ఒక్కడు మిగిలాడు - రివ్యూ

- November 10, 2017 , by Maagulf
ఒక్కడు మిగిలాడు - రివ్యూ

రివ్యూ    : ఒక్కడు మిగిలాడు
తారాగణం    : మంచు మనోజ్, అజయ్, అనీషా ఆంబ్రోస్, పోసాని, సుహాసిని, మిళింద్ గుణాజీ తదితరులు 
సంగీతం    : శివ నందిగాం
సినిమాటోగ్రఫీ    : రామరాజు
నిర్మాతలు    : ఎస్ఎన్ రెడ్డి, లక్ష్మీకాంత్
రచన, దర్శకత్వం    : అజయ్ ఆండ్రూస్ నూతక్కి


కంటిన్యూస్ గా మూవీస్ చేస్తూ కూడా కమర్షియల్ హిట్స్ కొట్టడంలో ఖంగు తింటోన్న హీరో మంచు మనోజ్. వైఫల్యాలెలా ఉన్నా కొత్త ప్రయత్నాలు చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు మనోజ్. ఆ క్రమంలోనే ఓ కొత్త దర్శకుడితో కలిసి ఒక్కడు మిగిలాడు అంటూ వచ్చాడు. ట్రైలర్ ను బట్టి ఇదో సీరియస్ తరహా సబ్జెక్ట్ అన్న విషయం అర్థమయింది. ఇంకా చెప్పాలంటే శ్రీలంక శరణార్థుల కథతో తెరకెక్కిన సినిమా అని ముందే చెప్పారు. మరి ఈ శరణార్థుల్లో మిగిలిపోయిన ఆ ఒక్కడి కథేంటో ఇప్పుడు చూద్దాం.. 


కథ    : 
సూర్య(మనోజ్) యూనివర్సిటీలో రీసెర్చ్ స్టూడెంట్. శ్రీలంక నుంచి బాల్యంలోనే భారత్ వచ్చిన శరణార్థి. తను చదువుతోన్న యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్, మినిస్టర్ కొడుకులు వల్ల ముగ్గురు అమ్మాయిలు చనిపోతారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు శరణార్థులు. అది ఆత్మహత్య అని అందర్నీ నమ్మించినా అసలు విషయం తెలిసిన సూర్య ఆ అమ్మాయిల కుటుంబాలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తుంటాడు. దీంతో అతని పై పోలీస్ లు అక్రమ కేస్ లు బనాయించాలని చూస్తారు. ఈ క్రమంలో వారి తరఫున ఎందుకు పోరాడుతున్నావని అడిగిన కానిస్టేబుల్ కు తన నేపథ్యం చెబుతాడు. అదేంటీ..? ఈ ముగ్గురు అమ్మాయిల చావుకు కారణమైన వారిని పోలీస్ లకు అప్పగించారా లేదా అనేది కథ.. ?

