తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం

- March 31, 2018 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం

ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాలను అకాలవర్షాలు కుదిపేశాయి. విశాఖ జిల్లాలోని చోడవరం, పాడేరు, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. జి.మాడుగులలో పిడుగు పడడంతో చెట్టు కాలిపోయింది. పశువులు మృతి చెందాయి. చిత్తూరు, విజయనగరం, జిల్లాల్లోనూ ఓ మోస్తరు వాన పడింది. పిడుగులు పడే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. చిత్తూరు జిల్లాలోని ఐరాల, తిరుపతి రూరల్, సోమల, చంద్రగిరి ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. విజయనగరం జిల్లాలో పాచిపెంట, మెంటాడ ప్రాంతంలోనూ అప్రమత్తతో ప్రమాదం తప్పిందనే చెప్పాలి. రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితర ద్రోణి ఆవరించి ఉన్న నేపథ్యంలో.. మరో రెండ్రోజులు ఉత్తర కోస్తా, సీమల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారురు చెప్తున్నారు. 

అకాల వర్షాలు తెలంగాణను కూడా వణికించాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని  పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో పశువుల పాకలు, పాత ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. సిద్ధిపేటలో వడగళ్ల వాన కురిసింది. ఈ బీభత్సానికి వందల ఎకరాల్లో పంట ధ్వంసమైంది. ఒక్కసారిగా వడగళ్లు పడడంతో  రైతులు వణికిపోయారు. పిందెలు రాలిపోవడంతో మామిడి తోటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. వేములవాడ పట్టణంలో వడగళ్ల వర్షం కురిసింది. దీంతో రాజన్న ఆలయం ముందంతా నీళ్లు నిలిచిపోయాయి. బోయినిపల్లి, చందుర్తి మండలాల్లో కూడా వడగళ్లు పడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com