రేపు భాగ్యనగరంలో సంగీత సామ్రాట్ 'ఇళయరాజా'

- November 04, 2017 , by Maagulf

అందరికీ నమస్కారం... రేపు మన భాగ్యనగరి లో జరుగుతున్న సంగీత సామ్రాట్, స్వరజ్ఞాని గా సుప్రసిద్దమైన, పరిచయమే అవసరం లేని, భారత దేశం లోనే అత్యున్నత సంగీత స్వర రచయితలలో ఒకరైన శ్రీ ఇళయరాజా గారి సంగీత విభావరిని పురస్కరించుకుని, ఆయన చేసిన పాటలలో అతి కొద్ది వాటి గురించి, నా ఊహ ప్రకారం ఆయనకి అత్యంత ఇష్టమైన కీరవాణి రాగం లో ఆయన స్వరపరచిన కొన్ని పాటల గురించి ప్రస్తావించాలి అని అనిపించి ఈ శీర్షిక మీకు అందిస్తున్నాను. తప్పులు ఉంటే తెలియచేయగలరు.

కీరవాణి రాగం:
కర్ణాటక సంగీతం లో తెలుపబడిన 72 మేళకర్త రాగాలలో కీరవాణి కూడ ఒకటి. ఇది 21 వ మేళకర్త రాగం. నాలుగవదైన వేద చక్రం లోని మూడవ రాగము. 
హిందుస్తానీ సంగీతం లో కూడా ఈ రాగం ఉంది కీరవాణి పేరుతోనే పిలవబడుతుంది.
ఈ రాగం పాస్చాత్య సంగీతం (వెష్టర్న్) లో కూడా సుప్రసిద్ద మరియు ఎక్కువగా వాడబడిన రాగము. దీన్ని వాళ్లు హార్మోనిక్ మైనర్ స్కేల్ గా పిలుస్తారు

కీరవాణి లో ప్రముఖ శాస్త్రీయ స్వర రచనలు:
ఎటియోచనలు చేసేవురా -  త్యాగరాజ స్వామి
కలిగియుంటే - త్యాగరాజ స్వామి
నా పుణ్యము గదా ఈశా - ముత్తయ్య భాగవతార్ 
శ్రీ దక్షిణామూర్తిం - ఎం బాలమురళీకృష్ణ

ఈ రాగం అంటే రాజా గారికి ఎందుకు అంత ఇస్టమో ఆయననే అడిగి తెలుసుకోవాలి. ఎన్నని చెప్పినా, తెలియని పాటలు ఎన్నో కొన్ని మిగిలి ఉండేంతగా ఈ రాగాన్ని పీల్చి పిండి పిప్పి చేసి వదిలేశారు ఆయన. 80 ల నుంచి 90 ల మధ్య కాలంలో ఆయన అనేక పాటలు చాల ప్రజాదరణ పొందినవి, ఇప్పటికీ నిత్య నూతనంగా తోచేవి అసంఖ్యాకం గా ఉన్నాయి. నా ఉజ్జాయింపు ప్రకారం ఎంత కాదన్నా 600 పైగా పాటలు ఇదే రాగం లో అయన చేసి ఉంటారు. కాదు అని వాదించినా, నేపథ్య సంగీతం తో కలుపుకోండి, ఇంకా ఎక్కువే అవుతాయి తప్ప, తక్కువ కానే కాదు. దాదాపు అప్పట్లో ప్రతి చిత్రం లో ఒక పాట కీరవాణి లో ఉంది అంటే అతిశయోక్తి కాదేమో. అయితే, ఈ నాటి సంగీత దర్శకుల మాదిరిగా ఒకటే మూస కొట్టుడు కాకుండా, ఒకే బాణీ ని అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే వాయించేయకుండా, ఒకదానితో మరొక దానికి పొంతన లేకుండా, అలాగే దేనికదే ఆణిముత్యాలుగా మలచడం లో ఆయన విజయవంతం అయ్యారు. అందుకే లక్షల్లో ఒకరిగా రాజా లా నిలిచారు. ఆధునిక సంగీత సామ్రాజ్య రారాజై వెలుగొందుతున్నారు.

