ఇడ్లీతో మంచూరియా

- December 23, 2017 , by Maagulf
ఇడ్లీతో మంచూరియా

కావలసిన పదార్థాలు: ఇడ్లీలు - ఐదు, మైదాపిండి - ఒ టేబుల్‌ స్పూను, మొక్కజొన్న పిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, ఫుడ్‌కలర్‌ - చిటికెడు, ఉల్లిపాయ - రెండు, క్యాప్సికమ్‌ - ఒకటి, టమోట - ఒకటి, అల్లం ముక్క - చిన్నది, వెల్లుల్లి రేకలు - నాలుగు, కారం - ఒక టీ స్పూను, ధనియాల పొడి - ఒక టీ స్పూను, గరంమసాలా - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 

తయారుచేయు విధానం: ముందుగా ఇడ్లీలను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదాపిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, ఫుడ్‌కలర్‌, కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. పొయ్యిమీద కడాయి పెట్టి సరిపడా 
నూనె పోసి బాగా కాగాక పిండిలో ముంచిన ఇడ్లీ ముక్కల్ని నూనెలో వేసి ఎర్రగా వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, టమోట ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగించి చల్లారిన తర్వాత మిక్సీలో ముద్ద చేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పొయ్యిమీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేగించాలి. తర్వాత రుబ్బిపెట్టుకున్న మసాలా ముద్ద వేసి బాగా కలపాలి. తర్వాత వేగించిన ఇడ్లీ ముక్కలు వేసి సన్నమంటపై మరికాసేపు వేగించి దించేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com