తెలంగాణ లో 'రాజ్యసభ' ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధం

- March 22, 2018 , by Maagulf
తెలంగాణ లో 'రాజ్యసభ' ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధం

తెలంగాణ లో  రాజ్యస‌భ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్దమైంది. రేపు జ‌రిగే పోలింగ్ కోసం అసెంబ్లీలో కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. మూడు స్ధానాల‌కు న‌లుగురు అభ్యర్థులు పోటీ ప‌డుతున్నారు. సంఖ్యాప‌రంగా TRS బ‌లంగా ఉన్నా.. కాంగ్రెస్ అభ్యర్థి బ‌రిలో ఉండ‌టంతో పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. ముగ్గురు అభ్యర్థుల‌ను బ‌రిలో నిలిపిన అధికారపార్టీ పోలింగ్ రోజు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఉండేలా ఇప్పటికే మాక్ పోలింగ్ నిర్వహించింది.

TRS నుంచి జోగినిప‌ల్లి సంతోష్ కుమార్, ప్రకాశ్ ముదిరాజ్, లింగ‌య్య యాద‌వ్ నామినేష‌న్ వేశారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బ‌ల‌రాం నాయ‌క్ బ‌రిలో ఉన్నారు. మూడు స్థానాలు గెలుచుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన సంపూర్ణ మెజార్టీ టీఆర్ఎస్‌కు ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేల స‌భ్యత్వం ర‌ద్దు త‌ర్వాత స‌భ‌లో 117 మంది MLAలు ఉంటారు. ఈ లెక్క ప్రకారం ఒక్కొక్క రాజ్యస‌భ అభ్యర్థికి 30.25 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం TRSకి 83 మంది స‌భ్యుల బ‌లం ఉంది. ఏడుగురు స‌భ్యులున్న MIM కూడా TRSకే మ‌ద్దతిచ్చింది. కాంగ్రెస్ నుంచి TRSలో చేరిన వాళ్లు.. 19 మంది ఉన్నారు. వీరందరికీ కూడా హస్తం పార్టీ విప్ జారీ చేసింది. వీళ్లు కాకుండా CPMకి ఒక  స‌భ్యుడున్నారు. బీజేపీకి-5, టీడీపీకి ఇద్దరు MLAల బలం ఉంది. వీళ్లు అధికార TRSకు, కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశం లేదు. కానీ, ఉన్న సంఖ్యాబలంతోనే TRS గట్టెక్కుతుందని భావిస్తున్నారు. 

రాజ్యసభ ఎన్నిక‌ల పోలింగ్ రోజున ఎలాంటి త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా TRS పార్టీ.. ఎమ్మెల్యేల‌కు అవ‌గాహ‌న కార్యక్రమం నిర్వహించింది. MLAల‌ను మూడు గ్రూపులుగా విభ‌జించిన‌ట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రూప్‌లోని ఎమ్మెల్యేలు ఒక్కో అభ్యర్థికి ఓటు వేసేలా ప్లాన్ చేశారు. వీరిని సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రులకు అప్పగించారు. హ‌రీష్ రావు, KTR, క‌డియం శ్రీహ‌రి, జ‌గ‌దీష్ రెడ్డి, ఈటల రాజేంద‌ర్, తుమ్మల నాగేశ్వర్రావు ఈ ఎన్నిక‌ల పూర్తి భాత్యల‌ను చేప‌ట్టారు.

రేప‌టి పోలింగ్‌కు అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. ఓపెన్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంది. 5గంట‌ల‌కు కౌంటింగ్ చేసి, వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com