రెండు గంటల్లోనే వెంకన్న దర్శనం

- December 17, 2017 , by Maagulf
రెండు గంటల్లోనే వెంకన్న దర్శనం

శ్రీవారి దర్శనం కోసం ఇకపై గంటల తరబడి నిరీక్షించాల్సిన పనిలేదు.. క్యూలైన్లలో కష్టాలు పడాల్సిన అవసరం అసలే లేదు.. కేవలం రెండు గంటల్లోనే వెంకన్నను దర్శించుకుని బయటకు రావచ్చు.. ఈ సరికొత్త విధానానికి టీటీడీ ఈరోజు నుంచి తెరతీయనుంది.. ఈరోజు నుంచి సర్వ దర్శనం భక్తులకూ టైమ్‌ స్లాట్‌ విధానాన్ని అమలు చేయనుంది. నిర్దేశించిన సమయంలోగా దర్శనం పూర్తిచేసుకునేలా ఏర్పాట్లు చేసింది.

ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు, కాలినడకన వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్నారు అధికారులు.. ఈ విధానం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుండటంతో, కొత్త ప్రయోగానికి తెరతీశారు. సర్వ దర్శనం భక్తులకు రోజుకు 30వేల వరకు టోకెన్లు టైమ్‌స్లాట్‌ పద్ధతిన జారీచేయనుంది. ఇందుకోసం తిరుమలలో 14 కేంద్రాల్లో 117 కౌంటర్లను ఏర్పాటు చేసింది. బార్‌ కోడింగ్‌ విధానం ద్వారా భక్తులకు టోకెన్లు జారీచేయనుంది. నిర్దేశించిన సమయంలో క్యూలైన్‌లోకి ప్రవేశించడం ద్వారా రెండు గంటల్లోనే దర్శనం పూర్తిచేసుకునే అవకాశం ఉంటుంది.

రెండు నెలల నుంచి దీనిపై కసరత్తు చేసిన అధికారులు.. టికెట్ల జారీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈనెల 23 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ప్రయోగం సక్సెస్‌ అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్‌ నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనుంది. ఇక టైమ్‌ స్లాట్‌ విధానంలో దర్శనానికి వచ్చే భక్తులు ఆధార్‌ కార్డును తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com