మోడీకి స్వీడన్‌లోనూ...'ప్రత్యేక హోదా' సెగ

- April 18, 2018 , by Maagulf

అమరావతి: భారత్-స్వీడన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం స్వీడన్ లో పర్యటించిన ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లాఫ్‌వెన్‌ తో సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై చర్చించారు. స్వీడన్ పర్యటన అనంతరం మోడీ బ్రిటన్ బయలుదేరి వెళ్లారు.

అయితే ప్రధాని మోడీ స్వీడన్ పర్యటనలోనూ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా సెగ తగలడం గమనార్హం. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోడీ మాట తప్పారని స్వీడన్ లోని ఎన్ఆర్ఐ లు కొందరు అక్కడ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎపికి అన్యాయం చేయొద్దని, వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని రాష్ట్రానికి చెందిన కొంతమంది ఎన్ఆర్ఐలు ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే వీరు తెలుగుదేశం జండాలను చేబూని నిరసన తెలుపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మోడీ స్వీడన్ పర్యటన... 
మోడీ స్వీడన్ పర్యటన...ఉద్దేశ్యం
ఏప్రిల్ 20 వరకు స్వీడన్, బ్రిటన్, జర్మనీ దేశాల్లో పర్యటనల దృష్ట్యా ప్రధాని మోడీ ముందుగా స్వీడన్ లో పర్యటించారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోం ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ ప్రధాని స్టీషన్ ఘన స్వాగతం పలికారు. తరువాత స్వీడన్ ప్రధాని స్వయంగా తన వాహనంలోనే భారత ప్రధాని మోడీని విమానాశ్రయం నుంచి హోటల్‌కు తీసుకెళ్ళారు. భారతదేశ ప్రధాన మంత్రి స్వీడన్‌కు వెళ్ళడం 30 ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి.

స్వీడన్ లో... 
స్వీడన్ లో...మోడీ ఏం చేసారంటే?
ముందుగా స్వీడన్ - భారత్ వాణిజ్య ఆర్థిక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆ తరువాత రెండు దేశాల దిగ్గజ వ్యాపారవేత్తలతో భారత్, స్వీడన్ ప్రధానులు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రసాంకేతికత, శుద్ధ ఇంధనం, ఆకర్షణీయ నగరాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోడీ ఇండియా - నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ఇదే సదస్సులో ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ దేశాల ప్రధానులు కూడా పాల్గొన్నారు. 

ఎపి ప్రత్యేక హోదా సెగ 
స్వీడన్ లోనూ... ఎపి ప్రత్యేక హోదా సెగ
ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్థానం చేసిన ప్రధాని మోడీ మాట నిలబెట్టుకోవాలని స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో ఎన్ఆర్ఐ లు కొందరు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎపికి అన్యాయం చేయొద్దని, వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే కేవలం ప్రత్యేక హోదా ప్లకార్డులే కాక వీరు తెలుగుదేశం పార్టీ జండాలను చేతబూని ఆందోళనలో పాల్గొనడం గమనార్హం. ఇటీవల ప్రధాని మోడీ దుబాయ్ పర్యటనలోనూ అక్కడ కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

విదేశాల్లో నిరసనలపై... 
విదేశాల్లో నిరసనలపై...భిన్నాభిప్రాయాలు
అయితే ఈ తరహా సమస్యలపై విదేశాల్లో ఎన్ఆర్ఐలు నిరసన తెలపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరేమో సమస్య పరిష్కారం కోసం ఎక్కడైనా నిరసన తెలపవచ్చని అభిప్రాయపడుతుండగా...భారత దేశ ప్రధానిగా ఉన్న వ్యక్తులు ద్వైపాక్షిక సంబంధాల కోసం విదేశీ పర్యటన కు వెళ్లినప్పుడు దేశం లోని అంతర్గత సమస్యల విషయమై విదేశాలు వేదికగా నిరసన తెలపడం సరికాదనేది మరికొందరి వాదన. దీనివల్ల దేశ ప్రధాని గౌరవానికి, పరువు మర్యాదలకు మనమే భంగం కలిగించినట్లవుతుందని, తద్వారా దేశ ప్రతిష్టకు నష్టం చేసినవాళ్లవుతారనేది వారి వాదన. అయితే ఆయా సమస్యల పరిష్కారం కోసం దేశీయంగా పోరాటం తీవ్రతరం చేయడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవడం మంచిదనేది వారి సూచన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com