రాహుల్‌ గాంధీకు 16న పట్టాభిషేకం

- December 10, 2017 , by Maagulf
రాహుల్‌ గాంధీకు 16న పట్టాభిషేకం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈనెల 16న పగ్గాలు చేపట్టనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సుదీర్ఘ కాలం పనిచేసిన సోనియాగాంధీ లాంఛనంగా పార్టీ అధ్యక్ష పగ్గాలు తన తనయుడు రాహుల్‌కు అప్పగించనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అయినప్పటికీ నామినేషన్ ఉహసంహరణ గడువు సోమవారంతో ముగియనుంది. దీంతో రాహుల్ ఎన్నికను సోమవారంనాడు ఏఐసీసీ లాంఛనంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధారిటీ చైర్మన్ ఎం.రామచంద్రన్, సీఈఏ సభ్యులు మధుసూధన్ మిస్త్రీ, భువనేశ్వర్ కటియాలు రాహుల్ ఒక్కరే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినట్టు ప్రకటించబోతున్నారు. అయితే ఈనెల 16న సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతల సమక్షంలో పార్టీ అధ్యక్ష పదవి పదవి నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను రాహుల్‌కు అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలను కలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్‌ స్వీకరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు రాహుల్ పట్టాభిషిక్తుడు కానున్నారన్న సమాచారంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి.

50 ఏళ్ల పాలన...చేతిలో 5 రాష్ట్రాలు కాగా, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 50 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి 47 ఏళ్ల నడి వయస్కుడైన రాహుల్ పగ్గాలు చేపట్టడం ద్వారా పార్టీలో నవశకానికి నాందీ పలకినట్టయిందని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. ఇటీవల వరుస ఎన్నికల్లో పరాజయాలు చవిచూస్తూ కాంగ్రెస్ ప్రాభవం కొడిగడుతున్న తరుణంలో పార్టీని తిరిగి పట్టాలెక్కించాల్సిన గురుతర బాధ్యత ప్రస్తుతం రాహుల్‌పై ఉంది. ఒకప్పుడు ఇంచుమించు దేశాన్నంతటినీ శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం ఐదు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో మాత్రమే అధికారంలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com