ప్రాణభయంతో విమానం రెక్కలోంచి దూకేశారు

ప్రాణభయంతో విమానం రెక్కలోంచి దూకేశారు

డల్లాస్‌ : ప్రాణ భయంతో విమానం​ రెక్కలోంచి ప్రయాణికులు దూకేసిన ఘటన అల్‌బుకర్‌క్యూ ఇంటర్నేషనల్‌​ సన్‌పోర్ట్‌(మెక్సికో)లో చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో విమానం ల్యాండ్‌ కాగా..  పేలిపోతుందన్న భయంతో ప్రయాణికులు ఈ పనికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.  

సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం ఆదివారం రాత్రి ప్రయాణికులతో ఫోయెనిక్స్‌(అరిజోనా) నుంచి లవ్‌ ఫీల్డ్‌(డల్లాస్‌)కు బయలుదేరింది. అయితే కాసేపటికే క్యాబిన్‌లో ఏదో వాసన వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది విషయాన్ని పైలెట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలో వేడి ఎక్కువగా ఉందంటూ ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. క్యాబిన్‌లో పొగలు రావటం ప్రారంభం కాగా.. ప్రమాద సంకేతాలు కనిపించటంతో పైలెట్‌ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌కు సిద్ధమయ్యాడు.

అల్‌బుకర్‌క్యూ ఇంటర్నేషనల్‌​ సన్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయ్యింది. విమానం ల్యాండ్‌ అయ్యాక ప్రయాణికులంతా బయటకు వస్తున్న క్రమంలో.. ఇద్దరు ప్రయాణికులు మాత్రం విమానం రెక్క వద్ద ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ నుంచి రన్‌వే పైకి దూకేశారు. అది గమనించిన  ఓ ప్రయాణికుడు వారిద్దరూ అలా దూకటాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. సుమారు 8 అడుగుల ఎత్తు నుంచి దూకటంతో వారికి గాయాలైనట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ వేరే విమానంలో తరలించిన ఎయిర్‌వేస్‌.. గాయపడిన వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.  

Back to Top