భారత టెస్టు చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు..!

- December 07, 2017 , by Maagulf
భారత టెస్టు చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు..!

భారత టెస్టు చరిత్రలో టీమ్‌ఇండియా సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. ఎంతో మంది దిగ్గజ కెప్టెన్లు, ఆటగాళ్లకు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును విరాట్‌సేన సాధించింది. ఒకటి, రెండు సిరీస్‌లు గెలువడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఏకంగా వరుసగా తొమ్మిది సిరీస్‌లను గెలిచి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల సరసన భారత్ చోటు సంపాదించింది. 2015లో శ్రీలంకతో మొదలైన జైత్రయాత్రకు... మళ్లీ లంక వరకు కొనసాగించి తొమ్మిది సిరీస్ రికార్డుల ఘనతను సగర్వంగా అందుకుంది. ఢిల్లీ టెస్టును డ్రా చేసుకోవడం ద్వారా లంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నూ 1-0తో కైవసం చేసుకుని ఐదు రోజుల ఫార్మాట్‌లో రారాజులం మేమే అని చాటి చెప్పింది.

తొలి నాలుగు రోజులు బౌలర్లకు ఊహించని రీతిలో సహకారం అందించిన ఫిరోజ్ షా కోట్ల పిచ్.. ఆఖరి రోజు మాత్రం భారత్‌కు చేయిచ్చింది. విజయానికి ఏడు వికెట్లు మాత్రమే కావాల్సిన దశలో టీమ్‌ఇండియా బౌలర్లు ఎంత శ్రమించినా.. లంకేయులను పడగొట్టలేకపోయారు. దీంతో బుధవారం భారత్, శ్రీలంక మధ్య మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విరాట్‌సేన 1-0తో కైవసం చేసుకుంది. 410 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చండిమల్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో 103 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసింది. 

అయితే తొమ్మిది సిరీస్ విజయాల రికార్డుతో జోరుమీదున్న కోహ్లీ సేనకు అసలు పరీక్ష ముందు ఎదురుకానుంది. టీమిండియా జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికాతో వారి సొంతగడ్డపై సిరీస్ ఆడబోతోంది. అక్కడ కూడా విజయయాత్ర కొనసాగించి.. కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాలని సగటు భారతీయ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, అది అనుకున్నంత సులభం కాదని సీనియర్ ప్లేయర్లు అంచనా వేస్తున్నారు. టీమిండియా ఇన్నాళ్లూ ఆడింది ఒకెత్తయితే..రాబోయే రోజుల్లోనే కోహ్లీకి అసలు పరీక్ష ఎదురవుతుందని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com