‘చీకటి రోజులు.. మోదీ విఫలం’

‘చీకటి రోజులు.. మోదీ విఫలం’

న్యూఢిల్లీ : మైనర్‌ బాలికలపై అత్యాచారాలు, హత్య ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న వేళ.. వేలాది మంది రోడ్డెక్కి.. లక్షలాది మంది సోషల్‌ మీడియా వేదికగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రిటైర్డ్‌ ఉన్నతాధికారుల బృందం కథువా-ఉన్నావ్‌ ఘటనలపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు. 

‘దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. ప్రజలకు కనీస భద్రత కూడా ఇవ్వలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. భారత రాజ్యాంగంలోని ప్రజాస్వామిక, లౌకికవాద, స్వేచ్ఛా విలువలు నానాటికీ క్షీణించిపోతున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిపై కొందరు పశువుల్లా హత్యాచారానికి పాల్పడటం.. పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో తెలియజేస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత మేం చూస్తున్న చీకటి రోజులు ఇవే. ఈ పరిస్థితులపై ప్రభుత్వం, బలహీనమైన రాజకీయ పార్టీలు, నేతలు స్పందించకపోవటం మేం గమనించాం’ అని లేఖలో వారు పేర్కొన్నారు. సుమారు 49 మంది సివిల్‌ సర్వీసెస్‌ మాజీ అధికారులు ఈ లేఖ రాసినట్లు సమాచారం.  

అంతేకాదు ప్రస్తుత అధికార గణంపై వారు లేఖలో విరుచుకుపడ్డారు.‘వారు వారి విధులను సక్రమంగా నిర్వహించటంలో విఫలం అయ్యారు’అని లేఖలో మాజీ అధికారులు ప్రస్తావించారు. ఉన్నావ్‌, కథువా, అ‍స్సాం, సూరత్‌.. ఇలా వరుస ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరోవైపు మెట్రో నగరాలతోపాటు పలు పట్టణాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలు చేపడుతున్నారు.

Back to Top