ఇళయరాజా గారు మాధుర్య ప్రథానం గా బాణీలు చేస్తారు అని ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు కదా. ఈ కీరవాణి రాగం లో ఆయన అత్యంత మధురమైన గేయాలు అందించారు. సాధారణంగా పాట వచ్చే సందర్బాన్ని బట్టి వాటికి సరిపోయే రాగాన్ని ఎంచుకోవడం రివాజు. దాదాపు అందరు సంగీత దర్శకులు చేసే పని. ఉదాహరణకు భక్తి రసానికి కల్యాణి రాగము, శృంగారానికి కి మోహన, కరుణకు శివరంజని ఇలా సందర్భానికి కొన్ని కొన్ని రాగాలు ఎంచుకోవడం పరిపాటి. కాని ఒక రాగాన్ని ఎలాంటి సందర్భానికైన ప్రయోగించగల దిట్ట ఇళయరాజా గారు.

ఈ రాగం లో ఆయన వివిధ సందర్భాలకు చేసిన పాటలు గుర్తు చేసుకుంటే.. 
1. ఓ ప్రియా ప్రియా - గీతాంజలి
విలక్షణమైన ఈ చిత్రం లో తమ బవిష్యత్తు ఎన్నాళ్లు సాగుతుందో తెలియని ప్రేయసి ప్రియుల మనో వేదన తెలిపే సందర్భం లో వచ్చే పాట. ఈ పాటలో రాజాసార్ అధ్బుతమే సృష్టించారు. ఒకరికొకరు కలుస్తామో లేదో అన్న ప్రశ్నార్థకం నుంచి ఏది ఏమైనా ప్రేమదే విజయం అని ఇద్దరూ సమాధానం చెప్పుకుని కలిసే ఉంటాము అని విశ్వాసంతో ముగుస్తుంది. వాళ్ల పరిస్థితి ని చెవులకు కట్టినట్లు తెలిపే సంగీత కల్పన ఈ పాట. వేటూరి గారి కల బలం గా పనిచేసిన రోజులు కాబట్టి సాహిత్యానికి ఎలాంటి లోటు జరగలేదు. బాలు చిత్ర ల ద్వయం ఎప్పటిలాగే పాట కి సంపూర్ణ న్యాయం చేశారు. నూటికి నూరు శాతం మార్కులు వేయించుకున్న పాట ఇది.

2. బాబా సాయి బాబా - శ్రీ శిర్డిసాయిబాబా మహత్యం 
ఈ పాట కూడా కాస్త బాధ తో కూడిన సందర్భమే అయినా.. భక్తి పరాకాష్టకు చేరి, తాను నమ్మిన దేవుని మరణ వార్త విన్న భక్తుని ఆర్తనాదం ఈ పాటకి నేపథ్యం. ఆవేశం, ఉక్రోశం, విలాపం, నైరాస్యం కనిపించే సన్నివేశం లోని పాట ఇది. ఇలాంటి సన్నివేశానికి కూడా కీరవాణి రాగాన్ని ఎంచుకుని ప్రయోగించి, శ్రోతల హ్రుదయాలను భక్తి, కరుణ రసాలతో తడిపిన గీతం ఇది. పాట లోని భావాన్ని, పాత్ర లోని భాధను గొంతులో పలికించిన బాలు ధన్యుడు. పాట ఆసాంతం ఎటూ కదలకుండా కీరవాణి లోనే చేసారు. ప్రజల మదిలో ఎప్పటికీ మిగిలేలా మలిచారు.