కథనం    :
కొన్ని కథలు వినడానికి బావుంటాయి. చూపించాడానికి అంత గొప్పగా అనిపించవు. కానీ వింటున్నట్టుగా చూపించిన కథ ఒక్కడు మిగిలాడు. హృదయాల్ని బరువెక్కించే సన్నివేశాలెన్నో నిండి ఉన్న ఈ సినిమాలో చిరాకు పెట్టే సీన్స్ కూడా చాలానే ఉంటాయి. ఒక వాస్తవ సంఘటన ఆధారంగా అల్లుకున్న ఈ కథలో అతకని కొన్ని సన్నివేశాలు కూడా చూస్తాం. కానీ ఓవరాల్ గా ఇదో పీడితుల కథ. పాలకులు ఏదేశం వారైనా.. న్యాయం ఏం చెబుతున్నా పీడితుల కథ మారదు అని స్ట్రాంగ్ చెప్పే ప్రయత్నం చేసిన కథ. అయితే దాన్ని సినిమాటిక్ గా చూపించే విషయంలోనే రాంగ్ సీన్స్ పడ్డాయి. కాలేజ్ లో మొదలైన కథ.. కొంతకాలం వెనక్కి వెళ్లి శ్రీలంకలో ఇబ్బందులు పడుతోన్న శరణార్థలు కష్టాల్ని చూపిస్తుంది. వారికోసం పోరాటం చేసే పీటర్ అనే యోధుడు చేసిన త్యాగాన్ని చూపుతుంది. అయితే ఈ శరణార్థలు పడుతోన్న కష్టాల్ని, ప్రభుత్వ, మిలట్రీ విధానాలతో వారు పడుతోన్న బాధల్నీ ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు దర్శకుడు. దీంతో వారెంత స్ట్రగుల్ అవుతోన్నా ఆ ఫీలింగ్ ఆడియన్ ను చేరలేకపోయింది. ఈ క్రమంలో వచ్చిన యుద్ధపాతం కూడా మరీ ఓవర్ అయిపోయింది. అలాగే శరణార్థుల నాయకుడుగా మనోజ్ నటన చాలాసార్లు ‘అతి’గా కనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ మరీ భారంగా వినిపిస్తుంది. ఈ లోపాలు పక్కన బెడితే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం బలంగా చెప్పే ప్రయత్నం చేశాడు. మనిషి మనిషిగా బతకడానికి కూడా ఎంత యాతన పడుతున్నాడో చూపే ప్రయత్నంలో చాలాసార్లు గుండెల్ని బరువెక్కిస్తాడు. ముఖ్యంగా ఓచిన్న పడవలో సముద్రంలో దారి తెలియని నీటిలో తీరం చేరే ప్రయత్నంలో వారు పడే బాధలు చూస్తే ఎంతటి వారికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. అయితే ఈ సముద్రం ఎపిసోడ్ కూడా మరీ ఎక్కువసేపు రావడం వల్ల ఆ ఫీల్ ఓవర్ అయిపోయింది. 
ఎల్టీటీఇ అధినేతగా ప్రభాకరన్ రాజకీయ జీవితం చాలావరకూ చాలామందికి తెలుసు. అతను తన వాళ్ల కోసం చేసిన పోరాటం కూడా గొప్పదే. ఆ పోరాట నేపథ్యాన్ని చూపిచండంలో దర్శకుడు కొంత వరకు విఫలమయ్యాడు. వారి పోరాటం ఎందుకు అనే విషయం ప్రేక్షకుడి మదిలో మెదిలినప్పుడు ఇదుగో వీళ్లను అక్కడి ప్రభుత్వం ఇంత క్రూరంగా హింసించింది కాబట్టి అని చెప్పడానికి బలమైన సీన్స్ లేకపోవడంతో దర్శకుడి ఎఫర్ట్ గొప్పగా ఉన్నా దాన్ని ఎఫెక్టివ్ గా చూపించడంలో విఫలమయ్యాడు. దీని వల్ల గొప్ప కథగా కనిపించాల్సిన సినిమా యావరేజ్ గా నిలిచిపోతుంది. అయినా రొటీన్ కు పూర్తి భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ ఏ వెర్రిమొర్రి వేషాలు లేకుండా తను చెప్పాలనుకున్న విషయాన్ని జెన్యూన్ గా చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేం.
ఆర్టిస్టుల పరంగా మనోజ్ బాగా చేశాడు. ఎటొచ్చీ శరణార్థుల లీడర్ గా కాస్త అతి కనిపిస్తుంది. కానీ అతని కళ్లల్లోని ఇంటెన్సిటీకి ఫిదా అయిపోదాం. లీడర్ గా కాలేజ్ స్టూడెంట్ గా మంచి వేరియేషన్ చూపించాడు. అనీషా అంబ్రోస్ ది పెద్ద పాత్ర కాదు. పెద్దగా ఆకట్టుకోలేదు కూడా. పోసాని బాగా చేశాడు. విక్టర్ పాత్రలో నటించిన దర్శకుడు అజయ్ పూర్తి మార్కులు కొట్టేశాడు. పాత్రకు తగ్గట్టుగా సెటిల్డ్ గా నటించాడు. ఇక పడవప్రయాణంలో కనిపించిన ఆర్టిస్టులంతా ది బెస్ట్ ఇచ్చారు. ఇతర పాత్రలన్నీ కామన్ గా చూసేవే.

టెక్నికల్ గా  : 
నేపథ్య సంగీతం బిగ్గెస్ట్ ప్లస్. అలాగే సినిమాటోగ్రఫీ. ఈ రెండు విభాగాలూ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాయి. మనోజ్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఓవర్ లోడెడ్ గా అనిపించినా.. ఆకట్టుకుంటాయి. మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. ఆర్ట్ వర్క్, సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అన్నీ సహజంగా కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకుంటాయి.

ఫైనల్ గా    : పోరాటలు, కష్టాలు, కన్నీళ్లూ.. కాస్త ఓవర్ డోస్డ్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com