ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చు హెచ్‌1 బీ ఉంటే

- December 13, 2017 , by Maagulf
ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చు హెచ్‌1 బీ ఉంటే

వాషింగ్టన్‌: హెచ్‌1బీ వర్క్‌వీసాదారులకు శుభవార్త. వీటిని కలిగిఉన్నవారు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకోవచ్చని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగం స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన ఐటీ వృత్తినిపుణులతోపాటు అగ్రరాజ్యం వచ్చినవారిలో అనేకమంది హెచ్‌1 బీ వీసా కోసం నానాతంటాలు పడుతుండడం తెలిసిందే. ఇదొక నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా. సాంకేతికపరంగా లేదా సైద్ధాంతికంగా నిపుణులైన విదేశీయులు ఈ వీసా కలిగిఉన్నట్టయితే అమెరికా కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. భారత్, చైనా దేశాలకు చెందిన వేలాదిమందిని అమెరికా కంపెనీలు ఈ వీసా ప్రాతిపదికన ప్రతి ఏడాది ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నియమిస్తుండడం సర్వసాధారణం.

‘సాధారణంగా హెచ్‌1బీ వీసాదారులు ఎన్ని ఉద్యోగాలైనా చేసుకునేందుకు వీలవుతుంది. అయితే ప్రతి ఒక్క ఉద్యోగానికి అనుమతి పొందిఉండాలి’ అని అమెరికా సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) స్పష్టం చేసింది. అయితే ఉద్యోగి విధుల్లో చేరేముందు ఇందుకు సంబంధించి సంబంధిత సంస్థ యజమాని....యూఎస్‌సీఐఎస్‌కి 1–129 ఫారమ్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అందులో సదరు ఉద్యోగి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఇది కొత్త నిబంధన కాకపోయినప్పటికీ అతికొద్దిమందికి మాత్రమే తెలుసు. విదేశాలనుంచి ఇక్కడికి రాదలుచుకున్నవారికి ఈ సంస్థ హెచ్‌1బీ వీసా దరఖాస్తులను స్వీకరించి, పరిశీలించి, ఖరారు చేస్తుంది.  

ఏటా 65 వేలమందికే...
అమెరికా సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ప్రతి ఏడాది 65 వేలమందికి మాత్రమే ఈ వీసాలను మంజూరు చేస్తుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు ఇందుకు అర్హులు. ఇక గ్రీన్‌కార్డులు కలిగిఉన్నవారిలో 85 శాతం మంది ఇప్పటికే ఇక్కడ స్థిరపడిపోయారు.  


ఈబీ5 వీసాల గడువు పొడగింపు
అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి శుభవార్త. ‘గోల్డెన్‌ వీసా’గా పరిగణించే ఈబీ5 వీసాల దరఖాస్తుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. అధ్యక్షుడిగా ట్రంప్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్‌1–బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో ఈబీ5 వీసాలకు ఆదరణ పెరిగింది. ఈ వీసా ప్రోగామ్‌ను 1990లో యూఎస్‌ కాంగ్రెస్‌ తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టి నిరుద్యోగ అమెరికన్‌ యువతకు ఉపాధి కల్పించాలి. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని అనుకునేవారికి ఇది నిజంగానే బంగారం లాంటి అవకాశం. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్‌1–బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు. తమ కుటుంబాలతో సహా అక్కడ స్థిరపడాలనుకునే భారతీయులకు ఈబీ5 వీసా అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా వీసాలను పొందడంలో భారతీయులు ఆరో స్థానంలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com