3. చల్తీ కా నాం గాడీ - చెట్టు కింద ప్లీడరు 
ఇది హాస్య ప్రధానమైన చిత్రం, ఈ పాట నేపథ్యం కూడా హాస్యపూరితమే. మన హీరో గారు ఒక పాడుబడిన డొక్కు కారు వాడుతూ, తన మరదలికి, రోడ్డు మీద వెళ్ళే వాళ్లకి చివరికి పాత సామన్లు కొంటాం అనే వాడికి కూడా లోకువ అవుతాడు. ఎప్పటిలాగే మనోడి కారు దారి మధ్యలో ఆగిపోతుంది. అప్పుడు వచ్చే పాట ఇది. ఈ సంధర్భానికి తగ్గట్టుగా హాస్య ప్రధానం గా ఉంటునే మాధుర్యాని కొంచెం కూడా తగ్గకుండా స్వరపరిచిన విధానానికి విస్మయం చెందాల్సిందే. చరణాల మధ్యలో కారు మెకానిక్ షెడ్డు లో పరికరాల ధ్వనులలో కూడా కీరవాణి రాగాన్ని పలికించిన సంగీత మెకానిక్ మన ఇళయరాజా గారు. వంశీ గారితో అనుభందం ఆయనతో ఇలాంటి ఎన్నో హాస్య మాధుర్య ప్రధాన పాటలను రాబట్టుకోగలిగింది.

4. కీరవాణి - అన్వేషణ
ఇళయరాజా గారి ప్రతి సంగీత కార్యక్రమం లో ఈ పాట ఖచ్చితం గా ఉంటుంది అంటేనే తెలుస్తుంది. ఈ పాట ఎంత గొప్పది, ఎంత ప్రజాదరణ పొందినది, ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపించేదీ అని. హీరో హీరోయిన్ల మధ్య పరిచయం పెంచే సందర్భం గా అమ్మయికి ఇష్టమైన రాగాన్ని నాయకుడు పాడి తనతో గొంతు కలిపే సందర్భం. డ్యూయెట్ అని చెప్పొచ్చు. ఇది కూడా వంశీ గారి చిత్రమే. ఇళయరాజా గారికి ఇష్టమైనది కాబట్టే, హీరోయిన్ కి ఇష్టమైన రాగం గా సినిమాలో పెట్టి ఉంటారు వంశీ. వేటూరి గారు ఏకంగా ఈ రాగం పేరుతోనే పల్లవిని ప్రారంభించారు. అద్భుతమైన ఈ పాట ఇప్పటికి అందరి ఇళ్లలో, కార్లలో, చెవులలో మారు మ్రోగుతూ అలరిస్తూనే ఉంది. 

5. నీ అందం నాప్రేమ గీతగోవిందం - వారసుడొచ్చాడు
కథా నాయకుడు తన ప్రేమని తెలియపరిచిన తర్వాత కథానాయిక కృతజ్ఞత గా భావిస్తూ తన మనసులో భావాల్ని వూహల్లో తెలియచేసే సందర్భం. చక్కని యుగళగీతం, సందర్భం అత్యంత సాధరణం మరియు ప్రతీ ప్రేమ కథ చిత్రం లో ఉండేదే అయినప్పటికీ, కీరవాణి రాగాన్ని కాస్త వేగవంతో నడిపి కొత్తదనాన్ని చూపించారు రాజా గారు. ఆయన పాటల్లో అధికం గా తబలా మీదనే ఎక్కువ ఉంటాయి. ఈ పాట లో కూడా తబలా నడక చాలా కొత్తగా ఉంటుంది.  వేటూరి మరోమారు స్వరంతో పోటిపడి పదాలు సమకూర్చారు. ఈ పాటలో కూడా కీరవాణి రాగం ప్రస్తావన చేసారు వేటూరి. 

6. నీరుగారి పారిపోకు - చెట్టుకింద ప్లీడరు 
ఈ చిత్రం లో ఒక హాస్య భరితమైన పాట గురించి పైన చెప్పాను, అదే చిత్రం లో హీరో తాను ఒప్పుకున్న పనిని చేయలేను అని చేతులు ఎత్తేస్తే, తనతో పనిఛేసే మరదలు తనలో స్పూర్తిని నింపే ప్రయత్నం చేస్తుంది, హీరో ఒప్పుకోడు. ఇది సందర్భం. ఒకే చిత్రంలో రెండు పాటలు ఒకదానికి ఒకటి ఎక్కడా పొంతన లేని సందర్భాలు. కానీ ఈ రెండిటికీ ఒకే రాగాన్ని ఎంచుకుని న్యాయం చేయడం కత్తి మీద సాము వంటిది. కాని రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటి రాజా గారికి కానే కాదు. హీరోలో ధైర్యాన్ని నింపి ప్రేరెపించే సందర్భం లో కూడా ఇళయరాజా కీరవాణి ని ఉపయోగించి ధైర్యవాణి గా మలచారు.

