ఫేస్‌బుక్‌పై మండిపడుతున్న యూఎన్‌

- March 13, 2018 , by Maagulf
ఫేస్‌బుక్‌పై మండిపడుతున్న యూఎన్‌

జెనీవా : మయన్మార్‌లోని రోహింగ్య ముస్లింల విషయంలో ఫేస్‌బుక్‌ వ్యవహరించిన తీరును అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తప్పుబట్టింది. రోహింగ్యాలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి ఫేస్‌బుక్‌ వారధిగా ఉపయోగపడిందని మండిపడింది. మయన్మార్‌లో పర్యటించిన అంతర్జాతీయ నిజ నిర్ధారణ కమిటీకి చైర్మన్‌గా ఉన్న మార్జుకి దారుస్మాన్‌ మాట్లాడుతూ.. సోషల్‌ మీడియా అక్కడి పరిస్థితులను నిర్ణయించిందని తెలిపారు. ఆ సమయంలో మయన్మార్‌లో సోషల్‌ మీడియా అంటే ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్‌ అంటే సోషల్‌ మీడియా అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. భద్రత దళాల దాడుల వల్ల 65వేల మంది రోహింగ్యాలు గత ఆగస్టులో బంగ్లాదేశ్‌కు తరలిపోయారని, అలాంటి పరిస్థితుల్లో కూడా రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో వ్యాప్తి చెందుతున్న వివాదస్పద సమాచారాన్ని తొలగించడానికి మాత్రం ఆ కంపెనీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

 ఒకప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఫేస్‌బుక్‌ ప్రస్తుతం మృగంగా మారిందని కమిటీ పరిశీలకురాలు యంగీ లీ కూడా వ్యాఖ్యానించారు. మయన్మార్‌లో దాడులకు ఫేస్‌బుక్‌ ప్రచారమే కారణమని తెలిపారు. విద్వేషపూరిత వ్యాఖ్యల వ్యాప్తికి ఫేస్‌బుక్‌ దోహదపడిందన్నారు. మయన్మార్‌ రోహింగ్యాలపై మిలటరీ దాడులకు తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపారు. గతంలో ఇలాంటి వార్తలపై స్పందించిన ఫేస్‌బుక్‌,  తాజా వివాదంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com