ఇంద్రసేన చిత్రం రివ్యూ

- November 30, 2017 , by Maagulf
ఇంద్రసేన చిత్రం రివ్యూ

 రివ్యూ: 
చిత్రం: ఇంద్రసేన 
నటీనటులు: విజయ్‌ ఆంటోని.. డయానా చంపికా.. మహిమ.. జ్యువెల్‌ మ్యారీ.. రాధారవి.. కాళీ వెంకట్‌ తదితరులు 
సంగీతం: విజయ్‌ ఆంటోని 
ఛాయాగ్రహణం: దిల్‌రాజ్‌ 
ఎడిటింగ్‌: విజయ్‌ ఆంటోని 
నిర్మాత: ఫాతిమా విజయ్‌ ఆంటోని, రాధికా శరత్‌కుమార్‌ 
దర్శకత్వం: జి.శ్రీనివాసన్‌ 
సంస్థ: విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఆర్‌ స్టూడియోస్‌ 
విడుదల తేదీ: 30-11-2017
'న కిలీ' చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. ఇక 'బిచ్చగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న ఆయన నుంచి ఓ కొత్త సినిమా వస్తోందంటే ఏదో ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. 'భేతాళుడు', 'యమన్‌' చిత్రాలే అందుకు ఉదాహరణ. తాజాగా మరో విభిన్న కథతో 'ఇంద్రసేన' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అన్నదమ్ముల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విజయ్‌ ఆంటోని గత చిత్రాల తరహాలోనే ఉందా? ఇంతకీ 'ఇంద్రసేన' ఎవరు? ఒకరా? ఇద్దరా?
 
కథేంటంటే: ఇంద్రసేన(విజయ్‌ ఆంటోని), రుద్రసేన(విజయ్‌ ఆంటోని) కవల పిల్లలు. ఇంద్రసేన ఎలిజెబెత్‌ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి తన కళ్లముందే చనిపోవడంతో మద్యానికి బానిసవుతాడు. రుద్రసేన ఓ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తుంటాడు. రుద్రసేనకు రేవతి(డయానా చంపిక)అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. ఇంద్రసేన తన స్నేహితుడి కోసం రూ.6లక్షలు అప్పు చేస్తాడు. ఒక చిన్న అప్పు ఈ కుటుంబాన్ని కష్టాల్లో పడేస్తుంది. ఇంద్రసేన జైలు పాలు అవుతాడు. ఏడేళ్ల తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చిన తనకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ఇంద్రసేన జైల్లో ఉండగా, రుద్రసేన ఏం చేశాడు? ఎలా మారాడు? అన్నదే కథ.
ఎలా ఉందంటే: ఇది ఒక అన్నదమ్ముల కథ. ఇందులో రకరకాల ఎమోషన్స్‌ జోడించాడు దర్శకుడు. యాక్షన్‌, సెంటిమెంట్‌లతో కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన అన్ని రకాల మసాలాలను ఇందులో మేళవించాడు. విజయ్‌ ఆంటోని సినిమాలన్నీ ఓ కొత్త నేపథ్యంలో సాగుతాయన్నది తెలిసిందే. 'ఇంద్రసేన' కూడా అలాగే మొదలవుతుంది. అతి మంచితనం వల్ల ఇంద్రసేన ఎలా కష్టాలు పడ్డాడు. ఆ మంచి తనాన్ని వదిలేసి రుద్రసేన ఎలా ఎదిగాడు? అన్నది ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు. ఈ కథకు ద్వితీయార్ధం చాలా కీలకం. మొత్తం ఒక యాక్షన్‌ మోడ్‌లో సాగుతుంది. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలన్నీ ఆకట్టుకుంటాయి. దర్శకుడు శ్రీనివాసన్‌ ఈ కథలో ఎక్కువ విషయాలను చెప్పాలనుకున్నాడు. త్యాగాలు కూడా ఎక్కువైపోయాయి. అవన్నీ సగటు ప్రేక్షకుడిని ఏ మేరకు అలరిస్తాయన్నది చూడాలి. అన్నదమ్ముల కథలు మనం చాలా చూశాం. వాటితో పోలిస్తే 'ఇంద్రసేన' కాస్త కొత్తగా ఉంటుంది. కాకపోతే.. వినోదం లేకపోవడం సినిమా అంతా సీరియస్‌ మోడ్‌లో సాగడం.. తమిళ నేటివిటీకి దగ్గరగా ఉండటం కాస్త ప్రతికూలంగా మారింది.
 
ఎవరెలా చేశారంటే: ఇంద్రసేన, రుద్రసేన రెండు పాత్రలను పోషించాడు విజయ్‌ ఆంటోని. అతని పాత్రలన్నీ కాస్త గంభీరంగా ఉంటాయి. ఈ సినిమాలోనూ అదే దారిలో నడిచాయి. విజయ్‌ ఆంటోని మినహాయిస్తే మిగిలిన వారందరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులే. కాకపోతే ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. కథానాయికలు ముగ్గురి నటనా ఆకట్టుకుంటుంది. ఇంద్రసేన ప్రేమించిన ఎలిజెబెత్‌ పాత్రను దర్శకుడు తెరపై చూపించలేదు. బహుశా కథకు అవసరం లేదనుకున్నాడేమో. అయితే, అన్నదమ్ముల కథలో ఓ కొత్త కోణాన్ని చూపించాలని ప్రయత్నించాడు. అందులో కొంతమేర విజయం సాధించాడు. అయితే మరీ వాస్తవికతకు దగ్గరగా వెళ్లడం తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. సంగీతం, ఛాయాగ్రహణం, మాటలు చక్కగా కుదిరాయి. 'బిచ్చగాడు'లాంటి సినిమాను అందించిన విజయ్‌ ఆంటోని నుంచి ఆ స్థాయి కథ, కథనాలనే ఆశిస్తారు ప్రేక్షకులు. అలాంటి ఎలిమెంట్స్‌ను మరికొన్ని జోడిస్తే బాగుండేది.
బలాలు 
+ విజయ్‌ ఆంటోని 
+ సాంకేతిక బృందం పనితీరు 
+ పతాక సన్నివేశాలు
బలహీనతలు 
- తమిళ నేటివిటీ
చివరిగా: కవల సోదరుల కథ 'ఇంద్రసేన' 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com