రివ్యూ: లండన్‌ బాబులు

- November 16, 2017 , by Maagulf
రివ్యూ: లండన్‌ బాబులు

చిత్రం: లండన్‌ బాబులు 
నటీనటులు: రక్షిత్‌.. స్వాతి.. అలీ.. సత్యకృష్ణ.. సత్య.. ధన్‌రాజ్‌.. మురళీశర్మ.. అజయ్‌ఘోష్‌.. రాజా రవీంద్ర తదితరులు 
సంగీతం: కె 
కూర్పు: ఎస్‌బీ ఉద్ధవ్‌ 
కళ: విఠల్‌ కోనన్‌ 
ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు 
నిర్మాత: మారుతి 
దర్శకత్వం: బి.చిన్ని కృష్ణ 
సంస్థ: ఏవీఎస్‌ స్టూడియో 
విడుదల తేదీ: 17-11-2017
తమిళం నుంచి తెలుగులోకి చిత్రాలు రావడం కొత్తేమీ కాదు. కొన్ని అనువాదాల రూపంలో వస్తే.. మరికొన్ని రీమేక్‌ల రూపంలో వెండితెర తలుపు తడుతున్నాయి. తమిళంలో ఘన విజయం సాధించిన 'అండవన్‌ కట్టలై' చిత్రం అలాగే తెలుగులో 'లండన్‌ బాబులు' పేరుతో రీమేక్‌ అయింది. ఒకపక్క దర్శకుడిగా తనదైన ముద్రవేస్తూనే, మరోపక్క చిన్న సినిమాలను నిర్మిస్తూ కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు దర్శకుడు మారుతి. మారుతి టాకీస్‌, ఏవీఎస్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై 'లండన్‌బాబులు' చిత్రాన్ని నిర్మించారు. మరి తమిళ చిత్రంలా ఈ సినిమా ఆకట్టుకుందా? కొత్త హీరో రక్షిత్‌ ఎలా చేశాడు? స్వాతి ఏ మేర అలరించింది? చిన్న సినిమాలపై మారుతికి ఉన్న నమ్మకాన్ని ఈ చిత్రం మరోసారి నిలబెట్టిందా?
కథేంటంటే: గాంధీ(రక్షిత్‌)కి కష్టాలే కష్టాలు.. అమ్మ చనిపోతుంది.. నాన్నకు పక్షవాతం.. అక్కను బావ వేధిస్తుంటాడు. బావకు రూ.6లక్షలు అప్పు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ తీర్చడానికి లండన్‌ వెళ్లి డబ్బులు బాగా సంపాదించాలనుకుంటాడు గాంధీ. దాని కోసం హైదరాబాద్‌ వస్తాడు. వీసా, పాస్‌పోర్ట్‌ కోసం బ్రోకర్‌ను కలుస్తాడు. పెళ్లైన వాళ్లకు వీసాలు త్వరగా వస్తాయనే కారణంతో పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌లో తనకు పెళ్లైందని, భార్య పేరు సూర్యకాంతం అని రాస్తాడు. అలా రాయడం వల్ల అతనికి వచ్చిన ఇబ్బందులు ఏంటి? పాస్‌పోస్ట్‌లో సూర్యకాంతం అన్న పేరు తీయించడానికి కథానాయకుడు ఏం చేయాల్సి వచ్చింది? అసలు సూర్యకాంతం ఉందా? ఉంటే ఎవరు? అన్నది కథ!
 
