ఫేస్‌ యోగా

- November 26, 2017 , by Maagulf
ఫేస్‌ యోగా

శారీరక ఫిట్‌నెస్‌తో పాటు ఒత్తిడిలేని జీవితాన్ని గడిపేందుకు సంప్రదాయ, ఆధునిక వ్యాయామ పద్ధతులెన్ని ఉంటే అన్నింటినీ ప్రయత్నిస్తున్న కాలం ఇది. వాటన్నిట్లో యోగా మీదే కొంచెం ఎక్కువ ఆసక్తి ఉందని చెప్పాలి. యోగాలో ఇప్పటికే మీరు పలురకాల పేర్లు వినీ, చేసీ ఉంటారు. ఆ జాబితాలో ఇప్పుడు మరోటి వచ్చిచేరింది. దాని పేరు ‘ఫేస్‌ యోగా’. శరీరంలో అన్ని భాగాలకు ఉన్నట్లే ముఖం కోసం ప్రత్యేకంగా ఉన్న యోగా ఇది. ‘‘ఈ యోగా చేస్తే వాతావరణ పరిస్థితులు, మానసిక ఒత్తిళ్ల వల్ల పాడయిపోయిన ముఖచర్మం బాగుపడుతుంది. వయసు మీరకుండానే వచ్చిపడే వృద్ధాప్యపు ఛాయలు దరిచేరవు. ముఖచర్మం కాంతివంతంగా, యవ్వనంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మీదట ‘బ్యూటీపార్లర్ల’కి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ముఖాన్ని అందంగా ఉంచుకోవచ్చు’’ అంటున్నారు యోగా ఎక్స్‌పర్ట్‌ మాన్సి గులాటి. వ్యాయామం చేసేందుకు టైం దొరకడం లేదనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఈ యోగా చేయొచ్చు అంటున్నారామె.

కాలుష్యం, తినే తిండి, ఒత్తిడి, నిద్రలేమి వంటి వాటి వల్ల ముఖం మీద మొటిమలు వస్తాయి, చర్మం నిగారింపు తగ్గిపోయి పేలవంగా మారుతుంది. వీటితోపాటు కొందరికి ముఖం ఉబ్బినట్టు (బ్లోటెడ్‌ ఫేస్‌)అవుతుంది. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలన్నా, ఇప్పటికే వాటి బారిన పడినా... ఫేస్‌యోగాలో ఈ రెండు పద్ధతుల్నీ ప్రయత్నించి చూడండి. అవి బెలూన్‌ భంగిమ, హాఫ్‌బెలూన్‌ భంగిమ.

బెలూన్‌ భంగిమ: చూపుని నేరుగా ఉంచి, బెలూన్‌ ఊదేప్పుడు గాలిని బుగ్గల నిండుగా ఎలా నింపుకుంటామో అలాగే రెండు బుగ్గల నిండుగా గాలిని బంధించాలి. నోటిని చేతి వేళ్లతో సున్నితంగా అదిమి ఉంచాలి. ఈ భంగిమలో పది సెకన్లు ఉండాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి. ఒక్కోసారి పదిసెకన్ల చొప్పున మూడుసార్లు చేయాలి. ఒకసారి చేసిన తరువాత కొంత విశ్రాంతి తీసుకుని మళ్లీ చేయాలి.
ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ వృద్ధిచెందుతుంది. ముఖంలో చిన్న కండరాలు 57 ఉంటాయి. ఈ వ్యాయామం వల్ల అవన్నీ సంకోచించి రిలాక్స్‌ అవుతాయి. ఇది చేయడం వల్ల ఉబ్బిపోయి లావుగా కనిపించే ముఖం కొద్దిరోజుల్లోనే ఉబ్బు తగ్గిపోయి మామూలుగా అవుతుంది.
హాఫ్‌ బెలూన్‌ భంగిమ: ఇది చేసేటప్పుడు కూడా నేరుగా చూస్తూ ఒక బుగ్గవైపు గాలి నింపుకోవాలి. మరో బుగ్గను చేతివేళ్లతో నొక్కాలి(ఫోటోలో చూపించిన విధంగా). పది సెకన్ల తరువాత గాలిని బయటికి వదిలి విశ్రాంతి తీసుకోవాలి. ఇలా మూడుసార్లు ఒక బుగ్గవైపు చేసిన తరువాత మరో బుగ్గలో గాలి నింపుకుని రెండో బుగ్గతో కూడా అలాగే చేయాలి. పదేసి సెకన్ల చొప్పున రెండువైపులా మూడుసార్లు చేయాలి. ఈ వ్యాయామం చేసేటప్పుడు కూడా నెమ్మదిగా శ్వాసించాలి.

స్నాక్స్‌కి దూరం...
ఈ వ్యాయామాలతో పాటు ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి... మంచినీళ్లు బాగా తాగాలి. సాయంత్రం ఐదు గంటల తరువాత నూనెతో కూడిన ఆహారపదార్థాలు తినకుండా ఉండాలి. ఈ మధ్య రెడీమెడ్‌ స్నాక్స్‌ - వేఫర్లు, నమ్‌కీన్లు తినడం బాగా పెరిగిపోయింది. వాటిలో ఉండే సోడియం శరీరంలోకి నీటిని పంపడం వల్ల ముఖం ఉబ్బుగా కనిపిస్తుంది. అందుకని వీటికి గట్టిగా నో చెప్పాలి. 

మంచి కొవ్వు అంటే ఆలివ్‌, రిఫైన్డ్‌ పంచదార, ప్రోటీన్లను నింపుకున్న సోయా, పనీర్‌ వంటివి. వీటిని తినొచ్చు. తక్కువ కొవ్వున్న పాలు తాగొచ్చు. 

ముఖం ఉబ్బు తగ్గాలంటే లవంగం నానపెట్టిన నీళ్లు తాగాలి. దానిమ్మపండు తినాలి.
అరటిపండు తింటే కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. చాలామంది అరటిపండు తింటే లావెక్కుతామని తినకుండా ఉంటారు. కాని పొట్ట దగ్గరున్న కొవ్వును కరిగించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. పైన చెప్పిన రెండు వ్యాయామాలు చేసి ఆహార జాగ్రత్తలు పాటిస్తే ముఖం నాజూకుగా, లేతగా తయారవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com