ఆ మీడియా సంస్థలకు రూ.10 లక్షల జరిమానా

- April 18, 2018 , by Maagulf
ఆ మీడియా సంస్థలకు రూ.10 లక్షల జరిమానా

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కథువాలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక వివరాలను బయటకు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు పది లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలైన మైనర్‌ బాలిక వివరాలు బహిర్గతం కావడానికి కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహమే కారణమనే అభిప్రాయాలు వెలువడిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం శుక్రవారం దేశంలోని పలు దిన పత్రికలు, టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది. నిర్భయ కేసులో సంయమనం పాటించిన మీడియా ఈ కేసులో ఎందుకు అలా చేయలేకపోయిందని ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో మీడియా సంస్థలు నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

బాధితురాలి వివరాలు బహిర్గతం చేయడం ద్వారా  భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఆ డబ్బును బాధితురాలి కుటుంబానికి కోర్టు అందేజేస్తుందని వెల్లడించింది. ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బహిర్గతం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com