ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత

- April 24, 2018 , by Maagulf
ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత

హైదరాబాద్: టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1950, డిసెంబర్‌ 25న ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా, చైర్మన్‌గా అలాగే చైర్మన్ల సంఘం ఏపీ అధ్యక్షుగా ఆయన పనిచేశారు. ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే వన్నెతెచ్చిన ఆనం ఇక లేరనే విషయాన్ని నెల్లూరు జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీనిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీరుస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయిన వ్యక్తి ఆనం వివేకా.

ఆనం వివేకా అతి చిన్న వయసులోను రాజకీయాల్లోకి ప్రవేశించారు. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన ఆనం వివేకా అంచెలంచెలుగా ఎదుగుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఆనం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డి పాటు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. ఇటీవల అనారోగ్యంతో ఆనం వివేకా హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, సోమిరెడ్డి కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

ఆనం మృతి ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులను కలచివేస్తోంది. ఆనంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన చిన్న కుమారుడు మయూర్ ప్రస్తుతం కార్పొరేటర్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఆనం వివేకా భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లాలకు తరలించనున్నారు. రేపు ఆనం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com