7.మాటేరాని చిన్నదాని - ఓ పాపా లాలి
అత్యంత ప్రజాదరణ పొందిన పాట ఇది. తాను రాసిన పాటని ఒక సవాల్ గా తీసుకుని చిత్రం లో బాలు పాడి వినిపించే సందర్భం. ఈ పాట ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఊపిరి తీసుకునే అవకాశం లేని విధంగా చరణం మొత్తం ఒకే సరళి లో సాగుతుంది. చరణం అయ్యాక గాని గాయకుడికి గాలి పీల్చుకునే అవకాశం రాదు. ఇలాంటి ప్రయోగాలు అనేకం చేసారు ఇళయరాజా. బాలు కూడా ఏ మాత్రం తక్కువ కానివ్వకుండా పాటకి ఎంత అందం తేవాలో అంతకి రెండింతలు ఎక్కువే చేసారు. పాటల పోటీల్లో ఇప్పటికి ఈ పాట పాడి ఎక్కువ మార్కులు సంపదించడానికి గాయకులు ప్రయత్నిస్తారు. ఎప్పటికీ కొత్తగా నిలిచే పాటలలో ఇది కూడా ఒకటి.

కీరవాణి లో రాజా గారు స్వరసంచారం చేసిన మరికొన్ని పాటలు:
1. గోపీ లోల - లేడీస్ టైలర్ 
2. యదలో లయ - అన్వేషణ
3. ఓ పాపా లాలి - గీతాంజలి
4. ప్రియతమ తమ సంగీతం - ఆలాపన
5. మాటరాని మౌనమిది - మహర్షి 
6. ఆకాశం మేఘాలు - కోకిల
7. అటు ఇటు చూసుకోదుగా - ఎటో వెళ్లి పోయింది మనసు
8. గాలీ నింగి నీరు - శ్రీ రామరాజ్యం 
9. నా రాగమే - మౌన రాగం 
10. జిలిబిలి పలుకుల - సితార
11. మాటంటే మాటేనంట - ఏప్రిల్ ఒకటి విడుదల
12. జగదేక వీరుడు అతిలోక సుందరి నేపథ్య సంగీతం
13. సాగర సంగమం నేపథ్య సంగీతం
14. నిరీక్షణ క్లైమాక్స్ నేపథ్య సంగీతం
15. గీతాంజలి నేపథ్య సంగీతం

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నిండిపోతుంది తప్ప పాటలు మాత్రం అవ్వవు. పైన విశ్లేషించిన పాటలు వివిధ రకాల సందర్భాలలో కీరవాణి రాగం మీద రాజా గారి మక్కువని, పట్టు ని తెలియచేస్తాయి. ఇక ఆయన ఇతర భాషలలో చేసిన పాటలు గురించి చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుందేమో. ఫలానా భావ ప్రకటనకి ఫలానా రాగం నప్పుతుంది అని పురాతన సంగీత దర్శకులు పాటించిన వ్రాయని నియమాలని ఇళయరాజా ఎప్పటికప్పుడు చెరిపేస్తూనే ఉన్నారు. స్వరకల్పనకు నియమాలు ఉండవని నిరూపించారు. కేవలం ప్రేక్షకులని అలరించి ఉర్రూతలూగించాలి అన్న ఒక్క నియమాన్నే అనేక సంవత్సరాలుగా పాటిస్తూ ఎంతో మంది సంగీత దర్శకులకు దిక్సూచి అయ్యారు. స్పూర్తిగా నిలిచారు. రేపు నగరం లో కురవబోయే ఆయన పాటల వర్షం లో నాలుగు కీరవాణి చినుకులు పడాలని అందరినీ అలరించాలనీ కోరుకుంటూ.

మీ రఘురామ్  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com