పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న శంషాబాద్ విమానాశ్రయం

- March 23, 2018 , by Maagulf
పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న శంషాబాద్ విమానాశ్రయం

శంషాబాద్‌:శంషాబాద్‌ విమానాశ్రయం పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుంది. ఈ పదేళ్లలో ఎన్నో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంది.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు, కొత్త కొత్త పాలసీలతో వారికి మరింత చేరువవుతోంది.. ప్రపంచంలోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఎయిర్‌పోర్టుగా అవతరించింది శంషాబాద్‌ విమానాశ్రయం. ఈ నేపథ్యంలో పదేళ్ల సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు జీఎంఆర్‌ యాజమాన్యం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వార్షికోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

ఆసియాలోనే తొలి గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయంగా దీనిని నిర్మించారు. పబ్లిక్‌ ప్రైవేటు భాగస్వామ్యంతో 30 నెలల్లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దింది జీఎంఆర్‌ సంస్థ. 12 మిలియన్‌ ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా నిర్మాణం చేపట్టింది. ఈ పదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా చేరింది. ఎయిర్‌పోర్టు అవసరాల కోసం స్వయంగా ఐదు మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను సైతం నెలకొల్పారు. దేశంలోనే తొలిసారిగా ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తూ ఈ-బోర్డింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ గత ఏడాది ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెకింగ్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 20 శాతం పెరగడంతో అందుకు తగ్గట్టుగా ఎయిర్‌పోర్టును విస్తరిస్తున్నారు. విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com