ఏయిరో ఇంజిన్ సీవోఈ హైదరాబాద్లో

ఏయిరో ఇంజిన్ సీవోఈ హైదరాబాద్లో

- సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న జీఈ, టాటా 
- ఏయిరో స్పేస్‌లో విస్తరించేందుకు తోడ్పాటు 
- డిసెంబరు నాటికి అందుబాటులోకి ప్లాంటు 
- తెలంగాణలో అన్ని సౌకర్యాలు కల్పించాం: కేటీఆర్‌ 
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: టాటా గ్రూప్‌, జీఈ ఏవియేషన్‌ సంస్థలు సంయుక్తగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయన్ను పపంచశ్రేణి ఏరో ఇంజిన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీవోఈ) నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. విమాన ఇంజిన్లకు అవసరమైన విడిభాగాలతో పాటు అత్యాధునిక విమాన యంత్రాల రూపకల్పన చేపట్టేందుకు గాను.. ఈ రెండు సంస్థలు కలిసి హైదరాబాద్‌లోని ఆదిభట్లలో ఉన్న ఏరోస్పేస్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టాటా సన్స్‌కు చెందిన ఏరో స్పేస్‌, డిఫెన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాల అధ్యక్షుడు బన్‌మల్‌ అగర్వాల్‌, జీఈ సౌత్‌ ఏషియా అధ్యక్షుడు విశాల్‌ వాన్‌చూలు పాల్గొన్నారు. ఈ సందర్భం పురస్కరించుకొని హెచ్‌ఐసీసీలో జీఈ ఏవియేషన్‌, టాటా గ్రూప్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు, రవాణ శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డితో పాటు ఎంపీ భూర నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఏరో ఇంజిన్ల తయారీలో టాటా అగ్రస్థానంలో ఉందని.. టాటాకు జీఈ కూడా తోడవడంతో సామర్థ్యం మరింత పెరగనుందన్నారు.

ఏరో ఇంజిన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు తెలంగాణను వేదికగా ఎంచుకోవడ ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏవియషన్‌ సంబంథిత పరిశ్రమల ఏర్పాటునకు గాను సర్కారు ఇప్పటికే రెండు ఏయిరో స్పేస్‌ సెంటర్లను, అయిదు ఎయిరో స్ట్రయిప్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. దేశంలో విమానయాన పరిశ్రమలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలను అందిపుచ్చు కొనేందుకు గాను తెలంగాణ సర్కారు అన్ని ప్రయత్నాలను చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను అందుబాటులో ఉంచేందుకు గాను పలు విద్యాసంస్థలు, కంపెనీల వారితో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్టుగా ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సంస్థల ఉత్సాహం చూస్తుంటే డిసెంబరు నాటికి ఈ కేంద్రం పూర్తిగా అందుబాటులోకి వచ్చి తొలి ఇంజిన్‌ను ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.

Back to Top