మా సినిమా ఇది, బొబ్బట్టులాగా ఉంటుంది - నాగార్జున

- January 12, 2018 , by Maagulf
మా సినిమా ఇది, బొబ్బట్టులాగా ఉంటుంది - నాగార్జున

2017లో 'రారండోయ్ వేడుక చూద్దాం', 'హలో' వంటి హిట్‌ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌. తాజాగా రాజ్‌తరుణ్‌ హీరోగా, చిత్ర శుక్లా హీరోయిన్‌గా తెరకెక్కించిన చిత్రం `రంగులరాట్నం`. శ్రీరంజనిని దర్శకురాలిగా పరిచయం చేస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

నాగార్జున మాట్లాడుతూ.. ``అందరికీ హ్యాపీ న్యూ ఇయర్‌. సంక్రాంతి శుభాకాంక్షలు. `రంగుల రాట్నం` చిత్రాన్ని మా అన్నపూర్ణ వాళ్లు వడ్డించే సంక్రాంతి పొంగళి అని మేం అనుకుంటున్నాం. నేను సినిమా చూశాను. మా సినిమా ఇది. బొబ్బట్టులాగా ఉంటుంది. చాలా తీపిగా, చాలా బావుంటుంది. ఒక రియల్ ఫిల్మ్ ఇది. రియల్ అంశాలతో తీసిన సినిమా. తల్లీకొడుకుల మధ్య ఎమోషన్స్, ఒక కుర్రాడికి, అతనికి కాబోయే భార్యకు మధ్య వచ్చే సన్నివేశాలను చూస్తుంటే నా కళ్ల ముందే పాత్రలన్నీ కదులుతున్నట్టు అనిపించింది. లక్కీగా నాకు సంక్రాంతికి డేట్ దొరికింది. సినిమాను నెల రోజుల క్రితమే రెడీ చేసి పెట్టాం. సంక్రాంతికి లక్కీగా డేట్ దొరికే సరికి ఫ్రీజ్ చేశాం. ఫ్యామిలీస్ అందరూ కలిసి చూడదగ్గ సినిమా. నవ్వుకుంటూ, అప్పుడప్పుడూ కొంచెం కంటతడి పెడుతూ ప్రేక్షకులు చూస్తారు.

నాకు ఈ సినిమా కథ ఏడాది క్రితం చెప్పారు. ఏడాదిలో ఇంకో వంద కథలు వినుంటాను. అప్పుడు విని బావుంది ఈ కథ అని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియకి చెప్పాను. చేయొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అయితే ఆ తర్వాత కథని మర్చిపోయాను. రీసెంట్‌గా సినిమాను ప్రేక్షకుడిగానే చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రెజంట్ సర్‌ప్రైజ్‌లాగా అనిపించింది. లెంగ్త్ లు కాస్త ఎక్కువైతే తగ్గించమని చెప్పాను. అంతవరకే నేను ఇందులో పాల్గొన్నది. ఏదేమైనా మా సంస్థకు చాలా మంచి పేరు వస్తుంది. ఎవరు ఏం చేసినా క్రెడిట్ నాకే దక్కుతుంది కాబట్టి నాకు చాలా హ్యాపీ.

శ్రీరంజనికి దర్శకురాలిగా తొలి చిత్రమిది. ఎలా నెరేట్ చేసిందో అప్పుడు గుర్తులేదు. కానీ సినిమాను ఎక్స్ పీరియన్స్ గల డైరక్టర్‌గా బాగా తెరకెక్కించింది. ఎమోషన్స్ను.. మదర్ ఎమోషన్స్, అమ్మాయి ఎమోషన్స్ ని ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించింది. మేం రాజ్‌తరుణ్‌తో `ఉయ్యాల జంపాల` చేశాం. తను నేచురల్ యాక్టర్‌. చాలా బాగా చేస్తాడు. ఒక సీన్‌లో తల్లిని ప్రేమించే అబ్బాయిలాగా బిత్తరచూపులతో చేశాడు. నాకు రకరకాల విషయాలు గుర్తొచ్చాయి. అతని యాస ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. మా నాయిక చిత్ర సినిమాలోనూ చాలా అందంగా ఉంది. సినిమాలో అందరూ రియల్‌గా ఉన్నారు. అదే నాకు చాలా బాగా నచ్చింది. అందరికీ ఆల్ ది బెస్ట్. ప్రియదర్శి చాలా బాగా చేశాడు. తను ఈ సినిమాకు పెద్ద హైలైట్ అవుతాడు.

నేచురల్ టైమింగ్‌, నేచురల్ కామెడీ ఉన్న సినిమా ఇది. సితారగారు తల్లి పాత్రలో చాలా బాగా చేశారు. సితారకు, రాజ్‌తరుణ్‌కి మధ్య ఉన్న తల్లీ కొడుకుల రిలేషన్ షిప్ చాలా బాగా పండింది. ఆమె చాలా చక్కగా డబ్బింగ్ కూడా చెప్పారు. ఆమె ఎక్స్ ప్రెషన్స్ కి డబ్బింగ్ చాలా బాగా కుదిరింది. ఈ సంక్రాంతికి స్వీట్ లవ్లీ ఫిల్మ్ అవుతుంది. `రంగులరాట్నం`లాగా చక్కగా, హాయిగా చూడొచ్చు`` అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com