తనకో ప్యాలెస్‌ ఉందని, దానికి తానే యజమాని అన్న సంగతి ఆ కొరియర్‌ ద్వారా తెలుస్తుంది. దీంతో ఆ ప్యాలెస్‌ను వెతుక్కుంటూ వెళ్తాడు కిరణ్‌. ఈ సమయంలో శరత్‌(బ్రహ్మాజీ) రష్మి(రష్మి గౌతమ్‌) పరిచయం అవుతారు. ఈ నలుగురూ ఆ ప్యాలెస్‌ను బాగుచేసి దాన్నో రిసార్ట్‌లా తీర్చిదిద్దుతారు. అయితే అందులో అడుగు పెట్టిన వాళ్లంతా తెల్లవారేసరికి చనిపోతుంటారు. వాళ్లు ఎందుకు చనిపోతున్నారు? ఆ ప్యాలెస్‌ వెనక కథేంటి? అన్నదే సినిమా.
ఎలా ఉందంటే: తమిళంలో విజయం సాధించిన 'యామిరుక్క భయమే'కు రీమేక్‌ ఈ చిత్రం. గతంలో వచ్చిన హారర్‌ సినిమాల కోవలోనే ఇదీ కనిపిస్తుంది. కథలో ఎలాంటి కొత్తదనం లేదు. హారర్‌ థ్రిల్లర్‌ అని చెబుతున్నా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఆ వినోదం కూడా అక్కడక్కడా మాత్రమే పండింది. శరత్‌ పాత్రలో బ్రహ్మాజీ, ఆర్జీవీగా రఘుబాబు కామెడీ సినిమాకు ప్రధాన బలం. నవ్వులు పండించే బాధ్యత ఆ ఇద్దరే తీసుకున్నారు. ఈ కథలో దెయ్యం ఉందా? లేదా? ఉంటే ఎవరు? అనేది సినిమా ఇంకాసేపట్లో ముగుస్తుందనగా తెలుస్తుంది. అప్పటివరకూ కథలో పెద్దగా మలుపులు ఉండవు. భయపెట్టే సన్నివేశాలు కూడా తక్కువే. సినిమా కథ అంతా నాలుగు పాత్రల చుట్టూ తిరగడం.. ఒకే ప్యాలెస్‌కు పరిమితం చేయటంతో కాస్త విసుగనిపిస్తుంది. ఇప్పటికే హారర్‌ సినిమాలు చూసినవాళ్లకు ఈ కథ, కథనంలో ఎలాంటి కొత్త కోణం కనిపించదు.
 
ఎవరెలా చేశారంటే: ఆదికి ఇదో కొత్త జోనర్‌. ప్రతీ సినిమాలో తన పాత్ర మేరకు బాగానే నటిస్తాడు. అయితే వాటిలో కనిపించినట్టు హుషారైన నటన ఇందులో కనిపించదు. కథానాయిక పాత్రకు ప్రాధాన్యం లేదు. రష్మిని కేవలం మాస్‌ కోసమే తీసుకొన్నట్లు అనిపిస్తుంది. హీరోతో సమానమైన పాత్రను బ్రహ్మాజీ పోషించాడు. ఆ పాత్ర చుట్టూ వినోదమే ఈ సినిమాను నడిపిస్తుంది. సీరియల్‌ హీరోగా పృథ్వీ కాసేపు నవ్విస్తాడు. సాంకేతికంగా చెప్పుకోవాల్సి వస్తే ఉన్నవి రెండే రెండు పాటలు. హారర్‌ సినిమాలంటే నేపథ్య సంగీతానికి ఎక్కువ స్కోప్‌ ఉంటుంది. రొటీన్‌ కథ కావడంతో అందుకు తగినట్టుగానే సంగీతం కూడా సాగింది. దర్శకుడిగా ప్రభాకర్‌కు ఇది తొలి సినిమా. కథ, కథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సినిమాలో తనదైన ముద్రను వేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు 
+ బ్రహ్మాజీ కామెడీ 
+ నిర్మాణ విలువలు
బలహీనతలు 
- ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ 
- హారర్‌ అంశాలు లేకపోవడం 
- పతాక సన్నివేశాలు 
చివరిగా: భయపెట్టని 'నెక్ట్స్‌నువ్వే'

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com