'జవాన్' చిత్రం రివ్యూ

- November 30, 2017 , by Maagulf
'జవాన్' చిత్రం రివ్యూ

రివ్యూ: 
చిత్రం: జవాన్‌ 
నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌.. మెహరీన్‌.. ప్రసన్న.. సత్యం రాజేశ్‌.. కోట శ్రీనివాసరావు తదితరులు 
సంగీతం: తమన్‌ 
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌ 
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌ 
నిర్మాత: కృష్ణ 
సమర్పణ: దిల్‌ రాజు 
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బీవీఎస్‌ రవి 
సంస్థ: అరుణాచల్‌ క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 01-12-2017
మె గా ఫ్యామిలీ నుంచి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చినా యూత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిధరమ్‌తేజ్‌. అయితే ఇటీవల కాలంలో ఆయన నటించిన 'తిక్క', 'విన్నర్‌', 'నక్షత్రం' చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బీవీఎస్‌ రవి చెప్పిన కథకు తేజూ పచ్చజెండా వూపారు. రవి గతంలో దర్శకత్వం వహించిన 'వాంటెడ్‌' కూడా ఆకట్టుకోలేకపోయింది. అయినా, రవి చెప్పిన కథపై నమ్మకంతో తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన, ఓ బాధ్యతాయుతమైన పాత్రను ఎంచుకున్నాడు సాయిధరమ్‌తేజ్‌. మరి వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'జవాన్‌' ఎలా ఉన్నాడు? అతని లక్ష్యం ఏంటి? చివరికి దాన్ని చేరుకోగలిగాడా?
కథేంటంటే: జై (సాయిధరమ్‌తేజ్‌), కేశవ(ప్రసన్న) మంచి స్నేహితులు. జై నిజాయతీగా ఉంటాడు. దేశమంటే ఇష్టం. కేశవ తన స్వార్థం తాను చూసుకుంటూ ఉంటాడు. భిన్న మనస్తత్వాల వల్ల వీరిద్దరూ చిన్నప్పుడే విడిపోతారు. జై బాగా చదువుకుని డీఆర్‌డీలో శాస్త్రవేత్తగా చేరాలనేది అతని ఆశయం. అందుకోసం కష్టపడుతుంటాడు. కేశవ పెద్దవాడయ్యాక మాఫియాతో చేతులు కలుపుతాడు. డీఆర్‌డీలో ఆక్టోపస్‌ మిసైల్‌ తయారవుతుంది. దాన్ని కాజేసి విదేశాలకు అమ్మేయాలని చూస్తుంటాడు కేశవ. ఆ ప్రయత్నాన్ని జై ఎలా తిప్పి కొట్టాడు? కేశవను ఎలా అడ్డుకున్నాడన్నదే 'జవాన్‌' కథ.