ఎలా ఉందంటే: 'అండవన్‌ కట్టలై' అనే తమిళ చిత్రానికి రీమేక్‌ ఇది. చిన్న పాయింట్‌ను పట్టుకుని రెండు గంటల పాటు ప్రేక్షకులను కూర్చోబెట్టవచ్చా..! అన్నట్లు తమిళ సినిమా ఉంటుంది. తెలుగులోనూ అలాంటి ఆసక్తినే కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. పాస్‌పోర్ట్‌ వ్యవహారాలు.. వీసాకోసం పడే తిప్పలు.. సూర్యకాంతం అనే పేరుతో ఉన్న లింకులు ఈ కథను ఆసక్తిగా సాగేలా చేశాయి. కథానాయకుడు పాత్ర సీరియస్‌గా ఉన్నా, తన పక్కన ఉన్న సత్య కామెడీ చేయడంతో తొలి సగంలో కాలక్షేపానికి ఏ మాత్రం లోటు ఉండదు. దర్శకుడు సన్నివేశాలను సరదా సరదాగా రాసుకొన్నాడు. గాంధీ లండన్‌ వెళ్తాడా? లేదా? ఈ పాస్‌పోర్ట్‌ వ్యవహారం తెగేదెప్పుడు? అనే విషయాలు ప్రేక్షకుడిలో ఆసక్తిని కలిగిస్తాయి. ద్వితీయార్ధం కాస్త తడబడుతూ సాగుతుంది. సత్య లేని వెలితి కనిపిస్తుంది. పాస్‌పోర్ట్‌ సంపాదించడం ఎలా? కోర్టులో విడాకులు ఎలా ఇస్తారు? తదితర వ్యవహారాలను వాస్తవానికి దగ్గరగా చూపించారు. పతాక సన్నివేశాలకు ముందు కథలో క్రైమ్‌ ఎలిమెంట్స్‌ వస్తాయి. ఈ కథ థ్రిల్లర్‌గా మారుతుందేమోన్న భావన కలుగుతుంది. కానీ, మరీ లోతుగా వెళ్లకుండా తొందరగానే కథను సుఖాంతం చేశాడు దర్శకుడు. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయా పాత్రలను ముగించిన విధానం కూడా ఆకట్టుకుంటుంది.
 
ఎవరెలా చేశారంటే: కథానాయకుడికి ఇదే తొలి సినిమా. చూడడానికి తమిళ హీరోలా ఉన్నాడు. అక్కడక్కడా ఎక్స్‌ప్రెషన్స్‌ కాస్త ఇబ్బంది పెట్టినా, మొత్తానికి ఒకే అనిపిస్తాడు. స్వాతి అలవాటు ప్రకారం అల్లుకుపోయింది. డ్యూయెట్‌లు లేవుగానీ, కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉంది. పతాక సన్నివేశాల్లో స్వాతి నటన నచ్చుతుంది. ధనరాజ్‌ ఆకట్టుకుంటాడు. ఎప్పుడూ కమెడీయన్‌గా నవ్వించే ఆయన ఈసారి కంటతడి పెట్టిస్తాడు. ఈ సినిమాలో ప్రధాన బలాల్లో ఒకటి సత్య పంచిన వినోదం. తన డైలాగ్‌ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌ బాగా నవ్విస్తాయి. అలీ.. సురేఖవాణిల ట్రాక్‌ ఆకట్టుకుంటుంది. అజయ్‌ఘోష్‌.. మురళీ శర్మ తమ పాత్రలో ఒదిగిపోయారు. సంభాషణలు ఆకట్టుకుంటాయి. శ్యామ్‌ కె నాయుడు ఛాయ్రాగహణం.. ఉద్ధవ్‌ ఎడిటింగ్‌ బాగా చేశారు. ఓ తమిళ సినిమాను ఎక్కువ మార్పులు చేయకుండా తెలుగు నేపథ్యానికి సరిగ్గా సరిపోయేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు చిన్నికృష్ణ సఫలమయ్యారు.
బలాలు 
+ ఆసక్తికరమైన కథనం 
+ వినోదం 
+ పాత్రధారుల నటన
బలహీనతలు 
- కాస్త తడబడిన ద్వితీయార్ధం
చివరిగా: 'లండన్‌ బాబులు'ను ఓ సారి చూసిరావచ్చు.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com