ఎలా ఉందంటే: ఇద్దరు బలమైన, తెలివైన వాళ్ల మధ్య సాగే మైండ్‌ గేమ్‌ కాన్సెప్ట్‌ ఇది. ఒకరికి దేశభక్తి ఉంటే.. ఇంకొకరు తన స్వార్థం కోసం దేశానికి ద్రోహం చేయాలని చూసే వ్యక్తి. ఇది ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్‌ కథ. ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తులు.. పై ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతినాయకుడు ఎప్పుడైతే బలవంతుడవుతాడో అప్పుడే కథానాయకుడిని ఇంకా బలంగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ కథలో ఆ అవకాశం దక్కింది. హీరో-విలన్ల మధ్య జరిగే సన్నివేశాలు ఈ కథకు బలం. వాటిని దర్శకుడు చక్కగా రాసుకొన్నాడు. ఆక్టోపస్‌ మిసైల్‌ ప్రతినాయకుడికి దక్కకుండా కథానాయకుడు చేసే ప్రయత్నాలు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధం మొత్తం హీరో-విలన్ల మధ్యే సాగుతుంది. సాధారణంగా కథానాయకుడు.. ప్రతినాయకుడి ఇంట్లోకి వెళ్లి అక్కడి నుంచి కథను నడిపిస్తుంటాడు. కానీ, అందుకు భిన్నంగా ఇందులో కథానాయకుడి ఇంట్లోకి ప్రతినాయకుడు వచ్చి చేరతాడు. శత్రువు ఇంట్లో ఉన్నా సరే అతని గురించి తెలుసుకోవడానికి పోరాడుతుంటాడు కథానాయకుడు. వాటికి సంబంధించిన సన్నివేశాల్లో లాజిక్‌ ఎక్కడా మిస్‌ కాకుండా దర్శకుడు బీవీఎస్‌ రవి రాసుకోగలిగాడు. హీరోకు విలన్‌ ఎప్పుడు దొరుకుతాడన్న ఆసక్తి కలిగించాడు. అయితే ప్రధాన కథకు హీరో ప్రేమ కథ బ్రేక్‌లు వేస్తుంటుంది. పాటల పరిస్థితీ అంతే. సరదాగా నవ్వుకోవడానికి ఒక్క సన్నివేశం కూడా లేదే అనిపిస్తుంది. విశ్రాంతి ముందు ఘట్టం, విలన్‌ను హీరో పట్టుకునే యత్నాలు దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి. అయితే ఆక్టోపస్‌ మిసైల్‌, ప్రాజెక్టు 3 తదితర వ్యవహరాలు సామాన్య ప్రేక్షకుడికి కొంచెం అర్థం కాకపోవచ్చు. పతాక సన్నివేశాలు ఇంకాస్త ఇంటెలిజెంట్‌గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే: ఇప్పటివరకూ సరదా సరదాగా, అల్లరి అబ్బాయి పాత్రల్లో నటించిన సాయిధరమ్‌తేజ్‌ తొలిసారి ఓ బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించాడు. అతని లుక్‌, డైలాగ్‌ డెలివరీలో మార్పు కనిపించింది. తనదైన హుషారు తగ్గినప్పటికీ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ చేయగలిగాడు. గెలుపు, ఓటమి గురించి చెప్పే సందర్భంలో సాయి నటన బాగుంది. మెహరీన్‌ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. చాలా బొద్దుగా కనిపించింది. ప్రసన్నది కచ్చితంగా ఆకట్టుకునే పాత్ర. 'ధ్రువ'లో అరవిందస్వామి పాత్రను ఎలా గుర్తుంచుకున్నారో ఇందులో ప్రసన్న పాత్రను అలాగే గుర్తుంచుకుంటారు. తెలుగులో అతనికి అవకాశాలు పెరుగుతాయి. హీరో-విలన్ల మధ్య నడిచే డ్రామా కావడంతో మిగిలిన ప్రాతలకు అంత ప్రాధాన్యం లేదు.
సాంకేతికంగా: తమన్‌ పాటల్లో 'బుగ్గంచున' శ్రావ్యంగా వినిపించింది. యాక్షన్‌ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. వాటిల్లో కూడా దర్శకుడు బీవీఎస్‌ రవి తన ఇంటెలిజెన్స్‌ను చూపించడానికి ప్రయత్నించాడు. స్క్రీన్‌ప్లే ప్రధానమైన కథ ఇది. మైండ్‌గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలను బాగా రాసుకోగలిగాడు. మరీ ముఖ్యంగా డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. దేశభక్తికి సంబంధించిన సంభాషణలు అలరిస్తాయి. కె.వి.గుహన్‌ కెమెరా, నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు 
హీరో-విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు 
సంభాషణలు 
ప్రసన్న నటన
బలహీనతలు 
- వినోదం పాళ్లు తగ్గడం 
- పాటలు 
చివరిగా: 'జవాన్‌' ఆడే మైండ్‌గేమ్‌ ఇది! 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com